డెడ్ స్టోరేజీ
ఆదిలాబాద్ : ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో జిల్లాలోని జలాశయాలు అడుగంటాయి. గతేడాది ఇదే సమయానికి నిండుకుండలను తలపించిన ప్రాజెక్టులు ప్రస్తుతం డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. కాలువ మట్టానికి కూడా నీళ్లు లేక ఆయకట్టుకు నీళ్లందని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు పడితేనే ప్రాజెక్టులు జలకళ సంతరించుకునే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశాలు లేవని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొనడంతో ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పెట్టుబడులు కూడా రావని ఆవేదన చెందుతున్నారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 173 మిల్లీమీటర్లు కాగా కేవలం 70మిల్లీమీటర్ల వర్షపాతం మా త్రమే నమోదైంది. వర్షపాతం చూస్తే కరువు కోరలను తలపిస్తోంది. ఇప్పటికే విత్తనాలు మొలకెత్తక రూ.కోట్ల నష్టాన్ని రైతులు చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆశ.. నిరాశ..
గతేడాది భారీవర్షాల కారణంగా ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. లక్షల క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువనకు వదిలారు. ఈ ఏడాది జిల్లాలోని జలాశయాల పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా కడెం, స్వర్ణ, సాత్నాల, మత్తడివాగు, వట్టివాగు, గడ్డెన్నవాగు, ఎన్‌టీఆర్‌సాగర్, గొల్లవాగుల్లో నీటి మట్టాలు అడుగంటాయి.
గతేడాది కంటే ఈ ఏడాది ఇదే సమయానికి శ్రీరాంసాగర్, కొమురం భీమ్ ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు, నీటి సామర్థ్యం అధికంగా ఉంది. శ్రీరాంసాగర్‌లో గతేడాది ఇదే సమయానికి 10 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా ఈసారి 24 టీఎంసీలు ఉన్నాయి. కొమురం భీమ్ ప్రాజెక్టుకు గతేడాది ఇదే సమయానికి 4.9 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా ఈసారి 5 టిఎంసీల నీటి సామార్థ్యం ఉంది. వట్టివాగులో గతేడాది ఇదే సమయానికి 1.378 టీఎంసీల నీళ్లు ఉండగా ఈ ఏడాది 1.608 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మిగతా ప్రాజెక్టుల్లో భారీ వర్షాలు కురిసి జలాశయాలు నిండితేనే ఆయకట్టుకు నీరందుతుంది.
అడుగంటిన ఆశలు
స్వర్ణ, సాత్నాల, మత్తడివాగు, కడెం, ఎన్‌టీఆర్‌సాగర్, గొల్లవాగు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీలో ఉన్నాయి. స్వర్ణ కింద సారంగాపూర్, నిర్మల్ మండలాల్లో 8,945 ఎకరాల ఆయకట్టు ఉంది. తడిపంటలకు నీరందాలంటే ఈ ప్రాజెక్టు నిండాల్సిందే. సాత్నాల కింద జైనథ్, బేల, ఆదిలాబాద్ మండలాల్లోని 24 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందాల్సి ఉన్నా డెడ్ స్టోరేజీ కారణంగా పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తుంది. పత్తి, సోయ పంటలు అధికంగా పండించే ఈ ఆయకట్టు రైతులు వర్షాన్ని నమ్ముకొని సాగు చేస్తున్నారు.
ఇటు వర్షాలు లేకపోవడం, అటు ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. కడెం ప్రాజెక్టు కింద జన్నారం, కడెం, లక్సెట్టిపేట, దండేపల్లి, మంచిర్యాల మండలాల్లో 68,158 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధానంగా వరి సాగు చేస్తారు. దాదాపు డెడ్‌స్టోరేజీకు చేరువలో ఉన్న ఈ ప్రాజెక్టు పరిస్థితి రైతులను ఆవేదనకు గురిచేస్తుంది. మత్తడివాగు డెడ్‌స్టోరేజీ నేపథ్యంలో తాంసి, తలమడుగులోని 8,500 ఎకరాల ఆయకట్టు రైతుల్లో దుర్భిక్ష పరిస్థితి ఉంది. గొల్లవాగు, ఎన్‌టీఆర్ సాగర్‌లది ఇదే పరిస్థితి.