మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ ప్రదేశంలో నిలిచిన నీరు
మహదేవపూర్: మహారాష్ట్రలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీటి కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ పనులకు అంతరాయం ఏర్పడింది. గోదావరి నదిలో నిర్మిస్తున్న బ్యారేజీ గేట్ల మధ్యన తవ్వకం చేపట్టిన ప్రదేశాల్లో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. అలాగే బ్యారేజీ పనులు నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ కంపెనీ క్యాంపు కార్యాలయం, ఇంజనీర్ల కంటెయినర్లు, కార్మికులు నివాసం ఉండే షెడ్లలోకి నీరు చేరింది.
నిల్వ నీటిని రెండు రోజుల పాటు భారీ మోటార్లతో తోడితే తప్ప పనులను చేపట్టే పరిస్థితి కనిపించడంలేదని ఇంజనీర్లు చెబుతున్నారు. వర్షాలు, నదుల ప్రవాహం తగ్గితేనే బ్యారేజీ నిర్మాణ పనులు ముందుకు సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్ పనులు వర్షం కారణంగా శుక్రవారం నిలిచిపోయిన విషయం తెలిసిందే. శనివారం వరద ఉధృతి కొంత తగ్గడంతో కాంక్రీట్ పనులు మాత్రం నడుస్తున్నాయి. పిల్లర్ల చుట్టూ చేరిన నీటిని తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment