pattadar passbooks
-
వ్యవసాయేతర ఆస్తులకు..మెరూన్ పాస్‌బుక్
సాక్షి, హైదరాబాద్: దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ ముదురు ఎరుపు (మెరూన్) రంగు పట్టాదార్ పాస్‌బుక్స్ జారీచేయను న్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రజల దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాలను ఆశించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. భూ వివాదాలు, ఘర్షణల నుండి ప్రజలను శాశ్వతంగా రక్షించడం కోసం, ఆస్తులకు పక్కా హక్కులు కల్పించడం కోసం ఈ పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు íసీఎం చెప్పారు. కొత్తగా అమల్లోకి తెస్తున్న విప్లవాత్మక రెవెన్యూ చట్టంతో పేద, మధ్య తరగతి సహా ప్రజలందరి ఆస్తులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమ న్నారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశాలపై బుధవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్ రూపకల్పనలో కాస్త ఆలస్యమైనా పర్వాలేదు కానీ... పోర్టల్ ప్రారంభమైన తర్వాతే వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్ ప్రక్రియ జరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సాదాబైనామాలకు చివరి అవకాశం గ్రామీణ ప్రాంతాల్లో భూముల కొనుగోళ్ల పరస్పర మార్పిడికి సంబంధించిన సాదాబైనామాలను ఉచితంగా మ్యుటేషన్ చేయించే ప్రక్రియకు చివరిసారిగా త్వరలో అవకాశం కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని , భవిష్యత్తులో ఇక సాదాబైనామాలను అనుమతించే ప్రశ్నే లేదని సీఎం తెలిపారు. అయితే ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇంకా వివాదాలు ఉంటే కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందని సీఎం వివరించారు. పేదల ఇళ్లు క్రమబద్ధీకరణ.. నిరుపేద ప్రజలు ఎన్నో ఏళ్లుగా వుంటున్న ఇండ్ల స్థలాలను పూర్తిస్థాయిలో రెగ్యులరైజ్ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనివల్ల నిరుపేదల ఇంటి స్థలాలకు రక్షణ ఏర్పడడమే కాకుండా, ఆ ఆస్తుల మీద బ్యాంకు రుణాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలోని వ్యవసాయ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లు, ఇతర ఆస్తులకు ఉచితంగా నాలా కన్వర్షన్ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. వ్యవసాయ భూముల వద్ద నిర్మించుకున్న ఇండ్లు తదితర ఆస్తుల విస్తీర్ణాన్ని వ్యవసాయ కేటగిరి నుంచి తొలగించే విషయంలో ప్రజలకు సర్పంచులు, ఎంíపీటీసీలు, గ్రామ కార్యదర్శులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించాలని, ఎంపీఓలు పర్యవేక్షించాలని సూచించారు. మ్యుటేషన్ తప్పనిసరి.. ఉచితం ఆస్తుల మ్యుటేషన్ ఇప్పుడు చేయించుకోకపోతే భవిష్యత్తులో ఆస్తులను తమ పిల్లలకు బదిలీ చేసే విషయంలో ప్రమాదం తలెత్తే అవకాశం వుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలోని ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల దగ్గర నిర్మించుకున్న, బావుల కాడి ఇండ్లు, ఫామ్ హౌజ్‌లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ఆన్లైన్లో ఎన్రోల్ (మ్యుటేషన్) చేయించుకోవాలని సీఎం రాష్ట్ర ప్రజలకు విజప్తి చేశారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లోని ప్రతీ ఇంటి వివరాలు ఆన్లైన్లో నమోదు కావాలి, ఇంటికి నెంబర్ కేటాయించాలి, పన్నులు వసూలు చేయాలి అని సీఎం ఆదేశించారు. ఎండోమెంట్, వక్ఫ్, ఎఫ్టీఎల్, నాలా, యూఎల్సీ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లకు మ్యుటేషన్ వర్తించదని సీఎం స్పష్టం చేశారు. ఇకముందు ఒక ఇంచు భూమి బదిలీ కావాలంటే కూడా... ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతుందని సీఎం తెలిపారు. అందుకే వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని సీఎం ప్రజలను కోరారు. ఆస్తుల మ్యుటేషన్‌కు, ఎల్ఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని, ఇండ్లు ఎలా నిర్మించారనేది పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు, నిబంధనలకు లోబడే వుంటుందని సీఎం వివరించారు. భవిష్యత్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియ, క్రమబద్ధీకరణ, ఉచిత నాలా కన్వర్షన్ చేయడం... ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని, ఇదే చివరి అవకాశమని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు కె.టి.రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నోటరీ, జీ.వో 58, 59 స్థలాల ఉచిత క్రమబద్ధీకరణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉన్న నోటరీ, జీవో 58, 59 పరిధిలోని పేదల ఇండ్లను ఉచితంగా క్రమబద్దీకరించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఒకటి రెండు రోజుల్లో జీవో ద్వారా వెల్లడించనున్నట్లు వివరించారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేత్తర ఆస్తుల ఆన్లైన్ నమోదు, నోటరీ, జీవో 58, 59 ఆస్తుల ఉచిత క్రమబద్దీకరణ తదితర అంశాలపై గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నారు. -
ప్రక్షాళన 'సాగు'తోంది!
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల క్రితం మొదలైన భూ రికార్డుల ప్రక్షాళన ఇంకా కొలిక్కిరాలేదు. ఇది నిరంతర ప్రక్రియే అయినా.. పాత సమస్యలను అధిగమించడంలో రెవెన్యూ యంత్రాంగం చతికిలపడింది. ఇప్పటికీ 94 శాతం మాత్రమే రికార్డుల నవీకరణ జరిగింది. పార్ట్–బీ కేటగిరీలో చేర్చిన ఖాతాలను పరిష్కరించేలా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో 3.73 లక్షల ఖాతాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 61,13,916 ఖాతాలుండగా.. వివాదరహిత భూములుగా గుర్తించిన 57,69,933 ఖాతాలకు సంబంధించి డిజిటల్ సంతకాలు జరిగాయి. ఇందులో ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ (పట్టణ) జిల్లాలు ముందంజలో ఉన్నాయి. ఈ జిల్లాల పరిధిలో క్లియర్ ఖాతాలుగా తేల్చిన వాటిలో ఏకంగా 98% మేర డిజిటల్ సంతకాలు పూర్తయ్యాయి. రికార్డుల ప్రక్షాళనలో వికారాబాద్, ములుగు, మేడ్చల్ జిల్లాలు బాగా వెనుకబడ్డాయి. ఈ జిల్లాల్లో కేవలం 90 శాతం మాత్రమే డిజిటల్ సంతకాలయ్యాయి. దీంతో ఈ జిల్లాల్లోని రైతాంగం పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం తహసీల్దార్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ఆధార్ వివరాలివ్వని 1.74 లక్షల మంది పాస్ పుస్తకాల జారీకి తప్పనిసరిగా భావించే ఆధార్ వివరాలను సమర్పించకపోవడంతో 1.74 లక్షల పట్టాదార్లకు పాస్‌బుక్కులు జారీకాలేదు. అలాగే ఆధార్ సంఖ్యను ఇచ్చినా కూడా 1.69 లక్షల ఖాతాలకు డిజిటల్ సంతకాలు పెండింగ్‌లో ఉండడంతో ఆధార్ ఇవ్వని/ఇచ్చిన 3.43 లక్షల ఖాతాల పాస్ పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు మ్యుటేషన్లు, పౌతీ, నోషనల్ ఖాతాలు పెండింగ్, ఖాతాల సవరణల పెండింగ్‌లో ఉండడం కూడా పాస్ పుస్తకాల జారీ ఆలస్యం కావడానికి కారణంగా రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. కొలిక్కిరాని పార్ట్–బీ వ్యవహారం.. భూ యాజమాన్య హక్కులపై స్పష్టతనివ్వకపోవడంతో లక్షలాది మంది రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పార్ట్–బీ జాబితాలో చేర్చిన భూముల వ్యవహారం తేల్చకపోవడంతో రెవెన్యూ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ కేటగిరీ భూములపై మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో ఎడతెగని జాప్యం జరుగుతోంది. గత రెండేళ్లుగా పాస్ పుస్తకాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగం పెదవి విరుస్తోంది. తొలి విడతలో వివాదరహిత భూములకు మాత్రమే పాస్ పుస్తకాలను జారీ చేసిన సర్కారు.. పార్ట్–బీ కేటగిరీలో ప్రభుత్వ భూములు/ఆస్తులు, అటవీ భూములు, దేవాదాయ తదితర భూములతోపాటు, వ్యవసాయేతర భూములను చేర్చింది. భూవిస్తీర్ణంలో తేడా, కోర్టు కేసులు, కుటుంబసభ్యుల భూపంపకాల్లో విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా, ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య తగాదా, ఫారెస్టు, పట్టా భూముల మధ్య వివాదస్పదమైన వాటిని కూడా పార్ట్–బీలో నమోదు చేసింది. వీటిని సత్వరమే సవరించి పరిష్కారమార్గం చూపాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకపోవడం.. పెట్టుబడి సాయం అందించాలనే తొందరలో ఈ కేటగిరీ భూముల జోలికి వెళ్లలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 3,73,051 ఖాతాలకు మోక్షం కలగలేదు. ఈ ఖాతాలకు సంబంధించిన రైతులు ప్రతిరోజు కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. -
ఐదేళ్ల బుడత.. భూ యజమాని
కోస్గి: ఐదేళ్ల బుడతడు భూ యజమానిగా మారి స్వయంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టదారు పాసు పుస్తకం అందుకున్నాడు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం లోదిపూర్‌కు చెందిన మోహన్‌రెడ్డి, లక్ష్మి దంపతులు చనిపోవడంతో వారిపేరు మీద ఉన్న 9 కుంటల భూమిని ఐదేళ్ల వారి కుమారుడు చరణ్ పేరున విరాసత్ చేశారు. ఈ మేరకు చరణ్ పేరుపై కొత్త పాసుబుక్కు రావడంతో నాయనమ్మ, తాతయ్యలతో వచ్చి కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి చేతుల మీదుగా పట్టదారు పాసు బుక్కు అందుకున్నాడు. ఐదేళ్లకే పట్టదారు అయ్యాడంటూ సభకు వచ్చిన వారు బాబును అభినందించారు. -
నేటి నుంచే రైతు పాస్‌పుస్తకాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి రాష్ట్ర రైతాంగానికి కొత్త పాస్‌పుస్తకాలు అందనున్నాయి. గురువారం నుంచి ఈనెల 19వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో (హైదరాబాద్ మినహా) గ్రామాల వారీగా ఈ పాస్‌పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పాస్‌పుస్తకాలను ఇప్పటికే క్షేత్రస్థాయికి తరలించిన రెవెన్యూ సిబ్బంది నేటి నుంచి ఈ పుస్తకాలను రైతులకు అందజేస్తారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలు, కౌంటర్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో పాస్‌పుస్తకాల పంపిణీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 57.33 లక్షల పాస్‌పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఇందులో 4.8 లక్షల మంది రైతులు ఆధార్‌ను సమర్పించకపోవడంతో వారి పుస్తకాలను ముద్రించలేదు. దీంతో పాటు మరో 1.77 లక్షల మంది ఆధార్ ఇచ్చినప్పటికీ వారి ఫోటోలు సరిగా లేకపోవడంతో వాటిని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, ఫొటోలు సరిగా లేని రైతుల పాస్‌పుస్తకాలను తర్వాత ముద్రించి ఇస్తామని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. 2016 జూన్ తర్వాత తొలిసారి వాస్తవానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2016 సంవత్సరం నుంచి పాస్‌పుస్తకాల జారీ నిలిపివేశారు. మాజీ ఐఏఎస్ అధికారి రేమండ్‌పీటర్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)గా ఉన్న సమయంలో 2016 జూన్‌లో కొత్త పాస్‌పుస్తకాల జారీని నిలిపివేశారు. నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు తీసుకుంటున్నారని ఆర్బీఐ అధికారులు ఓ సమావేశంలో చెప్పడం, 17వేల కోట్ల రూపాయల రుణమాఫీలో రూ.1,700 కోట్లు నకిలీపాస్పుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్న వారి ఖాతాల్లోకి వెళ్లాయన్న నివేదికల నేపథ్యంలో రైతు పాస్‌పుస్తకాల జారీతో పాటు అప్పటికే ఉన్న పాస్‌పుస్తకాలు కూడా చెల్లవని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భద్రతా ప్రమాణాలతో కొత్త పాస్‌పుస్తకాలు ముద్రించే బాధ్యతలను అప్పుడే మద్రాస్ ప్రింటింగ్ ప్రెస్‌కు అప్పగించారు. అయితే, సకాలంలో ఆ సంస్థ స్పందించలేదన్న కారణంతో ఎస్.కె.సిన్హా ఆ ఒప్పందాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి పాస్‌పుస్తకాల ముద్రణ అనేక మలుపులు తిరిగి ఇప్పటికి ఓ కొలిక్కి చేరింది. దీంతో రైతులకు తెలంగాణ లోగోతో తొలిసారి పాస్‌పుస్తకాలు అందనున్నాయి. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పుస్తకంపై కాకతీయ కళాతోరణాన్ని కవర్‌పేజీపై ముద్రించారు. ‘తెలంగాణ ప్రభుత్వము, పట్టాదారు పాస్‌పుస్తకము, భూమి యాజమాన్య హక్కు పత్రం’అని రాసి ఉన్న ఈ పుస్తకాలను ఇప్పుడు రైతులకు అందజేయనున్నారు. మొత్తంమీద తమ భూములకు ఎట్టకేలకు కొత్త పాస్‌పుస్తకాలు వస్తున్న నేపథ్యంలో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
పంటలు ఎండిపోకుండా చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటలు ఎండిపోయే పరిస్థితి లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి వచ్చే ఖరీఫ్‌లో పంటలకు నీరందిస్తామని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, నల్లమోతు భాస్కర్‌రావు, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, చెన్నమనేని రమేశ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు హరీశ్ సమాధానమిచ్చారు. ‘‘పదేళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉదయ సముద్రం ప్రాజెక్టును ప్రారంభించింది. కానీ కమీషన్ల కోసం కేవలం పంపులు, పైపులు తెచ్చిపెట్టి బిల్లులు తీసుకున్నారు. 2014 వరకు పనులు కదలలేదు. కరువు పీడిత ప్రాంతాలకు జీవమిచ్చే ప్రాజెక్టు కావడంతో.. టీఆర్ఎస్ ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. వచ్చే వానాకాలం నుంచి ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలకు సాగునీరిస్తాం. 40 చెరువులను నింపుతాం..’’అని చెప్పారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్ కుడి, ఎడమ కాల్వలను ఆధునీకరిస్తున్నామని, ప్రాజెక్టు కింద 58 వేల ఎకరాలకు నీరందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి రైతులకు పాస్‌పుస్తకాలు: మహమూద్ అలీ రైతులకు ఏప్రిల్ 20వ నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి మహముద్ అలీ తెలిపారు. ధరణి వెబ్సైట్లో భూములకు సంబంధించిన అన్ని వివరాలను పొందుపరుస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, అరూరి రమేశ్, శ్రీనివాస్‌గౌడ్, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.34 కోట్ల ఎకరాల్లో 93 శాతం భూరికార్డుల ప్రక్షాళన పూర్తయిందని పేర్కొన్నారు. 6,180 మందికి పునరావాసం: పద్మారావుగౌడ్ రాష్ట్రంలో గుడుంబా తయారీని పూర్తిగా రూపుమాపామని ఎౖMð్సజ్ మంత్రి పద్మారావుగౌడ్ తెలిపారు. గుడుంబా అంశంపై దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి పద్మారావు సమాధానమిచ్చారు. గుడుంబా విక్రేతల్లో ఇప్పటివరకు 6,180 మందికి పునరావాసం కల్పించామని చెప్పారు. అందరికీ ఉపాధి కల్పిస్తేనే గుడుంబా నిర్మూలన అవుతుందని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. ధూల్‌పేటలో ఐదెకరాల్లో ఏదైనా పరిశ్రమను నెలకొల్పుతామని మంత్రి వెల్లడించారు. మహిళల కోసం 102 అంబులెన్స్ సేవలు: లక్ష్మారెడ్డి గ్రామీణ మహిళలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 102 అంబులెన్స్ సర్వీసును అమలు చేస్తున్నట్లు వైద్యారోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 241 వాహనాలను ఈ సేవలకు వినియోగిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖ, బొడిగె శోభ, కోవ లక్ష్మి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మరో 3 వేల ఆలయాలకు ధూపదీప నైవేద్యం: ఇంద్రకరణ్‌రెడ్డి దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రవ్యాప్తంగా మరో 3 వేల ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకాన్ని వర్తింపజేసేందుకు ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శాసనసభలో వెల్లడించారు. ప్రస్తుతం 1,805 ఆలయాలకు ఈ పథకం అమలవుతోందన్నారు. ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఒడితెల సతీశ్‌కుమార్, పుట్ట మధుకర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు: హరీశ్ మున్సిపాలిటీల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందుకు భారీగా నిధులను ఇవ్వబోతోందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో పద్దులపై చర్చ అనంతరం సభ్యుల ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. లైబ్రరీల్లో ఇంటర్నెట్, వైఫై: కడియం అన్ని జిల్లాల కేంద్ర గ్రంథాలయాల్లో విద్యార్థులకు ఉపయోగపడే పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ గ్రంథాలయాల్లో ఇంటర్నెట్, వైఫై సేవలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సభ్యులు పాతూరి సుధాకర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 21 కొత్త జిల్లాల్లో నిర్మించే గ్రంథాలయాలకు ఒకే రకమైన డిజైన్ రూపొందించామని, ఒక్కోదానికి రూ.కోటిన్నర ఖర్చుచేయనున్నామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యం: మహేందర్‌రెడ్డి డ్రైవర్ల వైద్య పరీక్షలకు ఆర్టీసీ ప్రాధాన్యం ఇస్తోందని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. సంస్థలో పని చేస్తున్న 56 వేల మంది ఉద్యోగుల కోసం ఏటా రూ.48 కోట్లతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. తార్నాకలోని 200 పడకల ఆర్టీసీ ఆస్పత్రిలో, కరీంనగర్‌లోని 12 పడకల ఆస్పత్రితో పాటు రాష్ట్రంలోని మరో 15 డిస్పెన్సరీల్లో ఆర్టీసీ సిబ్బందికి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. విద్యుత్ టారిఫ్ రేట్లను సవరించే ప్రతిపాదన లేదు: జగదీశ్‌రెడ్డి రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్ స్లాబులు, రేట్లను సవరించే విషయం పరిశీలనలో లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ‘డిస్కంల భారాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఉదయ్ పథకంలో చేరడం ద్వారా రూ.8,923 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. అయినా రూ.1,610 కోట్ల మేర డిస్కంల మీద ఇప్పటికీ భారం ఉంది’అని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌లో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల్లేవ్: సండ్ర ఆర్‌డబ్ల్యూఎస్‌లోని 4,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు పది నెలలుగా జీతాలు అందటం లేదని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. రోజుకు 500–600 గ్రానైట్ లారీల ప్రయాణంతో సత్తుపల్లి రోడ్డు మృత్యుమార్గంగా మారిందని, దాన్ని నాలుగు వరుసలకు విస్తరించటంతోపాటు డ్రైవర్లకు సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించాలని కోరారు. పాత పైపులైన్లతో సమస్యే: ఆర్.కృష్ణయ్య మిషన్ భగీరథ పథకం కింద గ్రామం వరకు కొత్త పైపులైన్లు నిర్మించి గ్రామాల్లో అప్పటికే ఉన్న పాత లైన్లనే వాడబోతున్నారని, అవి అస్తవ్యస్తంగా ఉన్నందున ప్రజల ఆరోగ్యాలకు మళ్లీ ఇబ్బంది తప్పదని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు మండల కేంద్రాల్లో కార్యాలయాలు నిర్మించాలని కోరారు. నేనొచ్చిన బస్సు 3 సార్లు ఆగిపోయింది: సున్నం రాజయ్య ఆర్టీసీ బస్సుల కండిషన్ అధ్వానంగా తయారైందని, తన నియోజకవర్గం నుంచి హైదరాబాద్‌కు తానొచ్చిన బస్సు నార్కెట్‌పల్లి–చౌటుప్పల్ మధ్య మూడు సార్లు ఆగిపోయిందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య.. సభ దృష్టికి తెచ్చారు. వాటిని బాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏజెన్సీలో తెల్ల బెల్లం కనిపిస్తే ఎక్సైజ్ పోలీసులు కేసులు పెడుతున్నారని, శ్రీరామ నవమికి పానకం కోసం బెల్లం కొనాలంటే జనం భయపడుతున్నారని పేర్కొన్నారు. గుడుంబాను నియంత్రించాలని కోరారు. -
పాస్‌బుక్‌లో నాలా భూములూ నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతుల అదీనంలో ఉన్న వ్యవసాయేతర (నాలా) భూములను కూడా పక్కాగా రికార్డు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ భూములకు పెట్టుబడి సాయం పథకం అమలు నేపథ్యంలో వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లో సాయం అందకుండా చూడటంతో పాటు భవిష్యత్తులో క్రయవిక్రయ లావాదేవీలను సులభతరం చేసేందుకు నాలా భూముల వివరాలను కూడా రైతుల పాస్ పుస్తకంలో నమోదు చేయనున్నారు. ఇందుకోసం పాస్‌పుస్తకంలో ప్రత్యేక కాలమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రాష్ట్రంలో మొత్తం 15,16,873 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నట్లు తేలింది. అందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2.65 లక్షల పైచిలుకు ఎకరాలు ఉన్నాయి. -
పాస్ పుస్తకం.. ఓ ప్రహసనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించే ప్రక్రియ ప్రహ సనంగా మారుతోంది. పుస్తకాల ముద్రణకు ఉద్దేశించిన ఆన్లైన్ రికార్డుల నమోదు నత్తనడకన సాగుతోంది. ప్రక్రియ ప్రారంభమై 20 రోజులు దాటుతున్నా ఇప్పటివరకు 50 శాతం భూములనే నిర్ధారించారు. అందులోనూ పాస్ పుస్తకాలకు అవసరమైన సర్వే నంబర్లు, తహశీల్దార్ల డిజిటల్ సంతకాలతో సిద్ధం చేసిన భూమి వివరాలు 5% కూడా దాటలేదు. మరోవైపు పుస్తకాల ముద్రణ బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వ ప్రింటింగ్ ప్రె స్ తప్పుకోవడం, ముద్రణకు సంబంధించి కొత్త టెండర్లు ఖరారు కాకపోవడంతో పుస్తకాల జారీ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. కొత్త మాడ్యూల్లో... భూ రికార్డుల ప్రక్షాళన వివరాలు ఆన్లైన్లో ఉంచేందుకు రెవెన్యూ శాఖ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రాసెస్ (ఎల్‌ఆర్‌యూపీ) పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ప్రక్షాళనలో తేలిన సర్వే నంబర్లలో 53 శాతం భూములనే నిర్ధారించారు. 1.85 కోట్ల సర్వే నంబర్లలో 2.28 కోట్ల ఎకరాలకు పైగా భూములుండగా, అందులో 99 లక్షల సర్వే నంబర్లలోని 1.13 కోట్ల ఎకరాలనే నిర్ధారించారు. అందులో వివాదాస్పద భూములు పోను 96.15 లక్షల సర్వే నంబర్లలో భూము లే సరిగా ఉన్నాయని.. వాటిలోనూ 85.68 లక్షల సర్వే నంబర్ల భూమికే పుస్తకాలు అవసరమవుతాయని, మిగిలిన 11 లక్షల సర్వే నంబర్లలోని 26 లక్షల ఎకరాలు వ్యవసాయేతర భూములని తేల్చారు. ఇప్పటివరకు 10 లక్షల ఎకరాలే.. పాస్ పుస్తకాలపై తహశీల్దార్ల డిజిటల్ సంతకం అవసరమైన నేపథ్యంలో శుక్రవారం నుంచే తహశీల్దార్లకు సంతకాలు చేసే అనుమ తిని ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఇప్పటివరకు 10,61,514 సర్వే నంబర్లలోని 4,33,305 రైతు ఖాతాల్లో ఉన్న 10,85,077 ఎకరాల భూ విస్తీర్ణానికే డిజిటల్ సంతకాలు పూర్తయ్యాయి. అంటే పాస్‌పుస్తకం ముద్రణ, జారీకి ఇప్పటివరకు సిద్ధమయింది కేవలం 10.85 లక్షల ఎకరాలే. పుస్తకాల ముద్రణ టెండర్లు ఈ నెల 3న ఖరారు కానుండటంతో తర్వాత 2 రోజుల్లో టెండర్ దక్కించుకున్న సంస్థ ముద్రణ ప్రారంభిస్తుందటున్నారు. అయితే ఎంత వేగంగా చేసినా ఆన్లైన్ రికార్డులను పూర్తిస్థాయిలో అందజేయడానికి మరో 20 రోజులు పడుతుందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. -
స్మార్ట్‌గా పాస్ పుస్తకం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : భూ రికార్డుల ప్రక్షాళనలో సరికొత్త ఆవిష్కరణలకు తెరలేచింది. భూ వివాదాలకు తావివ్వకుండా రాష్ట్ర సర్కారు డిజిటల్ పాస్‌పుస్తకాలకు శ్రీకారం చుడుతోంది. ఇటీవల రెవెన్యూ రికార్డుల నవీకరణ ప్రక్రియను పూర్తి చేసిన యంత్రాంగం.. మార్చి 11న కొత్త పాస్‌పుస్తకాల జారీకి రంగం సిద్ధం చేసింది. ఇందులోభాగంగా ఇప్పటి వరకు అమలులో ఉన్న పాస్బుక్ల స్థానే ‘స్మార్ట్’ కార్డులను ప్రవేశపెడుతోంది. ఇందులో సమగ్ర భూ వివరాలను నిక్షిప్తం చేయనుంది. ఈ సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరచనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న ప్రభుత్వం.. ఈ సమాచారాన్ని తారుమారు చేయకుండా అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తోంది. ప్రస్తుతం పాస్‌పోర్టుల జారీలో అవలంభిస్తున్న విధానం మాదిరి ఈ కార్డులకు రూపకల్పన చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీలోని నేషనల్ హై సెక్యూరిటీ ముద్రణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. 18 సెక్యూరిటీ ఫీచర్లతో చూడముచ్చటగా.. ఈ డిజిటల్ పాస్‌పుస్తకాల్లో 18 ఫీచర్లు ఉండనున్నాయి. భూ కేటగిరీ, పట్టాదారు, సాగు విస్తీర్ణం, బ్యాంకు ఖాతా, ఫోన్, ఆధార్ నంబర్ సహా ముఖ్యమైన సమాచారాన్ని నమోదు చేసేందుకు అనువుగా సాంకేతికతకు జోడించినట్లు తెలిసింది. మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సరికొత్త ’స్మార్ట్’ పాసు పుస్తకాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున.. దానికి అనుగుణంగా రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గత మూడు రోజులుగా తహసీల్దార్లకు శిక్షణా తరగతులను నిర్వహించింది. అదే రోజు నుంచి రిజిస్ట్రేషన్ వ్యవహారాలను కూడా తహసీల్దార్లే చూడనున్నందున దానికి తగ్గట్టుగా శిక్షణ ఇస్తోంది. మరోవైపు హై సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌కు ముద్రణ బాధ్యతలు అప్పజెప్పిన ప్రభుత్వం.. తహసీల్దార్ల డిజిటల్ సంతకాల సేకరణలో నిమగ్నమైంది. అవసరమైతే, బల్క్‌గా డిజిటల్ సంతకాల చేసే వెసులుబాటు కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. పెట్టుబడి సాయంలో కీలకం! తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పెట్టుబడి సాయంలో ఈ కార్డులు కీలకం కానున్నాయి.గతంలో నకిలీ పాస్‌పుస్తకాల బెడద కారణంగా పంటనష్ట పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ, రుణమాఫీ, బ్యాంకు రుణాలతో ప్రభుత్వానికి టోకరా వేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ప్రవేశపెడుతున్న స్మార్ట్ కార్డులతో అక్రమాలకు ఆస్కారం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అంతేగాకుండా ప్రతి ఏడాది ఎకరాకు రూ.8వేలను పెట్టుబడి ప్రోత్సాహకంగా రైతన్నకు అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఖరీఫ్‌లో రూ.4వేల చొప్పున రైతులకు ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. -
పాస్ పుస్తకాలు ఉండి తీరాల్సిందే: వైఎస్ జగన్
హైదరాబాద్ : రైతులకు పాస్ పుస్తకాలు పూర్తిగా తీసేయాలనుకోవడం సరికాదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం నాటి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. రైతులు కనీసం రుణాలు తీసుకోవడానికి, ఇతర అవసరాలకు చేతిలో పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉండాలని ఆయన తెలిపారు. కావాలంటే కంప్యూటర్ రికార్డులను సెకండరీ చెక్‌గా పెట్టుకోవాలని, ప్రైమరీ చెక్‌గా పాస్ పుస్తకాలు ఉండాలని అన్నారు. ప్రభుత్వం తీసుకువస్తామంటున్న ఈ పుస్తకాలతో రైతులకు ఇబ్బందులు తప్పవని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వేళ ప్రభుత్వం అలా చేస్తే మొత్తం వ్యవస్థ అంతా రెవెన్యూ అధికారులు చేతుల్లోకి వెళ్లిపోతుందన్నారు. ఎవరైనా హ్యాకింగ్ చేస్తే సదరు భూమికి ఓనర్ ఎవరో కూడా తెలియదన్నారు. భూమికి సంబంధించి ఎదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ... సదరు రైతులు అధికారులను ఆశ్రయించవచ్చని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. రికార్డ్‌గా పాస్ పుస్తకాలు ఉపయోగపడతాయన్నారు. వాటిని కొనసాగించాలని ప్రభుత్వానికి వైఎస్ జగన్ సూచించారు. వైఎస్ జగన్ చేసినది చాలా మంచి సూచన అని, దాన్ని పాటించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు చెప్పారు. రైతుల చేతిలో ఫిజికల్ పాస్‌బుక్ తప్పనిసరిగా ఉండాలని ఆయన అన్నారు. కంప్యూటర్లలో మాత్రమే ఉంటాయంటే చాలా సమస్య అవుతుందని చెప్పారు. దీనికి రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి సమాధానం ఇచ్చారు. పట్టాదారు పాస్ పుస్తకాలను పూర్తిగా తీసేయడం లేదని, ఆప్షనల్‌గా చేస్తున్నామని ఆయన తెలిపారు.