సాక్షి, న్యూఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కేంద్రాన్ని టీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు సోమ వారం లోక్‌సభలో ‘రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం’పై జరిగిన చర్చలో మాట్లాడారు. ‘తెలం గాణ ఏర్పడి కొద్దికాలమే అయినా రైతుల గురించి ఆలోచించి సీఎం కేసీఆర్ అనేక సాగునీటి ప్రాజెక్టులు ఆరంభించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును మూడేళ్లలో నిర్మించగలిగారు. దీనికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మొదటి నుంచీ కోరుతున్నాం. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చి ఐదేళ్లు గడిచినా అనేక నిబంధనలు అమలు కాకుండా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలంగాణ అభివృద్ధికి అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి. నదుల అనుసంధానం చేపట్టి తద్వార కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా నిధులు అందజేయాలి’అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment