గూడూరులో ట్యాంకర్ల ద్వారా తెచ్చిన నీరు
- ఈసారీ తప్పని తిప్పలు
- కరుణించని వరుణుడు
- ఎండుతున్న పంటలు
- మొక్క మొక్కకు నీరు పోస్తూ..
- రైతన్న పడరాని పాట్లు
శివ్వంపేటు/చేగుంట/చిన్నశంకరంపేట: మెతుకుసీమ రైతు కంట కన్నీరే.. రెండేళ్లుగా కరువుతో విలవిల్లాడిన రైతు ఎన్నో ఆశలతో ఖరీఫ్ సాగు చేయగా.. ముందు మురిపించిన వరుణుడు.. పంటలు ఎదిగే కీలక సమయంలో ముఖం చాటేశాడు. దీంతో పంటలన్నీ ఎండుముఖం పట్టాయి. చెల్క నేలల్లో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. పరిస్థితి ఇలాగే ఉంటే.. మరి కొద్ది రోజుల్లో నల్ల రేగడి భూముల్లో పంటలు కూడా నాశనమయ్యే పరిస్థితి నెలకొన్నది.
ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేయగా కనీసం పెట్టుబడి కూడా రాని దుస్థితి నెలకొంది. పలువురు రైతులు ఇతర ప్రాంతాల నుంచి బిందెల ద్వారా నీటిని తీసుకువచ్చి మొక్కమొక్కకు నీరు పోస్తూ పాట్లుపడుతున్నారు. శివ్వంపేట, చేగుంట, చిన్నశంకరంపేట మండలాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.