సాగు ఢమాల్!
రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం
► మైనస్ 13.3 శాతం పడిపోయిన వృద్ధి రేటు
► రెండేళ్లుగా పరిస్థితి మరింత దుర్భరం
► కరువు, అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు
► నీళ్లు లేక పంటలే వేయని అన్నదాతలు
► పలుచోట్ల ఉద్యానవనాలు, అనుబంధ రంగాలకు మరలడమూ కారణమే
► ఈసారి వృద్ధి పెరుగుతుందని భావిస్తున్న సర్కారు
► అనుకూల పరిస్థితులు నెలకొంటేనే ఆశలు.. లేకుంటే కష్టాలే!
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో ఏటా వ్యవసాయ వృద్ధి రేటు ప్రమాదకర స్థాయిలో పడిపోతోంది. గత రెండేళ్లలో అయితే మరింత ఘోరంగా దిగజారడం రాష్ట్రంలో నెలకొన్న సాగు సంక్షోభాన్ని, అన్నదాతల దుస్థితిని కళ్లకు కడుతోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) గతేడాదితో పోలిస్తే 10.2 శాతం పెరిగినా.. వ్యవసాయ వృద్ధి ప్రతికూలంగా కొనసాగుతుండటం ఆందోళనకరంగా మారింది. జీఎస్‌డీపీ అంచనాలను తయారు చేసేటప్పుడు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు అటవీ, మైనింగ్, క్వారీలను ప్రాథమిక రంగంగా పరిగణిస్తారు. గతేడాదితో పోలిస్తే 2016–17 సంవత్సరం తొలి ఆరు నెలల్లో ప్రాథమిక రంగంలో 4.7 శాతం వృద్ధి రేటు నమోదైనట్లు ఇటీవలే రాష్ట్ర ప్రణాళిక, అర్థ గణాంక శాఖ ప్రకటించింది. కానీ విడిగా వ్యవసాయ వృద్ధిని మాత్రమే పరిశీలిస్తే.. రాష్ట్రంలో రైతుల కష్టాల సాగులోని లోతుపాతులు తేటతెల్లమవుతున్నాయి.
మరింత కిందికి..
2014–15 జీఎస్‌డీపీ అంచనాల ప్రకారం వ్యవసాయ వృద్ధి రేటు అప్పటి ధరల ప్రకారం –6.1గా నమోదైంది. 2015–16లో ఇది ఏకంగా –13.3కి పడిపోయింది. స్థిర ధరల ప్రకారం నమోదైన అంచనాలూ ఇదే తీరును ప్రతిబింబిస్తున్నాయి. దీని ప్రకారం 2014–15లో –14.2 శాతమున్న వృద్ధి రేటు 2015–16లో –18.2 శాతానికి పడిపోయింది. ఇటీవల ప్రకటించిన ఆర్థిక సంవత్సరపు తొలి ఆరు నెలల అంచనాల్లో ప్రాథమిక రంగం వృద్ధి రేటు 4.7 శాతంగా నమోదైంది. అందులో చేపల పెంపకం, అటవీశాఖ, ఉద్యానవనాల ద్వారా వచ్చిన స్థూల ఉత్పత్తిని విలీనం చేశారు. విడిగా పంటల సాగు వృద్ధి రేటును పరిగణిస్తే ఈ ఏడాది సైతం వ్యవసాయం మైనస్‌లోనే ఉండడం ఖాయమైంది. దీంతో జీఎస్‌డీపీలో వ్యవసాయ వాటా గణనీయంగా తగ్గిపోయింది.
కరువు, అకాల వర్షాలతో తంటాలు
పంటల సాగు విస్తీర్ణం, ఉత్పాదకత, పంట ఉత్పత్తుల ధరలను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ వృద్ధిని అంచనా వేస్తారు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా సాగు విస్తీర్ణం తగ్గుతుండటంతో పాటు కరువు దుర్భిక్షం, అకాల వర్షాలతో రైతులు అపార నష్టాలను చవిచూశారు. ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, వాణిజ్య పంటలు సాగు చేసే రైతులు ఉద్యాన వనాలు, వ్యవసాయ అనుబంధ రంగాల వైపు దృష్టి సారించారు. 2015లో రాష్ట్రంలో కరువు దుర్భిక్షం వెంటాడింది. కరువు మండలాలను ప్రకటించటంతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపు కోసం రాష్ట్రం కేంద్ర సాయాన్ని కూడా కోరింది. ఇక గతేడాది అకాల వర్షాలతోనూ పంట నష్టం వాటిల్లింది. మరోవైపు గత రెండేళ్లుగా వ్యవసాయానికి మించి ఆదాయం తెచ్చిపెట్టే రంగాలను రైతులు ఆశ్రయించారని.. అందుకే వృద్ధి రేటు పడిపోయిందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి.
మరోవైపు ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ, వడ్డీ లేని రుణాలు, మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ యాంత్రీకరణ, విత్తనాలు, ఎరువుల సబ్సిడీ, పాలీహౌస్‌లు, గోదాముల నిర్మాణ పథకాలు రైతులకు అండగా నిలిచాయని, ఈ ఏడాది వృద్ధి రేటు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసుకుంటోంది. కానీ ప్రతికూల పరిస్థితులు కొనసాగితే వ్యవసాయానికి ఆలంబనగా ఉండే తక్షణ కార్యక్రమాలు, పథకాలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.