పట్టాదారు పాసు పుస్తకం నమూనా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి రాష్ట్ర రైతాంగానికి కొత్త పాస్‌పుస్తకాలు అందనున్నాయి. గురువారం నుంచి ఈనెల 19వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో (హైదరాబాద్ మినహా) గ్రామాల వారీగా ఈ పాస్‌పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పాస్‌పుస్తకాలను ఇప్పటికే క్షేత్రస్థాయికి తరలించిన రెవెన్యూ సిబ్బంది నేటి నుంచి ఈ పుస్తకాలను రైతులకు అందజేస్తారు.
గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలు, కౌంటర్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో పాస్‌పుస్తకాల పంపిణీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 57.33 లక్షల పాస్‌పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఇందులో 4.8 లక్షల మంది రైతులు ఆధార్‌ను సమర్పించకపోవడంతో వారి పుస్తకాలను ముద్రించలేదు. దీంతో పాటు మరో 1.77 లక్షల మంది ఆధార్ ఇచ్చినప్పటికీ వారి ఫోటోలు సరిగా లేకపోవడంతో వాటిని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, ఫొటోలు సరిగా లేని రైతుల పాస్‌పుస్తకాలను తర్వాత ముద్రించి ఇస్తామని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు.
2016 జూన్ తర్వాత తొలిసారి
వాస్తవానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2016 సంవత్సరం నుంచి పాస్‌పుస్తకాల జారీ నిలిపివేశారు. మాజీ ఐఏఎస్ అధికారి రేమండ్‌పీటర్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)గా ఉన్న సమయంలో 2016 జూన్‌లో కొత్త పాస్‌పుస్తకాల జారీని నిలిపివేశారు. నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు తీసుకుంటున్నారని ఆర్‌బీఐ అధికారులు ఓ సమావేశంలో చెప్పడం, 17వేల కోట్ల రూపాయల రుణమాఫీలో రూ.1,700 కోట్లు నకిలీపాస్‌పుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్న వారి ఖాతాల్లోకి వెళ్లాయన్న నివేదికల నేపథ్యంలో రైతు పాస్‌పుస్తకాల జారీతో పాటు అప్పటికే ఉన్న పాస్‌పుస్తకాలు కూడా చెల్లవని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
భద్రతా ప్రమాణాలతో కొత్త పాస్‌పుస్తకాలు ముద్రించే బాధ్యతలను అప్పుడే మద్రాస్ ప్రింటింగ్ ప్రెస్‌కు అప్పగించారు. అయితే, సకాలంలో ఆ సంస్థ స్పందించలేదన్న కారణంతో ఎస్.కె.సిన్హా ఆ ఒప్పందాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి పాస్‌పుస్తకాల ముద్రణ అనేక మలుపులు తిరిగి ఇప్పటికి ఓ కొలిక్కి చేరింది. దీంతో రైతులకు తెలంగాణ లోగోతో తొలిసారి పాస్‌పుస్తకాలు అందనున్నాయి. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పుస్తకంపై కాకతీయ కళాతోరణాన్ని కవర్‌పేజీపై ముద్రించారు. ‘తెలంగాణ ప్రభుత్వము, పట్టాదారు పాస్‌పుస్తకము, భూమి యాజమాన్య హక్కు పత్రం’అని రాసి ఉన్న ఈ పుస్తకాలను ఇప్పుడు రైతులకు అందజేయనున్నారు. మొత్తంమీద తమ భూములకు ఎట్టకేలకు కొత్త పాస్‌పుస్తకాలు వస్తున్న నేపథ్యంలో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment