* బ్యారేజీ నిర్మాణంపై కొలిక్కి రాని చర్చలు
* ఎత్తుపై మహారాష్ట్ర అభ్యంతరాలు
* మేడిగడ్డ ప్రాంతాన్ని వారంలో పరిశీలిస్తామన్న ఆ రాష్ట్ర మంత్రి
* అనంతరం మరోదఫా చర్చలు
* ముంపులేని తుమ్మిడిహెట్టి, ఛనాఖా-కొరట బ్యారేజీలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నిర్మించదలిచిన బ్యారేజీపై ప్రతిష్టంభన వీడలేదు. ఈ అంశంపై మంగళవారం జరిగిన సమావేశంలోనూ బ్యారేజీ ఎత్తు విషయంలో మహారాష్ట్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో చర్చలు ఇంకా కొలిక్కి రాకుండానే ముగిశాయి.
మేడిగడ్డ వద్ద ప్రతిపాదిత ఎత్తులో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ముం పు లెక్కలకు, తమ అధ్యయనంలో తేలిన లెక్కలకు పొంతన కుదరడం లేదని మహారాష్ట్ర పేర్కొన్నట్లు సమాచారం. దీంతోపాటు వారం రోజుల్లో తాను మేడిగడ్డ ప్రాంతా న్ని పరిశీలిస్తానని, అనంతరం మరోమారు చర్చలు జరుపుదామని మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ అన్నట్లు తెలిసింది. తుమ్మిడిహెట్టి వద్ద ముంపు లేని బ్యారేజీ, పెన్‌గంగ దిగువన నిర్మించే ఛనాఖా-కొరట బ్యారేజీల నిర్మాణానికి సూత్రప్రాయ అంగీకారం తెలపడంతోపాటు అంతర్రాష్ట్ర ఒప్పందాలు చేసుకునేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.
2 విడతలుగా చర్చలు: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీలతో ముంపు విషయమై మహారాష్ట్ర ప్రభుత్వంతో మంగళవారం ముంబైలో చర్చలు జరిగాయి. మహారాష్ట్ర జల వనరుల మంత్రి గిరీష్ మహా జన్, ఉన్నతాధికారులతో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, సీఈలు హరిరామ్, వెంకటేశ్వర్లు సమావేశమయ్యారు. మొదట మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడున్నర వరకు, తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు రెండుసార్లు ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బ్యారేజీని ప్రతిపాదించి, దాని ప్రకారం అప్పటి ప్రభుత్వం కాలువల తవ్వకం ప్రారంభించిందని రాష్ట్ర అధికారులు వివరించారు. అయితే నీటి లభ్యతపై కేంద్ర జల సంఘం సందేహాలు, ముంపుపై మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ అధ్యయనం చేసి గోదావరిపై కాళేశ్వరానికి దిగువన మేడిగడ్డ వద్ద 103 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బ్యారేజీని ప్రతిపాదించిందని, ఆ ఎత్తులో ముంపు మొత్తం నదీ గర్భంలో ఉంటుందని పేర్కొన్నదని వివరించారు.
దీంతోపాటు తుమ్మిడిహెట్టి బ్యారేజీని ముంపు లేకుండా నిర్మిస్తామని.. ఈ రెండు బ్యారేజీల నిర్మాణానికి ఆమోదం తెలపాలని కోరారు. మహారాష్ట్రలో ముంపు ప్రాంతాలకు పరిహారాన్ని కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే మేడిగడ్డ వద్ద 103 మీటర్లతో మహారాష్ట్రలో ముంపు ఎక్కువగా ఉందని తెలుస్తోందని... దానిపై తమ రాష్ట్ర అధికారులు ఇంకా అధ్యయనం చేస్తున్నరని మహారాష్ట్రమంత్రి తెలిపినట్లు సమాచారం. వారం రోజుల్లో స్వయంగా మేడిగడ్డ వద్ద పర్యటించి ముంపు ప్రాంతాన్ని పరిశీలిస్తానని, అనంతరం మరోదఫా హైదరాబాద్‌లోనే చర్చలు జరిపి ఓ నిర్ణయానికి వద్దామని మహారాష్ట్ర మంత్రి పేర్కొన్నట్లు తెలిసింది.
దీనికి తెలంగాణ బృందం సైతం సానుకూలత తెలిపింది. ఇక ఛనాఖా-కొరట బ్యారేజీతో మహారాష్ట్ర భూభాగంలో రెండున్నర ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని.. దానికి పరిహారాన్ని పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తామని, భూసేకరణకు అవసరమయ్యే చర్యలన్నీ తామే తీసుకుంటామని వివరించారు. దీనికి మహారాష్ట్ర అధికారులు అంగీకారం తెలిపారు.
మేడిగడ్డపై ప్రతిష్టంభన!
Published Wed, Jan 13 2016 3:27 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM
Advertisement
Advertisement