అదంతా కాంగ్రెస్‌ పాపమే.. | Congress Has Committed Not Giving National Status To The kaleshwaram project Says Harish Rao | Sakshi
Sakshi News home page

అదంతా కాంగ్రెస్‌ పాపమే..

Published Sun, Sep 15 2019 3:51 AM | Last Updated on Sun, Sep 15 2019 3:51 AM

Congress Has Committed Not Giving National Status To The kaleshwaram project Says Harish Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా చేసిన పాపం కాంగ్రెస్‌ పారీ్టదేనని ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఏపీలోని పోలవరానికి జాతీయ హోదా కల్పించి, కాళేశ్వరానికి ఆ హోదా రాకుండా చేసి కాంగ్రెస్‌ తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకంటే రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌ పనిచేస్తున్న విషయాన్ని గమనించిన ప్రజలు ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు. జాతీయహోదా కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరలేదని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం న్యాయం కాదన్నారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేశారని, ఇరిగేషన్‌శాఖ మంత్రిగా తాను కేంద్రమంత్రి గడ్కరీని కోరానని, పదుల సార్లు విజ్ఞప్తులతో పాటు, ప్రభుత్వం లేఖలు సైతం రాసిందన్నారు. ప్రాణహిత, ఇతర ప్రాజెక్టులను కోర్టులో కేసులు వేసి అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు.

శ్వేతపత్రం ప్రకటించాలి: జీవన్‌రెడ్డి
బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరంను జాతీయ ›ప్రాజెక్టుగా గుర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. ఇటీవల రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుడు ఎం.ఏ.ఖాన్‌ వేసిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిస్తూ, ప్రతిపాదిత ప్రొఫార్మాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక అందలేదని చెప్పారన్నారు. ఈ విషయంలో కేంద్రం తప్పుదోవ పట్టిస్తోందా లేక రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు చెప్పడం లేదా అని ప్రశ్నించారు. ఇందులో బీజేపీ, టీఆర్‌ఎస్‌ దోబూచులాట ఏంటని జీవన్‌ రెడ్డి నిలదీశారు. దీనిపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయరంగం ప్రాధాన్యతాంశం కాగా ప్రభుత్వం రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా వంటివి సరిగా అమలుచేయడం లేదన్నారు. కేంద్రం ఆయుష్మాన్‌ భారత్‌ను ఆరోగ్యశ్రీతో మిళితం చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు పీఆర్‌సీ, ఐఆర్‌ వంటివి ఇవ్వకపోవడం సరికాదన్నారు.

ఆకట్టుకున్న పల్లా..
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన ప్రసంగంతో సభను ఆకట్టుకున్నారు. తెలంగాణ వచి్చన నాడు సరైన బడ్జెట్‌ అంచనాలే లేని పరిస్థితినుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సీఎం పడిన కష్టాన్ని అర్థవంతంగా సభకు వివరించారు. తెలంగాణ ఏర్పాటయిన నాటినుంచి నేటి వరకు పలు కీలక రంగాలు కేసీఆర్‌ దార్శనికతతో ఎట్లా అభివృద్ధి చెందాయో సోదాహరణంగా, గణాంకాలతో సహా వివరిం చారు. అదే సమయంలో ప్రతిపక్ష సభ్యులు తమ ప్రసంగాల్లో చేసిన విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చి పలు సందేహాలను నివృత్తి చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్, విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు సహా తెలంగాణను ఆర్థికంగా అంచెలంచెలుగా సీఎం ఎట్లా ముందుకు తీసుకుపోతున్నారో పల్లా వివ రించారు. ప్రతిపక్షాలకు రాజకీయాలే తప్ప తెలంగాణ ప్రజల బాగోగులు పట్టవన్నారు. నాటు పడవలు ఎక్కి మోటుమాటలు మాట్లాడు తున్నారని కాంగ్రెస్‌ సభ్యులను దుయ్యబట్టారు. బీజేపీ సభ్యులకు తెలంగాణ అంటే చిన్నచూపుఎందుకని ప్రశ్నించారు.  

నిరుద్యోగ భృతి ఏదీ?
బడ్జెట్‌లో నిరుద్యోగ యువతకు భృతి చెల్లింపునకు సంబంధించి ప్రస్తావన లేదని బీజేపీ సభ్యుడు ఎన్‌.రాంచంద్రరావు విమర్శించారు. హైకోర్టును పాతబస్తీ నుంచి తరలించొద్దని ఎంఐఎం సభ్యుడు అమీనుల్‌ జాఫ్రీ విజ్ఞప్తి చేశారు. మాంద్యం నేపథ్యంలో భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఎలా సాధిస్తుందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు ఆకుల లలిత, పురాణం సతీశ్‌ బడ్జెట్‌పై ప్రసంగించారు. అనంతరం ఆదివారానికి సభ వాయిదా పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement