లీకువీరులెవరు?
ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కు తీసుకోని పక్షంలో జిల్లా, డివిజనల్ కేంద్రాల్లో రైతులతో ధర్నాలకు దిగుతామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించడంతో చంద్రబాబు సర్కారు దిగి వచ్చి వెనక్కు తగ్గిన విషయం విదితమే. పంటలబీమా, పెట్టుబడి రాయితీ వేర్వేరుగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని శనివారం సీఎం ఇచ్చిన ఆదేశం మేరకు వ్యవసాయ అధికారులు తాజాగా ఆదివారం కొత్త మార్గదర్శకాలు తయారు చేశారు.
రాయలసీమ నాలుగు జిల్లాల్లోని రైతులకు రూ.1597.51 కోట్ల పెట్టుబడి రాయితీ, రూ. 534 కోట్ల పంటల బీమా కలిపి మొత్తం 2131.51 కోట్లు, కోస్తాలోని ప్రకాశం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో పంటలు కోల్పోయిన రైతులకు రూ.82.51 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని వ్యవసాయ అధికారులు గణాంకాలు రూపొందించారు. ఆధార్ ఆధారిత రైతుల బ్యాంకు ఖాతాలకు పెట్టుబడి రాయితీ, పంటలబీమా మొత్తాలను ఆన్‌లైన్ ద్వారా జమ చేయాలంటూ మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ ఆయా జిల్లాల అధికారులకు ఆదివారం జారీ చేసింది.
కోస్తా జిల్లాల్లో కరువు బాధిత రైతులకు పాత నిబంధనలు (ఈనెల 13వ తేదీన జారీ చేసిన మెమో) ప్రకారమే పెట్టుబడి రాయితీ పంపిణీ చేయాలి. రాయలసీమ జిల్లాల రైతులకు మాత్రం ఆదివారం జారీ చేసిన కొత్త మెమో ప్రకారం పంటల బీమా, పెట్టుబడి రాయితీ ఇవ్వాలంటూ వ్యవసాయశాఖ పంపిన ఈమెయిల్ ఆదేశాలు ఆదివారం క్షేత్రస్థాయి అధికారులకు అందాయి. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సులో ఈ అంశంపై మాట్లాడతారని, తర్వాత పెట్టుబడి రాయితీ, పంటల బీమా మొత్తాలను రైతుల ఖాతాలో ఆన్‌లైన్ ద్వారా జమ చేసే కార్యక్రమం ఆరంభిస్తారని రాయలసీమ జిల్లాకు చెందిన ఒక కలెక్టరు తెలిపారు.