ప్రక్షాళన 'సాగు'తోంది! | Farmers waiting for Pattadar Passbooks | Sakshi
Sakshi News home page

ప్రక్షాళన 'సాగు'తోంది!

Published Sat, Aug 3 2019 2:20 AM | Last Updated on Sat, Aug 3 2019 2:20 AM

Farmers waiting for Pattadar Passbooks - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండేళ్ల క్రితం మొదలైన భూ రికార్డుల ప్రక్షాళన ఇంకా కొలిక్కిరాలేదు. ఇది నిరంతర ప్రక్రియే అయినా.. పాత సమస్యలను అధిగమించడంలో రెవెన్యూ యంత్రాంగం చతికిలపడింది. ఇప్పటికీ 94 శాతం మాత్రమే రికార్డుల నవీకరణ జరిగింది. పార్ట్‌–బీ కేటగిరీలో చేర్చిన ఖాతాలను పరిష్కరించేలా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో 3.73 లక్షల ఖాతాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 61,13,916 ఖాతాలుండగా.. వివాదరహిత భూములుగా గుర్తించిన 57,69,933 ఖాతాలకు సంబంధించి డిజిటల్‌ సంతకాలు జరిగాయి. ఇందులో ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్‌ (పట్టణ) జిల్లాలు ముందంజలో ఉన్నాయి. ఈ జిల్లాల పరిధిలో క్లియర్‌ ఖాతాలుగా తేల్చిన వాటిలో ఏకంగా 98% మేర డిజిటల్‌ సంతకాలు పూర్తయ్యాయి. రికార్డుల ప్రక్షాళనలో వికారాబాద్, ములుగు, మేడ్చల్‌ జిల్లాలు బాగా వెనుకబడ్డాయి. ఈ జిల్లాల్లో కేవలం 90 శాతం మాత్రమే డిజిటల్‌ సంతకాలయ్యాయి. దీంతో ఈ జిల్లాల్లోని రైతాంగం పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల కోసం తహసీల్‌దార్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది.  

ఆధార్‌ వివరాలివ్వని 1.74 లక్షల మంది 
పాస్‌ పుస్తకాల జారీకి తప్పనిసరిగా భావించే ఆధార్‌ వివరాలను సమర్పించకపోవడంతో 1.74 లక్షల పట్టాదార్లకు పాస్‌బుక్కులు జారీకాలేదు. అలాగే ఆధార్‌ సంఖ్యను ఇచ్చినా కూడా 1.69 లక్షల ఖాతాలకు డిజిటల్‌ సంతకాలు పెండింగ్‌లో ఉండడంతో ఆధార్‌ ఇవ్వని/ఇచ్చిన 3.43 లక్షల ఖాతాల పాస్‌ పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు మ్యుటేషన్లు, పౌతీ, నోషనల్‌ ఖాతాలు పెండింగ్, ఖాతాల సవరణల పెండింగ్‌లో ఉండడం కూడా పాస్‌ పుస్తకాల జారీ ఆలస్యం కావడానికి కారణంగా రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 

కొలిక్కిరాని పార్ట్‌–బీ వ్యవహారం.. 
భూ యాజమాన్య హక్కులపై స్పష్టతనివ్వకపోవడంతో లక్షలాది మంది రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పార్ట్‌–బీ జాబితాలో చేర్చిన భూముల వ్యవహారం తేల్చకపోవడంతో రెవెన్యూ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ కేటగిరీ భూములపై మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో ఎడతెగని జాప్యం జరుగుతోంది. గత రెండేళ్లుగా పాస్‌ పుస్తకాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగం పెదవి విరుస్తోంది. తొలి విడతలో వివాదరహిత భూములకు మాత్రమే పాస్‌ పుస్తకాలను జారీ చేసిన సర్కారు.. పార్ట్‌–బీ కేటగిరీలో ప్రభుత్వ భూములు/ఆస్తులు, అటవీ భూములు, దేవాదాయ తదితర భూములతోపాటు, వ్యవసాయేతర భూములను చేర్చింది.

భూవిస్తీర్ణంలో తేడా, కోర్టు కేసులు, కుటుంబసభ్యుల భూపంపకాల్లో విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్‌ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా, ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య తగాదా, ఫారెస్టు, పట్టా భూముల మధ్య వివాదస్పదమైన వాటిని కూడా పార్ట్‌–బీలో నమోదు చేసింది. వీటిని సత్వరమే సవరించి పరిష్కారమార్గం చూపాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకపోవడం.. పెట్టుబడి సాయం అందించాలనే తొందరలో ఈ కేటగిరీ భూముల జోలికి వెళ్లలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 3,73,051 ఖాతాలకు మోక్షం కలగలేదు. ఈ ఖాతాలకు సంబంధించిన రైతులు ప్రతిరోజు కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement