వేగవంతంగా సాగుతున్న పెన్నాబ్యారేజీ పనులు
దశాబ్దకాలంగా అడుగు ముందుకు పడని పెన్నా, సంగం బ్యారేజీల పనులకు మోక్షం లభించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు కాక ప్రాజెక్ట్‌ల పనులకు బ్రేక్‌లు పడ్డాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో సాగునీటి రంగానికి ఎనలేని ప్రాధాన్యమిచ్చింది. ఏళ్లుగా పనులు జరగక పడకేసిన ఈ బ్యారేజీల నిర్మాణాలను పూర్తి చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ప్రత్యేక చొరవతో ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి అన్నదాతల కళ్లలో ఆనందం చూసేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో ఈ రెండు బ్యారేజీల నిర్మాణాలు అడుగు ముందుకు పడలేదు. చేసిన పనులకు బిల్లులు కూడా ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను నిలిపేశారు. ఇప్పుడు రాత్రి పగలు అనే తేడా లేకుండా పనులు వేగవంతమయ్యాయి. రానున్న కొద్ది నెలల్లో రెండు ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి సింహపురి అన్నదాతలకు అంకితం చేయనున్నారు.
సాక్షి, నెల్లూరు : సోమశిల జలాశయం నుంచి వచ్చే వృథా జలాలు సముద్రం పాలవకుండా సంగం వద్ద, నెల్లూరులో పెన్నానదిపై బ్యారేజీల నిర్మాణానికి దివంగత సీఎం వైఎస్సార్ 2008లో సంకల్పించారు. జలయజ్ఞం ద్వారా రెండు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఆయా ప్రాజెక్ట్‌లకు రూ.300 కోట్లను కేటాయించారు. 2014లోపు దాదాపు 50 శాతం మేర పనులు పూర్తి చేశారు. అయితే గత టీడీపీ హయాంలో అడుగు ముందుకు పడలేదు. అప్పటి మంత్రులతో పాటు చంద్రబాబు తరచూ ఆ ప్రాజెక్ట్‌లను సందర్శించి అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ అన్నదాతలను మభ్యపెట్టారు. గత ఐదేళ్ల కాలంలో ఆ ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు పడకేశాయి. కొంత మేర చేసిన పనులకు బిల్లులను అప్పటి టీడీపీ ప్రభుత్వం నిలిపేయడంతో కాంట్రాక్టర్లు పనులను ఆపేశారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, జిల్లాకు చెందిన అనిల్‌కుమార్‌యాదవ్ నీటిపారుదల శాఖ మంత్రి కావడంతో ఆ ప్రాజెక్ట్‌లకు మోక్షం కలిగింది. మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని అధికారులను ఆదేశించడంతో పాటు దాదాపు రూ.32 కోట్ల పెండింగ్ బిల్లులను మంత్రి మంజూరు చేయడంతో సంగం, పెన్నాబ్యారేజీల నిర్మాణాలు ఊపందుకున్నాయి.
ఇదీ పనుల తీరు..
♦ పెన్నా బ్యారేజీ 54 శ్లాబులను పూర్తి చేశారు. త్వరలో గేట్లను అమర్చనున్నారు. రూ.150 కోట్లకు గానూ రూ.129.16 కోట్ల విలువైన పనులను పూర్తి చేశారు. ఈ ఏడాది మార్చిలోపు నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు కృషి చేస్తున్నారు.
♦ సంగం బ్యారేజీ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే గేట్లను కూడా అమర్చనున్నారు. రూ.156 కోట్ల వ్యయమైన పనులకు ఇప్పటి వరకు రూ.119.48 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. దాదాపు 76.42 శాతం పనులు పూర్తయ్యాయి. మరో ఆర్నెల్లో నిర్మాణాలను పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు
4.5 లక్షల ఎకరాలకు సాగునీరు
సంగం, పెన్నా బ్యారేజీల నిర్మాణాలు పూర్తయితే దాదాపు 4.5 లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరందే అవకాశం ఉంది. సంగం బ్యారేజీ ద్వారా కనుపూరు, కావలి, దువ్వూరు, ఎన్టీఎస్ కాలువలకు సాగునీరందుతుంది. ఆయా కాలువ ద్వారా దాదాపు 3.5 లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరందుతుంది. దీంతో చివరి ఆయకట్టుకు నీరందే అవకాశం ఉండడంతో రెండు పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెన్నా బ్యారేజీ ద్వారా సర్వేపల్లి కెనాల్, జాఫర్‌సాహెబ్ కెనాల్, కృష్ణపట్నం కెనాల్ ద్వారా దాదాపు లక్ష ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు పుష్కలంగా అందుతుంది.
ఆర్నెలల్లో ప్రాజెక్ట్‌ల పూర్తి
సంగం, పెన్నా బ్యారేజీల నిర్మాణాలను ఆర్నెల్లో పూర్తి చేస్తాం. గతంలో చేసిన పనులకు బిల్లులు పెండింగ్ ఉండటంతో నిలిపేశారు. పెండింగ్ ప్రాజెక్ట్‌లను వెంటనే పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆదేశించడంతో పనులను వేగవంతం చేశాం. పెండింగ్ బిల్లులు మంత్రి ఆదేశాలతో మంజూరయ్యాయి. – హరినారాయణరెడ్డి, తెలుగుగంగ ప్రాజెక్ట్ ఈఈ నెల్లూరు
సకాలంలో వరిపైరు సాగు చేశాం
ఈ ఏడాది సంగం ఆనకట్టకు పూర్తిగా సాగునీరు చేరడంతో సకాలంలో వరిపైరు సాగు చేశాం. గత ఐదేళ్లలో ఎన్నడూ సంగం ఆనకట్టలో ఈ ఏడాది వచ్చినంత సాగునీరు రాలేదు. నారుమడులు వేసే సమయానికి సంగం ఆనకట్టకు పూర్తిగా నీరు రావడంతో సకాలంలో వరిపైరు నాటుకున్నాం. – నెల్లూరు కోటారెడ్డి, రైతు, తరుణవాయి
కాలువల కింద సాగు చేస్తున్నాం
సంగం ఆనకట్టకు ఈ ఏడాది సాగునీరు సకాలంలో చేరడంతో పంట కాలువల కింద వరిపైరు సాగు చేస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా బీడు పెట్టుకున్న మా పొలాలకు ఈ ఏడాది సకాలంలో సాగునీరు వచ్చింది. దీంతో పూర్తిస్థాయిలో రైతులందరూ వరిపైరు సాగు చేస్తున్నారు. సకాలంలో వరిపైరు సాగు చేయడం వల్ల ప్రస్తుతం పంట కూడా బాగుంది. – రేబాల సురేంద్రరెడ్డి, రైతు, దువ్వూరు
Comments
Please login to add a commentAdd a comment