![Andhra Pradesh clarification to Central during NWDA Governing Body meeting - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/18/GODAVRI.jpg.webp?itok=zWB847az)
సాక్షి, అమరావతి: ఏపీ అవసరాలు తీర్చాకే కావేరి పరీవాహక ప్రాంతానికి గోదావరి జలాలను తరలించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం వర్చువల్ విధానంలో జరిగిన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలక మండలి సమావేశంలో గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరి అనుసంధానంపై ప్రధానంగా చర్చించారు. బేసిన్ పరిధిలోని రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఏపీ తరఫున జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు.
సహకరించాలన్న జల్‌శక్తి శాఖ కార్యదర్శి
జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247.19 టీఎంసీలను నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా) మీదుగా కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కు తరలించే పనులు చేపట్టడానికి సహకరించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ కోరారు. దీనిపై ఛత్తీస్‌గఢ్ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమకు కేటాయించిన 147.9 టీఎంసీలను కావేరికి తరలించడానికి అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనలో ఎస్సారెస్పీ(శ్రీరాంసాగర్ ప్రాజెక్టు)–ఇచ్చంపల్లి మధ్య 176.6 టీఎంసీల లభ్యత ఉంటుందని లెక్క కట్టిందని, కానీ వాటిని ఉపయోగించుకునేలా ఇప్పటికే ప్రాజెక్టులు చేపట్టామని, అంటే అక్కడ ఇక నీటి లభ్యత ఉండదని తెలంగాణ స్పష్టం చేసింది. మహానది–గోదావరి అనుసంధానం చేపట్టాకనే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని పేర్కొంది. సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చడాన్ని అంగీకరించబోమంది.
అదనపు వాటా కోసం పట్టు..
గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా కృష్ణా బేసిన్‌కు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కర్ణాటక డిమాండ్ చేసింది. కావేరి జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కేరళ కోరింది. గోదావరి–కావేరి అనుసంధానాన్ని పూర్తి చేసి తమ రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని తమిళనాడు విజ్ఞప్తి చేసింది. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకున్నాక గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని పంకజ్‌కుమార్ తెలిపారు. బేసిన్ పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్‌ను ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు.
ఏపీ ఏం చెప్పిందంటే..
► గోదావరిలో నీటి లభ్యతపై ఎన్‌డబ్ల్యూడీఏ, కేంద్ర జలసంఘం వేర్వేరుగా లెక్కలు చెబుతున్నాయి. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే గోదావరి నికర జలాల్లో మిగులు లేదు. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలి. గోదావరి డెల్టాకు ఖరీఫ్‌కు నీళ్లు అవసరం. అందువల్ల జూన్‌లో కావేరికి గోదావరిని తరలించరాదు.
► ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకే 776 టీఎంసీలు అవసరం. దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి గోదావరి–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్(బీసీఆర్) అనుసంధానం చేపట్టాలని నిర్ణయించాం. ఈ ప్రతిపాదన మేరకు గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలి. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు గోదావరి జలాలు చేరేలా అనుసంధానం చేపట్టాలి. బొల్లాపల్లి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మిస్తేనే అనుసంధానం ఫలవంతమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment