అడుగంటిన జలనిధి
-
కరుణించని వరుణుడు
-
అందని కృష్ణా జలాలు
-
ఆందోళన ఎడగారు రైతులు
సోమశిల : జిల్లా జలనిధి సోమశిల జలాశయం రోజు రోజుకి అడుగంటుతోంది. జిల్లా రైతాంగానికి సాగునీరు అందించడంతో పాటు జిల్లా, తమిళనాడు ప్రజల దాహార్తిని తీర్చే జలాశయం డెడ్‌స్టోరేజ్‌కు చేరుకుంది. వరుణుడు కరుణించకపోవడానికి తోడు రెండో పంటకు పెరిగిన ఆయకట్టుతో జలాశయంలోని నీరు ఆవిరై పోయింది. ఎడగారు పూర్తవక ముందే జలాశయం అడుగంటడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు.
జిల్లా సాగునీటి సలహా మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు రెండో పంటకు పెన్నార్ డెల్టాలోని 1.76 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఐఏబీ సమావేశ సమయంలో జలాశయంలో 27.322 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నది. రెండో పంటకు జలాశయం నుంచి 22 టీఎంసీలు ఇవ్వాలని తీర్మానించారు. జలాశయంలోని 18 టీఎంసీలు, ప్రధాన చెరువులైన కనిగిరి ,సర్వేపల్లి చెరువులలోని మరో 4 టీఎంసీలను రెండో పంటకు కేటాయించారు. రెండో పంట సాగు విస్తీర్ణం మరో 30 వేల ఎకరాలు పెరగడంతో పాటు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఇటీవల జలాశయం నుంచి మరో 5 టీఎంసీలు నీరు ఇవ్వాలని తీర్మానించారు. రెండో పంటకు ఇప్పటి వరకు జలాశయం నుంచి 19.5 టీఎంసీల నీరు విడుదల చేశారు. సెప్టెంబర్ 15 వరకు రెండో పంటకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం జలాశయంలో 7.800 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరో 4 టీఎంసీలను ఎడగారుకు కేటాయిస్తే జలాశయంలో నీటి నిల్వ డెడ్ స్టోరేజ్ (7.567 టీఎంసీలు) కన్నా పడిపోతుంది. వర్షాలు పడుతాయనే ఆశతో అధికారులు ఎడగారు పంట ఎండకుండా నీరు విడుదల చేస్తున్నట్లు సమాచారం. వరుణుడు కరుణించకపోతే పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు.
22ఏళ్ల తరువాత డెడ్ స్టోరేజీ నుంచి నీరు విడుదల
తీవ్ర వర్షాభావ పరిస్థితులతో 1994–95లో సోమశిల జలాశయం నుంచి జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని విడుదల చేశారు. అప్పట్టో జలాశయంలో నీటి నిల్వ 2.36 టీఎంసీలకు చేరుకుంది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది డెyŠ స్టోరేజీ నుంచి సాగుకు నీటిని విడుదల చేయాలని అధికారులు చూస్తున్నారు. వర్షాలు పడుతాయనే ఆశతో ఒక్క ఎకరా కూడా ఎండ కూడదని సాగునీటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కృష్ణా వరద ప్రవాహం రాకుండా, వరుణుడు కరుణించకపోతే తాగు నీటి ఎద్దడి పరిస్థితి ఎండమావే.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం–దేశ్ నాయక్,ఈఈ,సోమశిల
సోమశిల జలాశయం డెడ్‌స్టోరేజ్‌కు చేరుకున్న విషయాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నాం. సెప్టంబర్‌లో కూడా సాగుకు నీరు అందించాల్సి ఉంది. కృష్ణా జలాలు, వర్షాలపై ఆశలు పెట్టుకుని సాగుకు నీటిని విడుదల చేస్తున్నాం.