పంటలు ఎండిపోకుండా చర్యలు | Udaya Samudram Project will be completed by next Khariff | Sakshi
Sakshi News home page

పంటలు ఎండిపోకుండా చర్యలు

Published Sat, Mar 24 2018 4:06 AM | Last Updated on Sat, Mar 24 2018 4:06 AM

Udaya Samudram Project will be completed by next Khariff - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పంటలు ఎండిపోయే పరిస్థితి లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి వచ్చే ఖరీఫ్‌లో పంటలకు నీరందిస్తామని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, నల్లమోతు భాస్కర్‌రావు, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, చెన్నమనేని రమేశ్‌ తదితరులు అడిగిన ప్రశ్నలకు హరీశ్‌ సమాధానమిచ్చారు. ‘‘పదేళ్ల కింద కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉదయ సముద్రం ప్రాజెక్టును ప్రారంభించింది.

కానీ కమీషన్ల కోసం కేవలం పంపులు, పైపులు తెచ్చిపెట్టి బిల్లులు తీసుకున్నారు. 2014 వరకు పనులు కదలలేదు. కరువు పీడిత ప్రాంతాలకు జీవమిచ్చే ప్రాజెక్టు కావడంతో.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. వచ్చే వానాకాలం నుంచి ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలకు సాగునీరిస్తాం. 40 చెరువులను నింపుతాం..’’అని చెప్పారు. ఇక మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కోయిల్‌సాగర్‌ కుడి, ఎడమ కాల్వలను ఆధునీకరిస్తున్నామని, ప్రాజెక్టు కింద 58 వేల ఎకరాలకు నీరందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఏప్రిల్‌ 20 నుంచి రైతులకు పాస్‌పుస్తకాలు: మహమూద్‌ అలీ
రైతులకు ఏప్రిల్‌ 20వ నుంచి పట్టాదారు పాస్‌ పుస్తకాలను అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి మహముద్‌ అలీ తెలిపారు. ధరణి వెబ్‌సైట్‌లో భూములకు సంబంధించిన అన్ని వివరాలను పొందుపరుస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, అరూరి రమేశ్, శ్రీనివాస్‌గౌడ్, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.34 కోట్ల ఎకరాల్లో 93 శాతం భూరికార్డుల ప్రక్షాళన పూర్తయిందని పేర్కొన్నారు.

6,180 మందికి పునరావాసం: పద్మారావుగౌడ్‌
రాష్ట్రంలో గుడుంబా తయారీని పూర్తిగా రూపుమాపామని ఎౖMð్సజ్‌ మంత్రి పద్మారావుగౌడ్‌ తెలిపారు. గుడుంబా అంశంపై దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పద్మారావు సమాధానమిచ్చారు. గుడుంబా విక్రేతల్లో ఇప్పటివరకు 6,180 మందికి పునరావాసం కల్పించామని చెప్పారు. అందరికీ ఉపాధి కల్పిస్తేనే గుడుంబా నిర్మూలన అవుతుందని స్పీకర్‌ మధుసూదనాచారి పేర్కొన్నారు. ధూల్‌పేటలో ఐదెకరాల్లో  ఏదైనా పరిశ్రమను నెలకొల్పుతామని మంత్రి వెల్లడించారు.

మహిళల కోసం 102 అంబులెన్స్‌ సేవలు: లక్ష్మారెడ్డి
గ్రామీణ మహిళలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 102 అంబులెన్స్‌ సర్వీసును అమలు చేస్తున్నట్లు వైద్యారోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 241 వాహనాలను ఈ సేవలకు వినియోగిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖ, బొడిగె శోభ, కోవ లక్ష్మి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

మరో 3 వేల ఆలయాలకు ధూపదీప నైవేద్యం: ఇంద్రకరణ్‌రెడ్డి
దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రవ్యాప్తంగా మరో 3 వేల ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకాన్ని వర్తింపజేసేందుకు ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శాసనసభలో వెల్లడించారు. ప్రస్తుతం 1,805 ఆలయాలకు ఈ పథకం అమలవుతోందన్నారు. ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఒడితెల సతీశ్‌కుమార్, పుట్ట మధుకర్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.  

మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు: హరీశ్‌
మున్సిపాలిటీల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందుకు భారీగా నిధులను ఇవ్వబోతోందని మంత్రి హరీశ్‌ పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో పద్దులపై చర్చ అనంతరం సభ్యుల ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు.  

లైబ్రరీల్లో ఇంటర్‌నెట్, వైఫై: కడియం
అన్ని జిల్లాల కేంద్ర గ్రంథాలయాల్లో విద్యార్థులకు ఉపయోగపడే పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ గ్రంథాలయాల్లో ఇంటర్‌నెట్, వైఫై సేవలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సభ్యులు పాతూరి సుధాకర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 21 కొత్త జిల్లాల్లో నిర్మించే గ్రంథాలయాలకు ఒకే రకమైన డిజైన్‌ రూపొందించామని, ఒక్కోదానికి రూ.కోటిన్నర ఖర్చుచేయనున్నామని తెలిపారు.  

ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యం: మహేందర్‌రెడ్డి
డ్రైవర్ల వైద్య పరీక్షలకు ఆర్టీసీ ప్రాధాన్యం ఇస్తోందని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. సంస్థలో పని చేస్తున్న 56 వేల మంది ఉద్యోగుల కోసం ఏటా రూ.48 కోట్లతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. తార్నాకలోని 200 పడకల ఆర్టీసీ ఆస్పత్రిలో, కరీంనగర్‌లోని 12 పడకల ఆస్పత్రితో పాటు రాష్ట్రంలోని మరో 15 డిస్పెన్సరీల్లో ఆర్టీసీ సిబ్బందికి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

విద్యుత్‌ టారిఫ్‌ రేట్లను సవరించే ప్రతిపాదన లేదు: జగదీశ్‌రెడ్డి
రాష్ట్రంలో విద్యుత్‌ టారిఫ్‌ స్లాబులు, రేట్లను సవరించే విషయం పరిశీలనలో లేదని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ‘డిస్కంల భారాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఉదయ్‌ పథకంలో చేరడం ద్వారా రూ.8,923 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. అయినా రూ.1,610 కోట్ల మేర డిస్కంల మీద ఇప్పటికీ భారం ఉంది’అని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్‌ సబ్సిడీ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

ఆర్‌డబ్ల్యూఎస్‌లో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల్లేవ్‌: సండ్ర
ఆర్‌డబ్ల్యూఎస్‌లోని 4,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు పది నెలలుగా జీతాలు అందటం లేదని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. రోజుకు 500–600 గ్రానైట్‌ లారీల ప్రయాణంతో సత్తుపల్లి రోడ్డు మృత్యుమార్గంగా మారిందని, దాన్ని నాలుగు వరుసలకు విస్తరించటంతోపాటు డ్రైవర్లకు సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించాలని కోరారు.

పాత పైపులైన్లతో సమస్యే: ఆర్‌.కృష్ణయ్య
మిషన్‌ భగీరథ పథకం కింద గ్రామం వరకు కొత్త పైపులైన్లు నిర్మించి గ్రామాల్లో అప్పటికే ఉన్న పాత లైన్లనే వాడబోతున్నారని, అవి అస్తవ్యస్తంగా ఉన్నందున ప్రజల ఆరోగ్యాలకు మళ్లీ ఇబ్బంది తప్పదని టీడీపీ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు మండల కేంద్రాల్లో కార్యాలయాలు నిర్మించాలని కోరారు.

నేనొచ్చిన బస్సు 3 సార్లు ఆగిపోయింది: సున్నం రాజయ్య
ఆర్టీసీ బస్సుల కండిషన్‌ అధ్వానంగా తయారైందని, తన నియోజకవర్గం నుంచి హైదరాబాద్‌కు తానొచ్చిన బస్సు నార్కెట్‌పల్లి–చౌటుప్పల్‌ మధ్య మూడు సార్లు ఆగిపోయిందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య.. సభ దృష్టికి తెచ్చారు. వాటిని బాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏజెన్సీలో తెల్ల బెల్లం కనిపిస్తే ఎక్సైజ్‌ పోలీసులు కేసులు పెడుతున్నారని, శ్రీరామ నవమికి పానకం కోసం బెల్లం కొనాలంటే జనం భయపడుతున్నారని పేర్కొన్నారు. గుడుంబాను నియంత్రించాలని కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement