సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించే ప్రక్రియ ప్రహ సనంగా మారుతోంది. పుస్తకాల ముద్రణకు ఉద్దేశించిన ఆన్‌లైన్ రికార్డుల నమోదు నత్తనడకన సాగుతోంది. ప్రక్రియ ప్రారంభమై 20 రోజులు దాటుతున్నా ఇప్పటివరకు 50 శాతం భూములనే నిర్ధారించారు. అందులోనూ పాస్ పుస్తకాలకు అవసరమైన సర్వే నంబర్లు, తహశీల్దార్ల డిజిటల్ సంతకాలతో సిద్ధం చేసిన భూమి వివరాలు 5% కూడా దాటలేదు. మరోవైపు పుస్తకాల ముద్రణ బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వ ప్రింటింగ్ ప్రె స్ తప్పుకోవడం, ముద్రణకు సంబంధించి కొత్త టెండర్లు ఖరారు కాకపోవడంతో పుస్తకాల జారీ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
కొత్త మాడ్యూల్‌లో...
భూ రికార్డుల ప్రక్షాళన వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచేందుకు రెవెన్యూ శాఖ ల్యాండ్ రికార్డ్స్ అప్‌డేషన్ ప్రాసెస్ (ఎల్‌ఆర్‌యూపీ) పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ప్రక్షాళనలో తేలిన సర్వే నంబర్లలో 53 శాతం భూములనే నిర్ధారించారు. 1.85 కోట్ల సర్వే నంబర్లలో 2.28 కోట్ల ఎకరాలకు పైగా భూములుండగా, అందులో 99 లక్షల సర్వే నంబర్లలోని 1.13 కోట్ల ఎకరాలనే నిర్ధారించారు. అందులో వివాదాస్పద భూములు పోను 96.15 లక్షల సర్వే నంబర్లలో భూము లే సరిగా ఉన్నాయని.. వాటిలోనూ 85.68 లక్షల సర్వే నంబర్ల భూమికే పుస్తకాలు అవసరమవుతాయని, మిగిలిన 11 లక్షల సర్వే నంబర్లలోని 26 లక్షల ఎకరాలు వ్యవసాయేతర భూములని తేల్చారు.
ఇప్పటివరకు 10 లక్షల ఎకరాలే..
పాస్ పుస్తకాలపై తహశీల్దార్ల డిజిటల్ సంతకం అవసరమైన నేపథ్యంలో శుక్రవారం నుంచే తహశీల్దార్లకు సంతకాలు చేసే అనుమ తిని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఇప్పటివరకు 10,61,514 సర్వే నంబర్లలోని 4,33,305 రైతు ఖాతాల్లో ఉన్న 10,85,077 ఎకరాల భూ విస్తీర్ణానికే డిజిటల్ సంతకాలు పూర్తయ్యాయి. అంటే పాస్‌పుస్తకం ముద్రణ, జారీకి ఇప్పటివరకు సిద్ధమయింది కేవలం 10.85 లక్షల ఎకరాలే. పుస్తకాల ముద్రణ టెండర్లు ఈ నెల 3న ఖరారు కానుండటంతో తర్వాత 2 రోజుల్లో టెండర్ దక్కించుకున్న సంస్థ ముద్రణ ప్రారంభిస్తుందటున్నారు. అయితే ఎంత వేగంగా చేసినా ఆన్‌లైన్ రికార్డులను పూర్తిస్థాయిలో అందజేయడానికి మరో 20 రోజులు పడుతుందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment