కాళేశ్వరంతో సస్యశ్యామలం... | CM KCR Comments At Thimmapur Public Meeting | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంతో సస్యశ్యామలం...

Published Thu, Mar 2 2023 2:19 AM | Last Updated on Thu, Mar 2 2023 2:19 AM

CM KCR Comments At Thimmapur Public Meeting - Sakshi

కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో స్వామివారికి స్వర్ణ కిరీటాన్ని సమర్పిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. చిత్రంలో సీఎం సతీమణి శోభ, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి, కుమారులు, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

సాక్షి, కామారెడ్డి: ‘ఉమ్మడి రాష్ట్రంలో నిజాంసాగర్‌ ఆయకట్టు కోసం సింగూరు జలాలు వదలాలంటూ నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ ముందు ఎన్నో ఆందోళనలు జరిగేవి. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు రోజుల తరబడి దీక్షలు చేస్తేగానీ నీళ్లు వదిలే పరిస్థితి ఉండేది కాదు. ఆ దీక్షలు చూశా. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సింగూరు సమస్య కూడా ఒక కారణమే. కానీ ఇప్పుడు ఏడాది పొడవునా నిజాంసాగర్‌ నిండు కుండనే. నిరంతరం నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇది సాధ్యమైంది.

రాష్ట్రం సాధించుకున్నాక కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్‌కు నీటిని తెచ్చుకుంటున్నాం..’అని సీఎం చంద్రశేఖర్‌రావు చెప్పారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ (తిమ్మాపూర్‌)లోని తెలంగాణ తిరుమల దేవస్థానం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగిన కల్యాణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సీఎం తన సతీమణి శోభతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలు, భక్తులు అందించిన రెండు కిలోల స్వర్ణకిరీటాన్ని స్వామివారికి ముఖ్యమంత్రి దంపతులు సమర్పించారు. అనంతరం స్పీకర్‌ అధ్యక్షతన అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌ మాట్లాడారు. 

నాడు పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు.. 
‘తెలంగాణ హైదరాబాద్‌ రాష్ట్రంగా ఉన్నపుడు మంజీర నదిపై దేవునూరు వద్ద 50 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించాలని తలపెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటయ్యాక దాని సామర్థ్యాన్ని 30 టీఎంసీలకు కుదించి సింగూరు ప్రాజెక్టును కట్టారు. నాడు మెదక్, నిజామాబాద్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న సింగూరు ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి ఈ ప్రాజెక్టుతో తమకే ఎక్కువ లాభం జరుగుతుందనే ఉద్దేశంతో నిజామాబాద్‌ ప్రజలు ఎక్కువగా తరలివచ్చారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు సింగూరు నుంచి హైదరాబాద్‌కు మంచినీళ్లు అందించే పేరుతో నిజామాబాద్‌లో పంటలు ఎండుతున్నా సాగునీరు అందించలేదు.

సింగూరు నీటి కోసం ఎమ్మెల్యేలు యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. పంటలను కాపాడుకునేందుకు రోజుల తరబడి దీక్షలు చేసేవారు. సింగూరు మీదనే ఆధారపడిన ఘనపూర్‌ ఆనకట్ట ఆయకట్టుకు కూడా నీళ్లివ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఇలాంటి సమస్యలను చూసి చాలామంది పెద్దలతో చర్చించినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. ముఖ్యమంత్రులతో మాట్లాడినా పట్టించుకోలేదు. పైగా తృణీకార భావంతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చేపట్టడానికి నన్ను ప్రేరేపించిన ప్రధాన అంశాల్లో సింగూరు సమస్య ఒకటి..’అని సీఎం చెప్పారు. 

శ్రీనివాస్‌రెడ్డి ఎన్నో దీక్షలు చేశారు.. 
‘సింగూరు నీళ్ల కోసం పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నోసార్లు దీక్షలు చేశారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అప్పట్లో బోధన్‌ సబ్‌ కలెక్టర్‌గా ఉన్నారు. ఆయన బాన్సువాడ మీదుగా వెళ్తుంటే బతికున్నపుడు మంచినీళ్లు ఇచ్చి, గంజి పోసైనా సరే బతకనియ్యండి గానీ, చచ్చిపోయాక బిర్యానీ పెట్టినా లాభం లేదు అని పోచారం చెప్పారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నాతో కలిసి ఉద్యమంలోకి వచ్చాక, ఉప ఎన్నికల ప్రచారం కోసం వెళుతుంటే రోడ్డు మీద కలిసిన లంబాడా బిడ్డలు పోచారం సార్‌ గెలుస్తాడని ముందే చెప్పారు. పోచారం అంటే ఈ ప్రాంత ప్రజలకు అంత అభిమానం.  

నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు 
ఇక్కడి మంచి చెడులు తెలిసిన వ్యక్తిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి నియోజక వర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఈ వయసులో హోదాను సైతం పక్కనబెట్టి నియోజకవర్గంలో చిన్న పిల్లవాడిలా తిరుగుతూ ప్రజల కష్ట సుఖాల్లో భాగమవుతున్నారు. బాన్సువాడ మెటర్నిటీ ఆస్పత్రికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందంటే దానిపై పోచారం పర్యవేక్షణ ఎంత ఉందో అర్థమవుతోంది..’అని కేసీఆర్‌ అన్నారు.  

ఈ ప్రాంతం సుభిక్షంగా వర్ధిల్లాలని కోరుకున్నా.. 
బాన్సువాడ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందంటూ.. తన ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి నియోజకవర్గానికి రూ.50 కోట్లు, ఆలయానికి రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన మిత్రులతో కలిసి ఈ ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేశారంటూ అభినందించారు. స్వామి కరుణ, దయ యావత్‌ తెలంగాణ ప్రజల మీద ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.

పచ్చని పంటలతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా వర్ధిల్లాలని వేడుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, సురేశ్‌రెడ్డి, జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

నేను కూడా ముసలోణ్ణి అవుతున్నా.. 
‘నేను కూడా ముసలోణ్ణి అవుతున్నా. 69 ఏళ్లు వచ్చినయి. నా కన్నా వయస్సులో పెద్దవాడైనా నేనున్నన్ని రోజులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ ప్రజలకు సేవ చేస్తాడు. ఆయన మాటే బ్రహ్మాస్త్రం. శ్రీనివాస్‌రెడ్డి ఫోన్‌ చేస్తే చీఫ్‌ సెక్రెటరీ అయినా, సీఎం అయినా మాట్లాడతారు. ఏ పని అయినా అవుతది..’అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement