ఖరీఫ్‌.. ఉఫ్‌! | kharif.. dreams down | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌.. ఉఫ్‌!

Published Mon, Aug 22 2016 9:15 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

ఓ గ్రామంలో ఎండిన మొక్కజొన్న, వరి పంటలు - Sakshi

ఓ గ్రామంలో ఎండిన మొక్కజొన్న, వరి పంటలు

  • జాడలేని వానలు
  • ఎండుతున్న పంటలు.. ఆశల్లేని రైతులు
  • అడ్డాపై కూలీగా పనుల కోసం పరుగులు
  • మెదక్‌: ఖరీఫ్‌ కన్నీరు పెట్టిస్తోంది.. ఆశలన్నీ సూరీడు ఆవిరి చేస్తున్నాడు.. వరుణుడు మొఖం చాటేశాడు.. పంటలన్నీ ఎండిపోతున్నాయి. పెట్టుబడులు రాని దుస్థితి. అప్పులు మీదపడ్డాయి. బతుకు కష్టమవుతోంది.. మళ్లీ పొట్టచేతపట్టుకుని రైతన్న వలసబాట పడుతున్నాడు.

    అన్నదాతను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సరైన వర్షాలు కురవక.. ఖరీఫ్‌ సాగక.. రైతన్న ఆందోళనకు గురవుతున్నాడు. వర్షాకాలం ప్రారంభంలో కురిసిన అడపాదడపా వర్షాలకు సాగుచేసిన ఆరుతడి పంటలు కూడా ఎండిపోతున్నాయి. 20 రోజులుగా వేసవిని తలపిస్తున్న ఎండలకు పంటలన్నీ చేతికందకుండా పోతున్నాయి.

    బోర్ల ఆధారంగా వేసిన వరిపంటలకూ నీరందక నెర్రలు బారాయి. కనీసం పెట్టుబడులు కూడా రాని దుస్థితి నెలకొంది. దీంతో దిక్కుతోచని స్థితిలో మళ్లీ పొట్టచేతపట్టుకుని వలస బాటపడుతున్నాడు. రెండేళ్లుగా కరువు తాండవం చేయడంతో పల్లెలను వదిలి పట్టణాలకు వలస వెళ్లిన అన్నదాతలు ఎంతో ఆశతో.. ఈసారి ఖరీఫ్‌కు సన్నద్ధమయ్యారు.

    ఈయేడు వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయన్న ఆశతో పల్లెలకు తిరిగి చేరుకున్నారు. వేలాది రూపాయల అప్పులుచేసి పంటలు సాగుచేస్తే వర్షాలు లేక సాగుచేసిన ఆరుతడి పంటలన్నీ ఎండిపోయాయి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి పల్లెల్లో కానరావడం లేదు.

    పల్లెల్లో చేసేందుకు పనులు దొరకక మెదక్‌ పట్టణంలోని కూలీల అడ్డామీదకు పల్లెల నుంచి తరలివస్తున్నారు. మాకు పనులు చూపాలని వేడుకుంటున్నారు. ఒక్కరిని కూలికి పిలిస్తే నలుగురు ఎగబడుతున్నారు. జిల్లా అంతటా కరువు పరిస్థితులే కనిపిస్తున్నాయి. మురిపించిన వర్షాల ఆధారంగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న, మినుములు, పెసర్లు, కందులు, జొన్న పంటలను 1.20లక్షల హెక్టార్లలో రైతులు వేసుకున్నారు.

    కొద్దోగొప్పో నీరు వచ్చే బోర్ల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా 35 వేల హెక్టార్లలో వరి పంటను సాగుచేశారు. వర్షాలు పడకపోవడంతో చేతికందే దశలో ఉన్న ఆరుతడి పంటలన్నీ ఎండిపోయాయి. బోరుబావుల్లో సైతం నీటి ఊటలు అడుగంటిపోయి వరి పొలాలు నెర్రలు బారాయి. ఇక చేసేదిలేక  అడ్డా మీదకు కూలీ పనులకోసం పరుగులు తీస్తున్నారు.

    మెదక్‌, పాపన్నపేట, చిన్నశంకరంపేట, మెదక్‌ మండలాల నుంచి నిత్యం వెయ్యి మందికిపైగా రైతులు కూలి పనులకు వస్తున్నారు. ఇక్కడ కూడా వారికి పనులు  చెప్పేవారు లేకపోవడంతో నిరాశతో వెనక్కి తిరిగిపోతున్నారు. ఆటో, బస్సుచార్జీలు పెట్టుకొని దూర ప్రాంతాల నుంచి పనికోసం వస్తే పనులు దొరకక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    మక్క ఎండిపోయింది సారూ..
    రెండెకరాల పొలం  ఉంది. అందులో రూ.20వేల అప్పు చేసి మొక్కజొన్న పంట వేశాను. తీరా కంకి దశకు చేరుకున్న దశలో వర్షాలు పడకపోవడంతో పంటంతా ఎండిపోయింది. దీంతో అడ్డామీదకు కూలీపని కోసం వచ్చినా.. ఇక్కడ కూడా పనిదొరకడం లేదు. ఎట్లా బతకాల్లో అర్థమైతలేదు. - నర్సింగ్‌, జానంపల్లి గిరిజనతండా

    రెండెకరాల వరి పోయినట్టే
    నాకు రెండెకరాల పొలం ఉంది. అందులో రెండు బోర్లున్నాయి. వాటిల్లో కొద్దిపాటి నీరు వస్తుండటంతో రూ.30వేల అప్పు చేసి వరి పంట సాగుచేశాను. వర్షాలు పడకపోవడంతో బోర్లలో నీటి ఊటలు అడుగంటాయి. పంట ఎండిపోతోంది. అడ్డామీద పనికొచ్చినా.. పనిచెప్పేవారే లేరు. - రైతు శ్రీను, అవుసులపల్లి

    పనులు చూపించాలి
    మళ్లీ కరువు మొదలైంది. పంటలుఎండిపోయాయి. ప్రభుత్వం స్పందించి పల్లెల్లో పనులు చూపించి ఆదుకోవాలి. బుక్కెడు కూడు కోసం అడ్డామీద పడిగాపులే.. వారానికి రెండు రోజులైన పని దొరకడం లేదు. పల్లెల్లోనే ఉపాధి పనులు చేపట్టి ఆదుకోవాలి. - ఏసుమణి, మక్తభూపతిపూర్‌

    పోషణ భారమైంది
    నాకున్న రెండెకరాల్లో మొక్కజొన్న పంట వేసిన. వర్షాలు కురవక  ఎండిపోయింది. అందుకోసం చేసిన అప్పులు మీద పడ్డాయి. బతుకు దెరువుకోసం అడ్డామీద కూలీవస్తే పని దొరకుతలేదు. కన్నబిడ్డలను పోషించుకునేందుకు ఆదేరువులేదు. ప్రభుత్వమే పనులు చూపించి ఆదుకోవాలి. - లంబాడి మీరి, జానకంపల్లితండా

    కుటుంబం చిన్నాభిన్నం
    వరుస కరువులతో నా కుటుంబం చిన్నాభిన్నమైంది. 5 ఎకరాల పొలం ఉంది. ఆరు బోర్లు వేయగా, ఒక్కదాంట్లోనే నీరుపడింది. వరుస కరువుతో పొట్టగడవక నా ముగ్గురు కొడుకులు హైదరాబాద్‌కు వలస వెళ్లారు. ఎక్కడున్నారో కూడా తెలియదు. శరీరం సహకరించక చర్చి ప్రాంగణంలో కొబ్బరికాయలు, అగ్గిపెట్టెలు, అగర్‌బత్తీలు అమ్ముకుంటున్నా. - సంగం ఎల్లయ్య, బొగుడ భూపతిపూర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement