సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ కేంద్రాన్ని అడిగారో లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు శనివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. తుమ్మిడిహెట్టి వద్ద రూ.లక్ష కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి రాజ్యసభలో ఎంపీ ఎం.ఎ.ఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలవనరుల సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా 2019 జూలై 1న సమాధానమిస్తూ.. 2016లో సీఎం కేసీఆర్ రాసిన లేఖ మినహా నిర్దేశిత రూపంలో తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదని చెప్పారని ఆ లేఖలో గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ నేతలేమో తాము అడిగినా బీజేపీ ఇవ్వడం లేదని చెబుతున్నారని, ఇందులో ఏది నిజమో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా అడిగి ఉంటే వాటిని బహిర్గతం చేసి రాజ్యసభలో అబద్ధం చెప్పిన కేంద్ర మంత్రికి సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment