ఆదివారం సచివాలయంలో జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు ఎర్రబెల్లి, కొప్పుల ఈశ్వర్, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల, హరీశ్‌రావు, సీఎస్ శాంతికుమారి
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టు విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది. ఎగువ గోదావరి నుంచి నీరు రాకున్నా, ప్రాణహిత ద్వారా మేడిగడ్డ రిజర్వాయర్‌కు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రతిరోజూ ఒక టీఎంసీ నీళ్లను మేడిగడ్డ నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్లకు ఎత్తిపోసేలా మోటార్లను నిర్విరామంగా 24 గంటలూ నడిపించాలి. సుందిళ్ల నుంచి అంతే నీటిని మధ్య మానేరుకు తరలించాలి. అక్కడి నుంచి సగం నీటిని దిగువ మానేరుకు, సగం నీటిని పునరుజ్జీవన వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలి.
తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తుంగతుర్తి మీదుగా సూర్యాపేటలోని చివరి ఆయకట్టు చినసీతారాం తండా దాకా సాగునీరు అందేలా పకడ్బంది చర్యలు చేపట్టాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ఆదివారం సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత కష్టపడ్డారో, అదే స్థాయిలో ప్రాణహిత, గోదావరి ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లు ఎత్తిపోస్తూ రాష్ట్రంలో తాగు, సాగునీటికి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీటిపారుదల, విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారులపై ఉందని నొక్కిచెప్పారు. ‘ఇన్ని రోజులు ఒకెత్తు... ఇప్పుడు ఒకెత్తు. ఇది నీటిపారుదల శాఖకు పరీక్షా సమయం’అని వ్యాఖ్యానించారు. పాలేరు రిజర్వాయర్‌కు నాగార్జునసాగర్ నుంచి నీరు వచ్చే అవకాశాలు ప్రస్తుతం లేనందున బయ్యన్నవాగు నుంచి నీటిని సందర్భానుసారం పాలేరుకు వదిలేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
చుక్క చుక్కనూ ఒడిసిపట్టాలి...
తాగునీటికి ప్రాధాన్యతనిచ్చి గోదావరి, కృష్ణా నదుల పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ సూచించారు. నీటిపారుదల, విద్యుత్ శాఖలు ఈ మేరకు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో తాగు, సాగునీటికి లోటు రానీయకుండా చుక్కచుక్కనూ ఒడిసిపట్టి ప్రజలకు నీటిని అందించాలన్నారు. ఎత్తిపోతలకు సరిపోయే విద్యుత్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నీటిపారుదల, విద్యుత్ శాఖ సమన్వయం చేసుకోవాలని సూచించారు.
మళ్లీ విత్తనాలు, ఎరువుల పంపిణీకి ప్రణాళిక...
ఇప్పటికే కురిసిన వానలకు పత్తి, ఇతర విత్తనాలు వేసిన ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులతో మొలకలెత్తకుండా ఎండిపోయిన నేపథ్యంలో తిరిగి రైతులు విత్తుకొనే పరిస్థితులున్నాయని ఈ నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు తిరిగి అందించగలిగే విధంగా అత్యవసర ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వ్యవసాయశాఖను కేసీఆర్ ఆదేశించారు.
సంక్షోభంలో సైతం పంటలు పండించి చూపాలి...
‘ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలో లాగా ఆలోచిస్తే కుదరదు. నీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాం. తాగునీరు, సాగునీటి అవసరాలకు సమృద్ధిగా నీరు అందుతున్నది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. సంక్షోభ సమయంలోనే మనం పంటలు పండించి చూపించాలి. అప్పుడే మనం సిపాయిలం.
అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ ఎవరి పని వారు సమర్థంగా నిర్వహిస్తూ మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. ఈ పరిస్థితిని సవాలుగా తీసుకోవాలి. ఈ ఒక్క సంవత్సరం అనుభవం భవిష్యత్ తెలంగాణ చరిత్రలో ఉపయోగపడుతుంది. ఎక్కడి ఈఎన్సీలు అక్కడే ఉండి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు నీరు అందించడమే లక్ష్యంగా నిరంతరం ఏకాగ్రతతో పనిచేయాలి. ఇందుకు అందరం కలిసి ప్రతిజ్ఞ తీసుకోవాలి’అని సీఎం స్పష్టం చేశారు.
తాగునీటి సమస్య రాకూడదు..
రాష్ట్రంలో తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని మిషన్ భగీరథ ఈఎన్సీని సీఎం ఆదేశించారు. ఉదయసముద్రం, కోయిల్ సాగర్ రిజర్వాయర్లలో కొంత నీటి కొరత ఉందని, వాటిలో నీటి నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
పంపింగ్ నిర్వహణ జెన్‌కోకు
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పంపింగ్ నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కాకుండా ప్రభుత్వరంగ సంస్థ అయిన జెన్‌కోకు ఇచ్చేలా విధివిధానాల ఖరారుకు చర్యలు చేపట్టాలని నీటిపారుదల అధికారులను సీఎం ఆదేశించారు.
నీటిని పొదుపుగా వాడాలి...
ప్రస్తుత కష్టకాలంలో ప్రజలు, రైతాంగం నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖల సూచనలు పాటిస్తూ పంటలు పండించుకోవాలని రైతులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment