సాక్షి, హైదరాబాద్: దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ ముదురు ఎరుపు (మెరూన్) రంగు పట్టాదార్ పాస్‌బుక్స్ జారీచేయను న్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రజల దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాలను ఆశించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. భూ వివాదాలు, ఘర్షణల నుండి ప్రజలను శాశ్వతంగా రక్షించడం కోసం, ఆస్తులకు పక్కా హక్కులు కల్పించడం కోసం ఈ పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు íసీఎం చెప్పారు. కొత్తగా అమల్లోకి తెస్తున్న విప్లవాత్మక రెవెన్యూ చట్టంతో పేద, మధ్య తరగతి సహా ప్రజలందరి ఆస్తులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమ న్నారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశాలపై బుధవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్ రూపకల్పనలో కాస్త ఆలస్యమైనా పర్వాలేదు కానీ... పోర్టల్ ప్రారంభమైన తర్వాతే వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్ ప్రక్రియ జరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సాదాబైనామాలకు చివరి అవకాశం
గ్రామీణ ప్రాంతాల్లో భూముల కొనుగోళ్ల పరస్పర మార్పిడికి సంబంధించిన సాదాబైనామాలను ఉచితంగా మ్యుటేషన్ చేయించే ప్రక్రియకు చివరిసారిగా త్వరలో అవకాశం కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని , భవిష్యత్తులో ఇక సాదాబైనామాలను అనుమతించే ప్రశ్నే లేదని సీఎం తెలిపారు. అయితే ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇంకా వివాదాలు ఉంటే కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందని సీఎం వివరించారు.
పేదల ఇళ్లు క్రమబద్ధీకరణ..
నిరుపేద ప్రజలు ఎన్నో ఏళ్లుగా వుంటున్న ఇండ్ల స్థలాలను పూర్తిస్థాయిలో రెగ్యులరైజ్ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనివల్ల నిరుపేదల ఇంటి స్థలాలకు రక్షణ ఏర్పడడమే కాకుండా, ఆ ఆస్తుల మీద బ్యాంకు రుణాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలోని వ్యవసాయ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లు, ఇతర ఆస్తులకు ఉచితంగా నాలా కన్వర్షన్ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. వ్యవసాయ భూముల వద్ద నిర్మించుకున్న ఇండ్లు తదితర ఆస్తుల విస్తీర్ణాన్ని వ్యవసాయ కేటగిరి నుంచి తొలగించే విషయంలో ప్రజలకు సర్పంచులు, ఎంíపీటీసీలు, గ్రామ కార్యదర్శులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించాలని, ఎంపీఓలు పర్యవేక్షించాలని సూచించారు.
మ్యుటేషన్ తప్పనిసరి.. ఉచితం
ఆస్తుల మ్యుటేషన్ ఇప్పుడు చేయించుకోకపోతే భవిష్యత్తులో ఆస్తులను తమ పిల్లలకు బదిలీ చేసే విషయంలో ప్రమాదం తలెత్తే అవకాశం వుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలోని ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల దగ్గర నిర్మించుకున్న, బావుల కాడి ఇండ్లు, ఫామ్ హౌజ్‌లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ఆన్‌లైన్‌లో ఎన్‌రోల్ (మ్యుటేషన్) చేయించుకోవాలని సీఎం రాష్ట్ర ప్రజలకు విజప్తి చేశారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లోని ప్రతీ ఇంటి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావాలి, ఇంటికి నెంబర్ కేటాయించాలి, పన్నులు వసూలు చేయాలి అని సీఎం ఆదేశించారు. ఎండోమెంట్, వక్ఫ్, ఎఫ్‌టీఎల్, నాలా, యూఎల్‌సీ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లకు మ్యుటేషన్ వర్తించదని సీఎం స్పష్టం చేశారు. ఇకముందు ఒక ఇంచు భూమి బదిలీ కావాలంటే కూడా... ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతుందని సీఎం తెలిపారు. అందుకే వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని సీఎం ప్రజలను కోరారు. ఆస్తుల మ్యుటేషన్‌కు, ఎల్‌ఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఇండ్లు ఎలా నిర్మించారనేది పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు, నిబంధనలకు లోబడే వుంటుందని సీఎం వివరించారు. భవిష్యత్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియ, క్రమబద్ధీకరణ, ఉచిత నాలా కన్వర్షన్ చేయడం... ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని, ఇదే చివరి అవకాశమని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు కె.టి.రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నోటరీ, జీ.వో 58, 59 స్థలాల ఉచిత క్రమబద్ధీకరణ
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉన్న నోటరీ, జీవో 58, 59 పరిధిలోని పేదల ఇండ్లను ఉచితంగా క్రమబద్దీకరించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఒకటి రెండు రోజుల్లో జీవో ద్వారా వెల్లడించనున్నట్లు వివరించారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేత్తర ఆస్తుల ఆన్‌లైన్ నమోదు, నోటరీ, జీవో 58, 59 ఆస్తుల ఉచిత క్రమబద్దీకరణ తదితర అంశాలపై గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నారు.
వ్యవసాయేతర ఆస్తులకు..మెరూన్ పాస్‌బుక్
Published Thu, Sep 24 2020 3:59 AM | Last Updated on Thu, Sep 24 2020 9:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment