కడప నగరానికి ప్రధాన తాగునీటి వనరయిన పెన్నానది పూర్తిగా ఎండిపోయింది. దీంతో నగరంలో పలు ప్రాంతాలకు వారం రోజులుగా నీరు సరఫరా ఆగిపోయింది.
ఓ వైపు జాడలేని వాన చినుకులు.. మరోవైపు ఆగని ఇసుకాసురుల ఆగడాలు.. వెరసి భూగర్భ జలం అడుగంటింది. చుక్కనీరు లేక పెన్నానది బోసి పోయింది. ఇంకేముంది కడప నగరానికి నీటి గండం పొంచి ఉంది. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో తలెత్తే నీటి ఎద్దడి సమస్య ఆగస్టులోనే ఎదురుకావడంతో ప్ర‘జల’కు కలవరం మొదలైంది. ఇప్పటికే పలు ప్రాంతాలకు నీటి సరఫరా కానీ దుస్థితి తలెత్తింది.
కడప కార్పొరేషన్: కడప నగరానికి ప్రధాన తాగునీటి వనరయిన పెన్నానది పూర్తిగా ఎండిపోయింది. దీంతో నగరంలో పలు ప్రాంతాలకు వారం రోజులుగా నీరు సరఫరా ఆగిపోయింది. నీరు రాక ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రెండు బోర్లు ఫెయిల్..
పెన్నాలో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడే 51 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్‌స పర్ డే) లు సరఫరా చేసేవారు. వారం క్రితం వరకూ 47.60 ఎంఎల్‌డీల నీరు సరఫరా చేసేవారు. ప్రస్తుతం పెన్నాలో చుక్కనీరు కూడా లేకపోవడం.. లింగంపల్లె,గండి వాటర్ వర్క్స్‌లో ఒక నిమిషానికి 4వేల లీటర్ల నీటిని పంప్ చేయగలిగిన రెండు 60 హెచ్‌పీ బోర్లు ఫెయిల్ కావడంతో 36 ఎంఎల్‌డీలకు పడిపోయింది.
ఫలితంగా నగరంలో 25 శాతం ప్రాంతాలకు తాగునీరు అందించలేని దుస్థితి ఏర్పడింది. గంజికుంట కాలనీ, ప్రకాష్‌నగర్, నకాష్, ఖలీల్‌నగర్, ఎన్టీఆర్ నగర్‌లతోపాటు నగర శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. ప్రస్తుతానికి అధికారులు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. మరో వా రం రోజులపాటు ఇలాగే కొనసాగితే మిగిలిన బోర్లు కూడా పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది.
అధికారులతో మాట్లాడుతున్నాం: పెన్నా పూర్తి గా ఎండిపోయిన విషయమై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతున్నాం. నిన్న రాజోలి ఆనకట్టనుంచి 2 వేల క్యూసెక్కులు వదిలామని చెబుతున్నారు. రెండు రోజుల్లో ఆ నీరు గండి, లింగంపల్లెలకు చేరే అవకాశముంది. సోమవారం మేయర్‌తో కలిసి ఆదినిమ్మాయపల్లె వద్దకు వెళ్లి చూసి తదుపరి చర్యలు తీసుకుంటాం.
-ఓబులేసు, కమిషనర్, కడప