ఇసుక దొంగలు
ఇసుక దొంగలు
Published Tue, Aug 16 2016 10:07 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
హైటెక్ యంత్రాలతో యథేచ్ఛగా దోపిడీ
నది మొత్తం గుంతలమయం
తాత్కాలిక సచివాలయం పేరుతో అక్రమ రవాణా
రోజూ వేలాది వాహనాల్లో తరలింపు
సాక్షి, అమరావతి :
కృష్ణా నదిలో దొంగలు పడ్డారు. బంగారం.. నగదు.. వస్తువులు దొంగలించే వారు కాదు. నదీమతల్లి గర్భంలో ఇసుకను దోచేస్తున్నారు. హైటెక్ యంత్రాల సాయంతో నది పొడవునా ఇసుక విచ్చలవిడిగా తోడేస్తున్నారు. టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. అక్కడి నుంచి చెన్నై, కర్నాటక, హైదరాబాద్‌కు తరలించి రూ.కోట్లు జేబులు నింపుకుంటున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్న ఈ భారీ దోపిడీ తాత్కాలిక సచివాలయ నిర్మాణం పేరుతో జరుగుతుండటం గమనార్హం. ఈ దోపిడీ వెనక కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రి, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ స్థాయి నాయకులు అనేక మంది ఉన్నారు. ఏ రాష్ట్రాల్లో దొరకని ఇసుక సంపద కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో నిక్షిప్తమై ఉంది. విలువైన ఈ ప్రకృతి సంపదపై అధికారపార్టీ నేతల కన్నుపడింది. తుళ్లూరు మండలం వెలగపూడిలో సచివాలయ నిర్మాణ పనులు వీరి దోపిడీకి రాచమార్గమైంది. ‘తాత్కాలికం’ మాటతో ఇసుక దోపిడీకి తెరతీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి కూతవేటు దూరంలో ఉండవల్లి, వెంకటపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం, రాయపూడి, బోరుపాళెం, అమరావతి, మల్లాది, అచ్చంపేట ఇసుక రీచ్‌లు ఉన్నాయి. వీటిలో నాలుగు రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి.
హైటెక్ యంత్రాలతో తోడివేత..
ఇసుక తోడేందుకు అక్రమార్కులు హైటెక్ యంత్రాలను దించారు. ఉండవల్లి సమీప నదిలో నుంచి హైటెక్ యంత్రాలు (డ్రెజ్జింగ్) సాయంతో ఇసుకను తోడుతున్నారు. నదిలో అనేక చోట్ల యంత్రాలు వినియోగిస్తున్నారు. మరి కొన్నిచోట్ల భారీ జేసీబీలు, క్రేన్‌లు ఉపయోగిస్తున్నారు. లింగాయపాలెం పరిధిలో రెండు మూడు రీచ్‌లు ఉన్నాయి. వీటిలో ఒక చోట, తాళ్లాయపాలెం, బోరుపాలెం రీచ్‌లో డ్రెజ్జింగ్ మిషన్లతో ఇసుక తోడుతున్నారు. డ్రెజ్జింగ్ మిషన్ పడవపై ఏర్పాటు చేస్తారు. ఆ పడవ నది మధ్యలోకి తీసుకెళ్తారు. నదిలో పైపును విడిచిపెట్టి డ్రెజ్జింగ్ మిషన్‌ను స్టార్ట్ చేస్తారు. విద్యుత్ మోటార్ ద్వారా నీరు ఎలా వెలుపలకి వస్తాయో.. అలా ఇసుక డ్రెజ్జింగ్ మిషన్ ద్వారా వెలుపలకు వస్తోంది. ఆ ఇసుకను క్రేన్, జేసీబీలతో పెద్ద పెద్ద గుట్టలుగా పోస్తున్నారు. ఒక డ్రెజ్జింగ్ మిషన్ ద్వారా రోజుకు 120 క్యూబిక్ మీటర్ల ఇసుక తోడుతోంది. నదీ తీరంలో ఐదు డ్రెజ్జింగ్ మిషన్ల ద్వారా ఇసుకను తోడుతున్నారు. క్రేన్, జేసీబీలు లెక్కలేనన్ని నదిలో నుంచి ఇసుక తోడుతున్నాయి.
రోజూ వేలాది వాహనాలలో రవాణా..
సచివాలయ నిర్మాణానికి 50 నుంచి 75 టిప్పర్లతో ఇసుక తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలించే ఇసుక తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. లింగాయపాలెం ఇసుక రీచ్ వద్ద రోజుకు వెయ్యి లారీల ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. లింగాయపాలెం మరో రీచ్ వద్ద రోజుకు 500 ట్రాక్టర్ల ఇసుక తరలి వెళ్తోంది. బోరుపాలెం రీచ్ నుంచి రోజుకు 1800 లారీల ఇసుక తరలిపోతోంది. ఇంకా వెంకటంపాలెం, అమరావతి, మల్లాది తదితర రీచ్‌ల నుంచి మరో వెయ్యి లారీలు. ఇలా రోజుకు సుమారు పది వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఒక లారీ ఇసుక రూ.ఆరు వేల నుంచి రూ.పది వేల చొప్పున విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.1500 నుంచి రూ.రెండు వేల వరకు పలుకుతోంది. కృష్ణా నదిలోని ఇసుకను గుంటూరుకు చేరవేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్ ఒకరు వెల్లడించారు. ఇసుక ఇష్టానుసారంగా తోడేయటంతో నది గర్భంలో పెద్ద లోయ ఏర్పడుతోంది. అమరావతి సమీపంలోని కృష్ణానదిలో ఇసుక అక్రమ రవాణాతో ఏర్పడ్డ లోయలో పడే మంగళవారం ఐదుగురు యువకులు మృతి చెందడం గమనార్హం.
Advertisement
Advertisement