ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో ఓ సీన్ ఇది. ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు ఓ ప్రదేశంలో దాచి ఉంచుతారు. ఆ ప్రదేశం గురించి పోలీసులు తెలుసుకుంటారు. వారు అక్కడికి వెళ్తున్న సమాచారం స్మగ్లర్లకు చేరడంతో ఆ సినిమా హీరో, మరికొందరు వెంటనే దుంగలను పక్కనే ఉన్న నీటి ప్రవాహంలోకి నెట్టేస్తారు. హీరో తన అనుచరుడి ద్వారా జలాశయ అధికారికి ముడుపులిచ్చి గేట్లు మూయించేస్తాడు. ఈ సీన్ మొత్తం రక్తి కట్టిస్తుంది. ఇలాంటి సీన్ జిల్లాలోని సోమశిల జలాశయంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు విలువైన దుంగలను నరికించి ఎవరికీ అనుమానం రాకుండా జలాశయంలో దాచేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.
సాక్షి, నెల్లూరు: జిల్లా జలనిధిగా ఉన్న సోమశిల జలాశయం లోతట్టు ప్రాంతం ఎక్కవ భాగం వైఎస్సార్ జిల్లాలో ఉంది. రెండు జిల్లాల సరిహద్దుగా ఉన్న ఆ ప్రాంతంలో రిజర్వు ఫారెస్ట్ సుమారు 48 చదరపు కి.మీ విస్తరించి ఉంది. ఆ ఫారెస్ట్‌లో ఎర్రచందనం వృక్షాలున్నాయి. నాణ్యత కలిగిన దుంగలు ఇక్కడ లభిస్తుండడంతో అక్రమార్కులు ఆ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్నారు. దీనికితోడు జలాశయ లోతట్టు ప్రాంతం కావడంతో రవాణా మార్గానికి అనువుగా ఉండదు. దీంతో అటవీ, పోలీస్ శాఖల అధికారులు ఆ వైపు వెళ్లేందుకు ఇష్టపడరు. దీంతో స్మగ్లర్లు రెచ్చిపోతుంటారు.
తమ పరిధి కాదంటూ..
గతంలో సోమశిల జలాశయంలో ఓ ఇంజినీర్ లోతట్టు ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారి గేటు తాళం తనవద్దే ఉంచుకుని అక్రమ చేపల వేటకు, ఎర్ర స్మగ్లర్లకు రాత్రి వేళల్లో సహకరించి అధికారులకు దొరికిన సందర్భం ఉంది. కానీ ఆ అధికారి రాజకీయ పరపతితో కేసు లేకుండా తప్పించుకోగలిగాడు. మూడు రోజుల క్రితం 11 దుంగలు జలాశయంలో బయటపడ్డాయి. వాస్తవానికి దీని గురించి ముందే తెలిసినా అటవీశాఖ, పోలీస్ అధికారులు ఎవరికి వారు తమ పరిధిలో కాదంటూ పట్టించుకోలేదు. తాజాగా దుంగల ఫొటోలతో సహా సోషల్ మీడియాలో రావడంతో హడావుడిగా స్వాధీనం చేసుకున్నట్లుగా అటవీ శాఖ ప్రకటించింది.
ఇలా చేస్తున్నారు..
జలాశయం లోతట్టు ప్రాంతంలో ఇరువైపులా చేపలు పట్టే జాలర్లు ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఉంటూ చేపలు పట్టి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. స్థానికంగా ఎర్ర స్మగ్లర్లకు సహకరించే వ్యక్తుల ద్వారా కొందరు జాలర్లతో పరిచయం పెంచుకుని వారి ద్వారా పడవలో లోతట్టు ప్రాంతాలకు చేరుకుంటున్నారు. అలాగే తమిళ కూలీలను కూడా ఇదే పద్ధతిలో చేర్చి ఎర్ర వృక్షాలను నరికిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దుంగలను జలాశయం లోతట్టు కోనల్లోని నీటిలో నిల్వ ఉంచుతారని చెబుతున్నారు. ఒకవేళ అధికారులు దాడులు చేసినా కనిపించని విధంగా నీటిలో డంపింగ్ చేస్తారు. వారికి అనువైన సమయంలో ఆ డంప్‌ను రవాణా చేసుకుంటారు. ఇలా విలువైన సంపద తరలిపోతున్నా అధికారుల్లో చలనం లేదనే విమర్శలున్నాయి.
పక్కా సమాచారం ఉన్నా..
స్థానికంగా ఉన్న ఎర్ర అక్రమార్కుల సహకారంతోనే దుంగలు తరలుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఎవరు దొంగలో కూడా స్థానిక అటవీ, పోలీస్ శాఖకు పక్కా సమాచారం ఉంది. అయితే అక్రమార్కులతో ఉన్న లోపాయికారి ఒప్పందంతో వారు పట్టుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఏదైనా ఒత్తిడి వచ్చినా, సమాచారం బహిరంగమైతే అప్పటికప్పుడు అధికారులు నాణ్యత లేని దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ప్రచారం ఉంది. మూడు రోజుల క్రితం జరిగిన దుంగల విషయంలో కూడా అధికారులు పట్టించుకోకపోగా సమాచారం ఇచ్చిన మీడియాపై రుసరుసలాడడం వారి లోపాయికారి ఒప్పందానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మీరు చెబితే సస్పెండ్ చేయాలా?
సోమశిల జలాశయంలో ఎర్రచందనం దుంగల డంప్‌పై మీడియా సమాచారం ఇస్తే వెంటనే మేము స్థానిక అధికారులను సస్పెండ్ చేయాలా?. మూడు రోజల క్రితం జరిగింది అని చెబుతున్నారు. అవన్ని మేము పరిశీలిస్తాం. విచారణ జరిపిస్తాం.
– షణ్ముగకుమార్, డీఎఫ్‌ఓ, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment