పుట్టిన రోజున.. పుట్టెడు దు:ఖం | Two Students Deceased Over Swimming In Penna River At YSR Kadapa | Sakshi
Sakshi News home page

పుట్టిన రోజున.. పుట్టెడు దు:ఖం

Published Wed, Mar 24 2021 9:18 AM | Last Updated on Wed, Mar 24 2021 10:26 AM

Two Students Deceased Over Swimming In Penna River At YSR Kadapa - Sakshi

పుట్టిన రోజు వేడుక.. ఇంటిల్లిపాదీ ఆనందం.. స్నేహితులతో మరెంతో సంతోషం.. కొత్త దుస్తులు.. తోటి మిత్రులు.. పెన్నానదిలో వారితో భోజనం.. అంతా ఆనందమయం.. అంతలోనే అనుకోని ప్రమాదం.. నీటి సుడులలో పోయిన ప్రాణం..  క్షణాల్లో జరిగిపోయింది ఘోరం.. తమ గారాల బిడ్డ ఇక లేడని.. ఇంటికి రాడని తెలిసి.. ఆ తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీళ్లు సుడులయ్యాయి. ఒక్కగానొక్క కొడుకుపై పెట్టుకున్న కోటి ఆశలు జలసమాధి అయ్యాయి.. శతమానం భవతి అని ఆశీర్వదించాల్సిన సమయాన.. జనాజా(పాడె) మోసే దుర్గతి పట్టినందుకు.. కన్నవారి హృదయంలో  విషాదం ఉప్పెనైంది.. 

ప్రొద్దుటూరు : ‘బాబా..! మేర బర్త్‌డేకు నయా కపడే లావో.. చాక్లెట్స్‌బీ దిలానా.. స్కూల్‌ మే ఫ్రెండ్స్‌కు చాక్లెట్‌ దేతూ బాబా..’ రెండు రోజుల క్రితం మహమ్మద్‌ తండ్రితో అన్న మాటలు ఇవి. కుమారుడి కళ్లలో ఆనందం చూడాలని రెండు రోజులు ముందే తండ్రి కొత్త దుస్తులు తెచ్చాడు. పుట్టిన రోజు కావడంతో కొత్త దుస్తులు తొడిగి కుమారుడిని తల్లి అందంగా ముస్తాబు చేసింది. తల్లిదండ్రులకు బై చెప్పిన ఆ పిల్లాడు పాఠశాలకు వెళ్లాడు. పుట్టిన రోజే తనకు చివరి రోజు అవుతుందని పాపం బాలుడికి తెలియదు. విద్యార్థులందరూ బర్త్‌డే బాయ్‌ మహమ్మద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అందరి విషెస్‌ అందుకున్న విద్యార్థి ఆనందంతో తబ్బిబ్బయ్యాడు. కొద్ది గంటల్లోనే మరో విద్యార్థితో కలిసి తిరిగిరాని లోకాలకు పయనమయ్యాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటన రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.  

రూరల్‌ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దర్గాబజార్‌కు చెందిన షేక్‌ మహమ్మద్‌(13), కేహెచ్‌ఎం స్ట్రీట్‌కు చెందిన తాహిర్‌(13) కొత్తకొట్టాలలోని ఉర్దూ హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నారు. ఎప్పటి లాగే ఇద్దరూ పాఠశాలకు వెళ్లారు. ఈ రోజు తన పుట్టిన రోజని మహమ్మద్‌ తోటి స్నేహితులకు చెప్పాడు. భోజన విరామంలో అందరూ కలసి బయటికి వెళ్లాలని మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే మహమ్మద్, తాహిర్‌తో పాటు మరో ఆరుగురు విద్యార్థులు వెంట తెచ్చుకున్న క్యారియర్లను తీసుకొని పాఠశాలలో చెప్పకుండా రామేశ్వరం సమీపంలోని పెన్నానదికి వెళ్లారు.  

పెన్నానదిలో సరదాగా గడపాలని.. 
పాఠశాల నుంచి పెన్నా నది సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. స్కూల్‌ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు నడుచుకుంటూ అక్కడికి వెళ్లారు. ముందుగా తమ వెంట తెచ్చుకున్న క్యారియర్లలోని భోజనాలను ఆరగించారు. రైల్వే వంతెనపై కొంత సేపు ఆడుకున్నారు. ఆ తర్వాత దిగువన ఉన్న పెన్నానదిలో నీరు తక్కువగా ఉండటంతో విద్యార్థులందరూ అక్కడ దిగి  ఈతకొట్టసాగారు. ఈ క్రమంలోనే మహమ్మద్, తాహిర్‌ ఈదుకుంటూ నీరు ఎక్కువగా ఉన్న మడుగులోకి వెళ్లారు. అక్కడున్న రజకులు వెళ్లవద్దని వారించారు. అయినా వారు వినిపించుకోలేదు.

లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరు పిల్లలు మునిగి పోయారు. నీళ్లలో కొట్టుమిట్టాడుతున్న తాహిర్‌ను చూసి సమీపంలో ఉన్న రజకులు అతన్ని బయటికి తీసుకొచ్చారు. అప్పటికే  నీళ్లు తాగిన బాలుడు మృతి చెందాడు. మహమ్మద్‌ ఊబిలో ఇరుక్కొని పోయాడు. సుమారు నాలుగు గంటల పాటు అతని మృతదేహం బయట పడలేదు. అగ్నిమాపక శాఖ అధికారి రఘునాథ్‌ ఆధ్వర్యంలో రెస్క్యూ టీం నీళ్లలోకి దిగి బాలుడి శవాన్ని బయటికి తీశారు. రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మినారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

భయంతో పరుగెత్తిన విద్యార్థులు..
ఇద్దరు విద్యార్థులు నీళ్లలో మునిగిన సమయంలో మిగతా పిల్లలు పక్కనే ఉన్నారు. తోటి స్నేహితులు ఆపదలో ఉన్నా.. వారిని కాపాడాలనే అవగాహన, అంత వయసు గానీ వారికి లేదు. దీంతో అక్కడి నుంచి భయంతో ఆరుగురు విద్యార్థులు పరుగులు తీశారు. వారి ద్వారా పాఠశాలలోని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఇద్దరు విద్యార్థులు మృతి చెందారనే విషయం తెలిసింది. దీంతో పిల్లల కుటుంబ సభ్యులు, వీధిలోని ప్రజలు సంఘటన స్థలానికి చేరుకున్నారు.  

పుట్టిన రోజే.. పరలోకానికి 
షాహుస్సేన్‌వలి దర్గాబజారులో నివాసం ఉంటున్న మహబూబ్‌బాషాకు భార్య చాంద్‌బీతో పాటు షాబిరా అనే కుమార్తె, మహమ్మద్‌ అనే కుమారుడు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం కుమార్తెకు వివాహమైంది. మహబూబ్‌బాషా మసీదులో మౌజన్‌గా పని చేస్తున్నాడు. కుమారుడి పుట్టిన రోజు కావడంతో రెండు రోజుల క్రితమే అతను కొత్త దుస్తులు తెచ్చాడు. ఉదయాన్నే కొత్త దుస్తులు ధరించి కుమారుడు స్కూల్‌కు వెళ్లాడు. అలా వెళ్లిన కుమారుడిని శవంలా చూడాల్సి వస్తుందని అనుకోలేదని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. 

తాహిర్‌ కుటుంబంలో విషాదం 
షేక్షావలి కేహెచ్‌ఎం స్ట్రీట్‌లో నివాసం ఉంటున్నాడు. బొంగు బజార్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు గౌస్‌పీర్, తాహిర్‌ అనే ఇద్దరు కుమారులతో పాటు కుమార్తె ఉన్నారు. కుమారుడు మృతి చెందాడనే విషయం విద్యార్థుల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు సొమ్మసిల్లి పడిపోయారు.

చదవండి: నా కోరిక తీర్చు.. లేదంటే నీ కొడుకు, భర్తను అంతం చేస్తా  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement