barrage construction
-
మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం బ్యారేజి కూడా డ్యామేజ్
-
చురుగ్గా సాగుతున్న ‘సమ్మక్క’ బ్యారేజీ పనులు
వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో 6.26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే, ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా మోటార్లు నడిచేలా నీరు నిల్వ ఉండాలన్నా.. సాగునీరు అందాలన్నా గోదావరి నదిపై చేపట్టిన సమ్మక్క బ్యారేజీ కీలకం. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై ఈ బ్యారేజీ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నారు. తాజాగా ఇక్కడ గేట్లు బిగించే పనులు మొదలుపెట్టగా... నేరుగా సీఎం పేషీ నుంచి పర్యవేక్షణ కొనసాగుతోంది. అలాగే, ఇటీవల నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ స్వయంగా పనులను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు సమ్మక్క బ్యారేజీ పనులు, వివరాలపై ప్రత్యేక కథనం – ఏటూరునాగారం / కన్నాయిగూడెం సాక్షి, వరంగల్: గోదావరి నీటితో తెలంగాణలోని జిల్లాలను సస్యశ్యామలం చేయాలని సంకల్పంతో కంతనపల్లి బ్యారేజీ నిర్మాణానికి రూపకల్పన చేశారు. 2009 ఫిబ్రవరి 19న అప్పటి ఏటూరునాగారం మండలం కంతనపల్లిలో గోదావరి నదిపై సుజల స్రవంతి పీ.వీ.నరి్సంహారావు పేరుతో బ్యారేజ్ నిర్మించడానికి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే కంతనపల్లి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే ఎనిమిది గ్రామాలు పూర్తిగా, మరో 12 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతుండంతో ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనను తుపాకులగూడెం ప్రాంతానికి మార్చారు. తాజాగా ఈ బ్యారేజీ పేరును సమ్మక్క బ్యారేజీగా మార్చారు. క్రేన్ సాయంతో అమరుస్తున్న గడ్డర్లు నీటి లభ్యత ఆధారంగా బ్యారేజీ నిర్మాణం తుపాకులగూడెం వద్ద గోదావరిలో నీటి లభ్యత గరిష్టంగా 470 టీఎంసీలకు పైగా ఉంటుంది. దీంతో ఇక్కడ 83 మీటర్ల ఎత్తులో 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 1.132 మీటర్ల పొడవు, 59 గేట్లతో బ్యారేజ్ పనులు చేపట్టారు. రూ. 2,121 కోట్లతో పరిపాలనా అనుమతులివ్వగా, రూ.1,700 కోట్లతో ఏజెన్సీలతో ఒప్పందం కుదిరింది. మిగతా నిధులను పరిహారం, ఇతరత్రా అంశాలకు వెచ్చించనున్నారు. కాగా, ఈ పనుల్లో ఇప్పటికే రూ.1100 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మట్టి, కాంక్రీట్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. 59 గేట్లలో 50 గేట్ల తయారీ పూర్తయింది. గేట్లు అమర్చే పనులు ప్రారంభించగా ఒక గేటు అమర్చడం పూర్తయింది. ఏప్రిల్ చివరి నాటికి మొత్తం గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోడ్ బ్రిడ్జి స్లాబ్‌లు సైతం 40 వరకు పూర్తయ్యాయి. 30 పియర్ నిర్మాణాలు పూర్తి కాగా.. వాటి మధ్యలో నుంచే ప్రస్తుతం గోదావరి నీటి ప్రవాహం దిగువకు వెళ్తుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇక్కడ నీటి నిల్వ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఇంజనీర్లను ఆదేశించారు. అంతేకాకుండా గేట్లకు ప్రిసైటింగ్ ఐరన్ రోప్‌ను రక్షణగా అమర్చనున్నారు. ప్రస్తుతం రెండు మోటార్ల ద్వారానే.. దేవాదుల ఎత్తిపోతల పథకం విషయానికొస్తే మొదటి దశలో రెండు మోటార్లు, రెండో దశలో రెండు మోటార్లు, మూడో దశలో ఆరు మోటార్లను అమర్చారు. కానీ ప్రధానంగా రెండు పైపులైన్లు మాత్ర మే రిజర్వాయర్లకు అనుసంధానం చేసి ఉన్నాయి. దీంతో వాటి ద్వారానే నీటిని పంపించడం జరుగుతుంది. సమ్మక్క బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే దేవాదుల వద్ద జలకళ సంతరించుకోనుంది. ఇప్పటికే పనులు జరుగుతున్న క్రమంలో కాపర్ డ్యామ్‌ను నిర్మించి నీరు దేవాదుల వద్ద నిల్వ ఉండే విధంగా చర్యలు చేపట్టారు. జలాశయాల్లో కావాల్సినంత నీరు ఉండడం వల్ల ప్రస్తుతా నికి మోటార్లను ప్రారంభించలేదు. పియర్స్‌లో కాంక్రీట్ నింపుతున్న ఎలివేటర్ బ్లూమర్ నాలుగు కిలోమీటర్ల మేర.. ఎగువ ఉన్న ప్రాజెక్టుల నీరు తుపాకులగూడెం బ్యారేజ్ వద్ద నిల్వ ఉండేలా బ్యారేజ్ స్లూయిస్ నిర్మాణం 70 నుంచి 71 మీటర్ల లెవల్ వరకు పనులు ఇప్పటి వరకే పూర్తి చేశారు. ఈ లెవల్లో 2.90 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వర్షాకాలంలో వరద మొదలయ్యే నాటికి ఒక్క టీఎంసీ నీటిని కూడా దిగువకు వదలొద్దన్న ఉద్దేశంతో జూలై, ఆగస్టు నాటికి బ్యారేజ్ ఎఫ్ఆర్ఎల్ 83 మీటర్ల మేర(6.94 టీఎంసీలు) నీరును నిల్వ చేసేలా పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పనులు వేగంగా చేసి దేవాదుల కింద వరంగల్, కరీంనగర్‌లోని 6.26 లక్షల ఎకరాల ఆయకట్టకు సాగు నీరు అందించాలనే లక్ష్యాన్ని సమ్మక్క బ్యారేజ్ సాధ్యం చేయనుంది. కాగా, సమ్మక్క బ్యారేజీ వద్ద గేట్ల నిర్మాణం పూర్తయితే నాలుగు కిలోమీటర్ల మేర గోదావరిలో నీరు నిల్వ ఉంటుంది. ఇలా బ్యాక్ వాటర్ సమృద్ధిగా నిల్వ కాగానే.. దేవాదులలోని మోటార్లు నడిపి దిగువకు నీరు ఎత్తిపోస్తారు. సముద్రమట్టానికి 72 మీటర్ల దిగువన.. దేవాదుల ఎత్తిపోతల పథకం ఇన్‌టేక్‌వెల్ సముద్రమట్టానికి 72 మీటర్ల దిగువన మోటార్లును అమర్చారు. సమ్మక్క బ్యారేజ్ నుంచి దేవాదుల వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర నీరు నిల్వ ఉండనుంది. నీరు 71 మీటర్ల మేర నిల్వ ఉంటే ఇన్టేక్వెల్లోని పది మోటార్లను ప్రారంభించి ఒక్కసారిగా నీరు ఎత్తిపోసే అవకాశముంది. పనులు కొనసాగుతున్నాయి.. సమ్మక్క బ్యారేజ్ పనుల్లో 7.50 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేశాం. ఒక గేటు పూర్తిగా బిగించాం. రెండో గేటు బిగింపు పనులు సాగుతున్నాయి. అయితే, 59 గేట్లకు గాను 58 గేట్లు సిద్ధం ఉన్నాయి. రాంత్రిబవళ్లు పనులు చేయిస్తూ త్వరగా బ్యారేజీ సిద్ధమయ్యేలా చూస్తున్నాం. – జగదీష్, ఈఈ, సమ్మక్క బ్యారేజ్ -
జల'ఆశయం'
దశాబ్దకాలంగా అడుగు ముందుకు పడని పెన్నా, సంగం బ్యారేజీల పనులకు మోక్షం లభించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు కాక ప్రాజెక్ట్‌ల పనులకు బ్రేక్‌లు పడ్డాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో సాగునీటి రంగానికి ఎనలేని ప్రాధాన్యమిచ్చింది. ఏళ్లుగా పనులు జరగక పడకేసిన ఈ బ్యారేజీల నిర్మాణాలను పూర్తి చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ప్రత్యేక చొరవతో ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి అన్నదాతల కళ్లలో ఆనందం చూసేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో ఈ రెండు బ్యారేజీల నిర్మాణాలు అడుగు ముందుకు పడలేదు. చేసిన పనులకు బిల్లులు కూడా ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను నిలిపేశారు. ఇప్పుడు రాత్రి పగలు అనే తేడా లేకుండా పనులు వేగవంతమయ్యాయి. రానున్న కొద్ది నెలల్లో రెండు ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి సింహపురి అన్నదాతలకు అంకితం చేయనున్నారు. సాక్షి, నెల్లూరు : సోమశిల జలాశయం నుంచి వచ్చే వృథా జలాలు సముద్రం పాలవకుండా సంగం వద్ద, నెల్లూరులో పెన్నానదిపై బ్యారేజీల నిర్మాణానికి దివంగత సీఎం వైఎస్సార్ 2008లో సంకల్పించారు. జలయజ్ఞం ద్వారా రెండు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఆయా ప్రాజెక్ట్‌లకు రూ.300 కోట్లను కేటాయించారు. 2014లోపు దాదాపు 50 శాతం మేర పనులు పూర్తి చేశారు. అయితే గత టీడీపీ హయాంలో అడుగు ముందుకు పడలేదు. అప్పటి మంత్రులతో పాటు చంద్రబాబు తరచూ ఆ ప్రాజెక్ట్‌లను సందర్శించి అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ అన్నదాతలను మభ్యపెట్టారు. గత ఐదేళ్ల కాలంలో ఆ ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు పడకేశాయి. కొంత మేర చేసిన పనులకు బిల్లులను అప్పటి టీడీపీ ప్రభుత్వం నిలిపేయడంతో కాంట్రాక్టర్లు పనులను ఆపేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, జిల్లాకు చెందిన అనిల్‌కుమార్‌యాదవ్ నీటిపారుదల శాఖ మంత్రి కావడంతో ఆ ప్రాజెక్ట్‌లకు మోక్షం కలిగింది. మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని అధికారులను ఆదేశించడంతో పాటు దాదాపు రూ.32 కోట్ల పెండింగ్ బిల్లులను మంత్రి మంజూరు చేయడంతో సంగం, పెన్నాబ్యారేజీల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇదీ పనుల తీరు.. ♦ పెన్నా బ్యారేజీ 54 శ్లాబులను పూర్తి చేశారు. త్వరలో గేట్లను అమర్చనున్నారు. రూ.150 కోట్లకు గానూ రూ.129.16 కోట్ల విలువైన పనులను పూర్తి చేశారు. ఈ ఏడాది మార్చిలోపు నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు కృషి చేస్తున్నారు. ♦ సంగం బ్యారేజీ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే గేట్లను కూడా అమర్చనున్నారు. రూ.156 కోట్ల వ్యయమైన పనులకు ఇప్పటి వరకు రూ.119.48 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. దాదాపు 76.42 శాతం పనులు పూర్తయ్యాయి. మరో ఆర్నెల్లో నిర్మాణాలను పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు సంగం, పెన్నా బ్యారేజీల నిర్మాణాలు పూర్తయితే దాదాపు 4.5 లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరందే అవకాశం ఉంది. సంగం బ్యారేజీ ద్వారా కనుపూరు, కావలి, దువ్వూరు, ఎన్టీఎస్ కాలువలకు సాగునీరందుతుంది. ఆయా కాలువ ద్వారా దాదాపు 3.5 లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరందుతుంది. దీంతో చివరి ఆయకట్టుకు నీరందే అవకాశం ఉండడంతో రెండు పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెన్నా బ్యారేజీ ద్వారా సర్వేపల్లి కెనాల్, జాఫర్‌సాహెబ్ కెనాల్, కృష్ణపట్నం కెనాల్ ద్వారా దాదాపు లక్ష ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు పుష్కలంగా అందుతుంది. ఆర్నెలల్లో ప్రాజెక్ట్‌ల పూర్తి సంగం, పెన్నా బ్యారేజీల నిర్మాణాలను ఆర్నెల్లో పూర్తి చేస్తాం. గతంలో చేసిన పనులకు బిల్లులు పెండింగ్ ఉండటంతో నిలిపేశారు. పెండింగ్ ప్రాజెక్ట్‌లను వెంటనే పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆదేశించడంతో పనులను వేగవంతం చేశాం. పెండింగ్ బిల్లులు మంత్రి ఆదేశాలతో మంజూరయ్యాయి. – హరినారాయణరెడ్డి, తెలుగుగంగ ప్రాజెక్ట్ ఈఈ నెల్లూరు సకాలంలో వరిపైరు సాగు చేశాం ఈ ఏడాది సంగం ఆనకట్టకు పూర్తిగా సాగునీరు చేరడంతో సకాలంలో వరిపైరు సాగు చేశాం. గత ఐదేళ్లలో ఎన్నడూ సంగం ఆనకట్టలో ఈ ఏడాది వచ్చినంత సాగునీరు రాలేదు. నారుమడులు వేసే సమయానికి సంగం ఆనకట్టకు పూర్తిగా నీరు రావడంతో సకాలంలో వరిపైరు నాటుకున్నాం. – నెల్లూరు కోటారెడ్డి, రైతు, తరుణవాయి కాలువల కింద సాగు చేస్తున్నాం సంగం ఆనకట్టకు ఈ ఏడాది సాగునీరు సకాలంలో చేరడంతో పంట కాలువల కింద వరిపైరు సాగు చేస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా బీడు పెట్టుకున్న మా పొలాలకు ఈ ఏడాది సకాలంలో సాగునీరు వచ్చింది. దీంతో పూర్తిస్థాయిలో రైతులందరూ వరిపైరు సాగు చేస్తున్నారు. సకాలంలో వరిపైరు సాగు చేయడం వల్ల ప్రస్తుతం పంట కూడా బాగుంది. – రేబాల సురేంద్రరెడ్డి, రైతు, దువ్వూరు -
మేడిగడ్డపై ప్రతిష్టంభన!
* బ్యారేజీ నిర్మాణంపై కొలిక్కి రాని చర్చలు * ఎత్తుపై మహారాష్ట్ర అభ్యంతరాలు * మేడిగడ్డ ప్రాంతాన్ని వారంలో పరిశీలిస్తామన్న ఆ రాష్ట్ర మంత్రి * అనంతరం మరోదఫా చర్చలు * ముంపులేని తుమ్మిడిహెట్టి, ఛనాఖా-కొరట బ్యారేజీలకు ఓకే సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నిర్మించదలిచిన బ్యారేజీపై ప్రతిష్టంభన వీడలేదు. ఈ అంశంపై మంగళవారం జరిగిన సమావేశంలోనూ బ్యారేజీ ఎత్తు విషయంలో మహారాష్ట్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో చర్చలు ఇంకా కొలిక్కి రాకుండానే ముగిశాయి. మేడిగడ్డ వద్ద ప్రతిపాదిత ఎత్తులో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ముం పు లెక్కలకు, తమ అధ్యయనంలో తేలిన లెక్కలకు పొంతన కుదరడం లేదని మహారాష్ట్ర పేర్కొన్నట్లు సమాచారం. దీంతోపాటు వారం రోజుల్లో తాను మేడిగడ్డ ప్రాంతా న్ని పరిశీలిస్తానని, అనంతరం మరోమారు చర్చలు జరుపుదామని మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ అన్నట్లు తెలిసింది. తుమ్మిడిహెట్టి వద్ద ముంపు లేని బ్యారేజీ, పెన్‌గంగ దిగువన నిర్మించే ఛనాఖా-కొరట బ్యారేజీల నిర్మాణానికి సూత్రప్రాయ అంగీకారం తెలపడంతోపాటు అంతర్రాష్ట్ర ఒప్పందాలు చేసుకునేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. 2 విడతలుగా చర్చలు: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీలతో ముంపు విషయమై మహారాష్ట్ర ప్రభుత్వంతో మంగళవారం ముంబైలో చర్చలు జరిగాయి. మహారాష్ట్ర జల వనరుల మంత్రి గిరీష్ మహా జన్, ఉన్నతాధికారులతో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, సీఈలు హరిరామ్, వెంకటేశ్వర్లు సమావేశమయ్యారు. మొదట మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడున్నర వరకు, తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు రెండుసార్లు ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బ్యారేజీని ప్రతిపాదించి, దాని ప్రకారం అప్పటి ప్రభుత్వం కాలువల తవ్వకం ప్రారంభించిందని రాష్ట్ర అధికారులు వివరించారు. అయితే నీటి లభ్యతపై కేంద్ర జల సంఘం సందేహాలు, ముంపుపై మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ అధ్యయనం చేసి గోదావరిపై కాళేశ్వరానికి దిగువన మేడిగడ్డ వద్ద 103 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బ్యారేజీని ప్రతిపాదించిందని, ఆ ఎత్తులో ముంపు మొత్తం నదీ గర్భంలో ఉంటుందని పేర్కొన్నదని వివరించారు. దీంతోపాటు తుమ్మిడిహెట్టి బ్యారేజీని ముంపు లేకుండా నిర్మిస్తామని.. ఈ రెండు బ్యారేజీల నిర్మాణానికి ఆమోదం తెలపాలని కోరారు. మహారాష్ట్రలో ముంపు ప్రాంతాలకు పరిహారాన్ని కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే మేడిగడ్డ వద్ద 103 మీటర్లతో మహారాష్ట్రలో ముంపు ఎక్కువగా ఉందని తెలుస్తోందని... దానిపై తమ రాష్ట్ర అధికారులు ఇంకా అధ్యయనం చేస్తున్నరని మహారాష్ట్రమంత్రి తెలిపినట్లు సమాచారం. వారం రోజుల్లో స్వయంగా మేడిగడ్డ వద్ద పర్యటించి ముంపు ప్రాంతాన్ని పరిశీలిస్తానని, అనంతరం మరోదఫా హైదరాబాద్‌లోనే చర్చలు జరిపి ఓ నిర్ణయానికి వద్దామని మహారాష్ట్ర మంత్రి పేర్కొన్నట్లు తెలిసింది. దీనికి తెలంగాణ బృందం సైతం సానుకూలత తెలిపింది. ఇక ఛనాఖా-కొరట బ్యారేజీతో మహారాష్ట్ర భూభాగంలో రెండున్నర ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని.. దానికి పరిహారాన్ని పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తామని, భూసేకరణకు అవసరమయ్యే చర్యలన్నీ తామే తీసుకుంటామని వివరించారు. దీనికి మహారాష్ట్ర అధికారులు అంగీకారం తెలిపారు.