సమ్మక్క బ్యారేజ్ వ్యూ
వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో 6.26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే, ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా మోటార్లు నడిచేలా నీరు నిల్వ ఉండాలన్నా.. సాగునీరు అందాలన్నా గోదావరి నదిపై చేపట్టిన సమ్మక్క బ్యారేజీ కీలకం. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై ఈ బ్యారేజీ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నారు. తాజాగా ఇక్కడ గేట్లు బిగించే పనులు మొదలుపెట్టగా... నేరుగా సీఎం పేషీ నుంచి పర్యవేక్షణ కొనసాగుతోంది. అలాగే, ఇటీవల నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ స్వయంగా పనులను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు సమ్మక్క బ్యారేజీ పనులు, వివరాలపై ప్రత్యేక కథనం
– ఏటూరునాగారం / కన్నాయిగూడెం
సాక్షి, వరంగల్: గోదావరి నీటితో తెలంగాణలోని జిల్లాలను సస్యశ్యామలం చేయాలని సంకల్పంతో కంతనపల్లి బ్యారేజీ నిర్మాణానికి రూపకల్పన చేశారు. 2009 ఫిబ్రవరి 19న అప్పటి ఏటూరునాగారం మండలం కంతనపల్లిలో గోదావరి నదిపై సుజల స్రవంతి పీ.వీ.నరి్సంహారావు పేరుతో బ్యారేజ్ నిర్మించడానికి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే కంతనపల్లి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే ఎనిమిది గ్రామాలు పూర్తిగా, మరో 12 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతుండంతో ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనను తుపాకులగూడెం ప్రాంతానికి మార్చారు. తాజాగా ఈ బ్యారేజీ పేరును సమ్మక్క బ్యారేజీగా మార్చారు.
క్రేన్ సాయంతో అమరుస్తున్న గడ్డర్లు
నీటి లభ్యత ఆధారంగా బ్యారేజీ నిర్మాణం
తుపాకులగూడెం వద్ద గోదావరిలో నీటి లభ్యత గరిష్టంగా 470 టీఎంసీలకు పైగా ఉంటుంది. దీంతో ఇక్కడ 83 మీటర్ల ఎత్తులో 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 1.132 మీటర్ల పొడవు, 59 గేట్లతో బ్యారేజ్ పనులు చేపట్టారు. రూ. 2,121 కోట్లతో పరిపాలనా అనుమతులివ్వగా, రూ.1,700 కోట్లతో ఏజెన్సీలతో ఒప్పందం కుదిరింది. మిగతా నిధులను పరిహారం, ఇతరత్రా అంశాలకు వెచ్చించనున్నారు. కాగా, ఈ పనుల్లో ఇప్పటికే రూ.1100 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మట్టి, కాంక్రీట్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. 59 గేట్లలో 50 గేట్ల తయారీ పూర్తయింది. గేట్లు అమర్చే పనులు ప్రారంభించగా ఒక గేటు అమర్చడం పూర్తయింది. ఏప్రిల్ చివరి నాటికి మొత్తం గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోడ్ బ్రిడ్జి స్లాబ్‌లు సైతం 40 వరకు పూర్తయ్యాయి. 30 పియర్ నిర్మాణాలు పూర్తి కాగా.. వాటి మధ్యలో నుంచే ప్రస్తుతం గోదావరి నీటి ప్రవాహం దిగువకు వెళ్తుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఇక్కడ నీటి నిల్వ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఇంజనీర్లను ఆదేశించారు. అంతేకాకుండా గేట్లకు ప్రిసైటింగ్ ఐరన్ రోప్‌ను రక్షణగా అమర్చనున్నారు.
ప్రస్తుతం రెండు మోటార్ల ద్వారానే..
దేవాదుల ఎత్తిపోతల పథకం విషయానికొస్తే మొదటి దశలో రెండు మోటార్లు, రెండో దశలో రెండు మోటార్లు, మూడో దశలో ఆరు మోటార్లను అమర్చారు. కానీ ప్రధానంగా రెండు పైపులైన్లు మాత్ర మే రిజర్వాయర్లకు అనుసంధానం చేసి ఉన్నాయి. దీంతో వాటి ద్వారానే నీటిని పంపించడం జరుగుతుంది. సమ్మక్క బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే దేవాదుల వద్ద జలకళ సంతరించుకోనుంది. ఇప్పటికే పనులు జరుగుతున్న క్రమంలో కాపర్ డ్యామ్‌ను నిర్మించి నీరు దేవాదుల వద్ద నిల్వ ఉండే విధంగా చర్యలు చేపట్టారు. జలాశయాల్లో కావాల్సినంత నీరు ఉండడం వల్ల ప్రస్తుతా నికి మోటార్లను ప్రారంభించలేదు.
పియర్స్‌లో కాంక్రీట్ నింపుతున్న ఎలివేటర్ బ్లూమర్
నాలుగు కిలోమీటర్ల మేర..
ఎగువ ఉన్న ప్రాజెక్టుల నీరు తుపాకులగూడెం బ్యారేజ్ వద్ద నిల్వ ఉండేలా బ్యారేజ్ స్లూయిస్ నిర్మాణం 70 నుంచి 71 మీటర్ల లెవల్ వరకు పనులు ఇప్పటి వరకే పూర్తి చేశారు. ఈ లెవల్‌లో 2.90 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వర్షాకాలంలో వరద మొదలయ్యే నాటికి ఒక్క టీఎంసీ నీటిని కూడా దిగువకు వదలొద్దన్న ఉద్దేశంతో జూలై, ఆగస్టు నాటికి బ్యారేజ్ ఎఫ్‌ఆర్‌ఎల్ 83 మీటర్ల మేర(6.94 టీఎంసీలు) నీరును నిల్వ చేసేలా పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పనులు వేగంగా చేసి దేవాదుల కింద వరంగల్, కరీంనగర్‌లోని 6.26 లక్షల ఎకరాల ఆయకట్టకు సాగు నీరు అందించాలనే లక్ష్యాన్ని సమ్మక్క బ్యారేజ్ సాధ్యం చేయనుంది. కాగా, సమ్మక్క బ్యారేజీ వద్ద గేట్ల నిర్మాణం పూర్తయితే నాలుగు కిలోమీటర్ల మేర గోదావరిలో నీరు నిల్వ ఉంటుంది. ఇలా బ్యాక్ వాటర్ సమృద్ధిగా నిల్వ కాగానే.. దేవాదులలోని మోటార్లు నడిపి దిగువకు నీరు ఎత్తిపోస్తారు.
సముద్రమట్టానికి 72 మీటర్ల దిగువన..
దేవాదుల ఎత్తిపోతల పథకం ఇన్‌టేక్‌వెల్ సముద్రమట్టానికి 72 మీటర్ల దిగువన మోటార్లును అమర్చారు. సమ్మక్క బ్యారేజ్ నుంచి దేవాదుల వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర నీరు నిల్వ ఉండనుంది. నీరు 71 మీటర్ల మేర నిల్వ ఉంటే ఇన్‌టేక్‌వెల్‌లోని పది మోటార్లను ప్రారంభించి ఒక్కసారిగా నీరు ఎత్తిపోసే అవకాశముంది.
పనులు కొనసాగుతున్నాయి..
సమ్మక్క బ్యారేజ్ పనుల్లో 7.50 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేశాం. ఒక గేటు పూర్తిగా బిగించాం. రెండో గేటు బిగింపు పనులు సాగుతున్నాయి. అయితే, 59 గేట్లకు గాను 58 గేట్లు సిద్ధం ఉన్నాయి. రాంత్రిబవళ్లు పనులు చేయిస్తూ త్వరగా బ్యారేజీ సిద్ధమయ్యేలా చూస్తున్నాం.
– జగదీష్, ఈఈ, సమ్మక్క బ్యారేజ్
Comments
Please login to add a commentAdd a comment