‘కాళేశ్వరానికి’ జాతీయ హోదా ఇవ్వండి | KCR asked central govt for national status to Kaleshwaram project | Sakshi
Sakshi News home page

‘కాళేశ్వరానికి’ జాతీయ హోదా ఇవ్వండి

Published Sat, Jun 22 2019 3:29 AM | Last Updated on Sat, Jun 22 2019 3:29 AM

KCR asked central govt for national status to Kaleshwaram project - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. మిషన్‌ భగీరథ, కాకతీయ ప్రాజెక్టులకు నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకు నిధులివ్వాలన్నారు. కేంద్ర బడ్జెట్‌ కసరత్తులో భాగంగా రాష్ట్రాల ప్రతిపాదనలు, సూచనలు తీసుకొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రత్యేక సమావేశం జరిగింది.

ఈ భేటీలో సీఎం కేసీఆర్‌ పాల్గొనాల్సి ఉన్నప్పటికీ కాళ్వేరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం వల్ల ఆయన హాజరుకాలేకపోయారు. ఆయన తరఫున రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హజరై ముఖ్యమంత్రి ప్రసంగ పాఠాన్ని చదివి వినిపించారు. కాళేశ్వం ప్రాజెక్టుకు జాతీయ హోదాతోపాటు బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ పనులను వేగవంతం చేయాలని, వెనుకబడిన జిల్లాల జాబితాలో రాష్ట్రంలోని 32 జిల్లాలను చేర్చాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలన్నారు.ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 88 వేల కోట్లు ఖర్చు అవుతున్నాయని, వాటిలో అధిక భాగం కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా సమీకరించిన అప్పులే అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు.
 
స్టీల్‌ప్లాంట్‌ ప్రక్రియ వేగవంతం చేయాలి... 
ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయలకు నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకు నిధులు కేటాయించాలని రామకృష్ణారావు కోరారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున, పాత జిల్లాలు తొమ్మిదింటికి మాత్రమే రూ. 450 కోట్లు కేటాయిస్తున్నారని, ఆ మొత్తాన్ని కొత్తగా ఏర్పాటైన జిల్లాలు కలిపి 32 జిల్లాలకు వర్తింపజేయాలని కోరారు. ఏపీ పునర్వి భజన చట్టం 2014 హామీ మేరకు ఏర్పాటు కావాల్సిన స్టీల్‌ ప్లాంట్‌ ఇంకా పెండింగ్‌ లోనే ఉందని, ఆ ప్రక్రియ వేగిరపరచాలన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానించాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement