
దోచుకున్నవారికి దోచుకున్నంత!
► ఇష్టారాజ్యంగా పెన్నాలో ఆక్రమణలు
► పొక్లెయిన్లు పెట్టి నదిలో గనుల తవ్వకాలు
► పట్టించుకోని మైనింగ్ శాఖ అధికారులు
జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్: అక్రమార్కుల కన్ను పెన్నా నదిపై పడింది. నదిని ఇష్టారాజ్యంగా అక్రమించుకుని దొరికిన కాడికి దోచేస్తున్నారు. అందులోని సహజసంపదే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. ఆక్రమణదారులు పెన్నానదిలో సరిహద్దులను ఏర్పాటు చేసుకొని పూర్తిగా అమ్మేసుకుంటున్నారు. ఇలా కొనుగోలు చేసుకున్న వారు నదిలో గనులను తవ్వడం కోసం యథేచ్ఛగా పొక్లెయిన్లు, ట్రాక్టర్లు వినియోగిస్తున్నారు.
మట్టిని తోడి రాళ్లను బయటికి తీస్తున్నారు. దీంతో పెన్నానదిలో ఎక్కడపడితే అక్కడ నాపరాళ్ల గనులు ఏర్పడ్డాయి. భారీ గుంతలతో నది స్వరూపమే మారుతున్న అధికారుల్లో మాత్రం కదలిక లేదు. పట్టించుకునేవారు లేకపోవడంతో అక్రమార్కులకు తమ వ్యాపారాలను జోరుగా కొనసాగిస్తున్నారు.
పెద్దల ఆస్తి అంటూ అమ్మేస్తున్నారు
ప్రకృతి సిద్ధంగా ఉన్న పెన్నా నదిని కొంతమంది అక్రమార్కులు తమ పెద్దల ఆస్తి అని చెబుతూ సరిహద్దులు పెట్టి సెంటు భూమిని రూ.లక్షలకు విక్రయిస్తున్నారు. కొనుగోలు చేసినవారు ఆ భూమిని నాపనాళ్ల గనుల కోసం ఇతరులకు లీజుకు ఇచ్చేస్తున్నారు. ఇలా జమ్మలమడుగు, మోరగుడి, దొమ్మరనంద్యాల, వేపరాల, పొన్నతోట ప్రాంతాల్లో దాదాపు 60 గనులను పెన్నానదిలో ఏర్పాటు చేశారు. నిత్యం భారీగా నాపరాళ్లను భూగర్భంలో నుంచి తీసుకుని అమ్ముకుంటున్నారు. రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు.
ఇలా అక్రమ వ్యవహారం బహిరంగంగానే జరుగుతున్న పట్టించుకునే అధికారులు కరువయ్యారు. అక్రమార్కుల కారణంగా పెన్నానది పూర్తిగా గుంతలమయం అయిపోయింది. ఇదే అదనుగా మరికొంతమంది పెన్నా నడిబొడ్డులో చదును చేసి వ్యవసాయ భూములుగా మార్చుకున్నారు. ఇంత జరుగుతున్నా సరే మైనింగ్ అధికారులు ఏడాదికి ఒక్కసారైన దాడులు చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ వచ్చిన పెన్నానదిలో మైనింగ్ చేసుకునే అక్రమార్కులతో సంబంధాలు ఉన్నాయని, దాడులకు వచ్చేముందు సమాచారం ఇచ్చి వస్తారని స్థానికంగా ప్రచారం ఉంది.
తమ దృష్టికి వచ్చింది:
పెన్నానదిలో అక్రమార్కులు గనులు చేసుకుంటున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చింది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నదిలో జరుగుతున్న అక్రమ గునులను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. –బి.చంద్రశేఖర్‌రెడ్డి,తహసీల్దార్, జమ్మలమడుగు