Krishna - Godavari
-
కావేరికి గోదారి.. ఏపీ అవసరాలను తీర్చాకే
సాక్షి, అమరావతి: ఏపీ అవసరాలు తీర్చాకే కావేరి పరీవాహక ప్రాంతానికి గోదావరి జలాలను తరలించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం వర్చువల్ విధానంలో జరిగిన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలక మండలి సమావేశంలో గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరి అనుసంధానంపై ప్రధానంగా చర్చించారు. బేసిన్ పరిధిలోని రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఏపీ తరఫున జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. సహకరించాలన్న జల్‌శక్తి శాఖ కార్యదర్శి జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247.19 టీఎంసీలను నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా) మీదుగా కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కు తరలించే పనులు చేపట్టడానికి సహకరించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ కోరారు. దీనిపై ఛత్తీస్‌గఢ్ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమకు కేటాయించిన 147.9 టీఎంసీలను కావేరికి తరలించడానికి అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనలో ఎస్సారెస్పీ(శ్రీరాంసాగర్ ప్రాజెక్టు)–ఇచ్చంపల్లి మధ్య 176.6 టీఎంసీల లభ్యత ఉంటుందని లెక్క కట్టిందని, కానీ వాటిని ఉపయోగించుకునేలా ఇప్పటికే ప్రాజెక్టులు చేపట్టామని, అంటే అక్కడ ఇక నీటి లభ్యత ఉండదని తెలంగాణ స్పష్టం చేసింది. మహానది–గోదావరి అనుసంధానం చేపట్టాకనే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని పేర్కొంది. సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చడాన్ని అంగీకరించబోమంది. అదనపు వాటా కోసం పట్టు.. గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా కృష్ణా బేసిన్‌కు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కర్ణాటక డిమాండ్ చేసింది. కావేరి జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కేరళ కోరింది. గోదావరి–కావేరి అనుసంధానాన్ని పూర్తి చేసి తమ రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని తమిళనాడు విజ్ఞప్తి చేసింది. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకున్నాక గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని పంకజ్‌కుమార్ తెలిపారు. బేసిన్ పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్‌ను ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఏపీ ఏం చెప్పిందంటే.. ► గోదావరిలో నీటి లభ్యతపై ఎన్‌డబ్ల్యూడీఏ, కేంద్ర జలసంఘం వేర్వేరుగా లెక్కలు చెబుతున్నాయి. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే గోదావరి నికర జలాల్లో మిగులు లేదు. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలి. గోదావరి డెల్టాకు ఖరీఫ్‌కు నీళ్లు అవసరం. అందువల్ల జూన్‌లో కావేరికి గోదావరిని తరలించరాదు. ► ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకే 776 టీఎంసీలు అవసరం. దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి గోదావరి–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్(బీసీఆర్) అనుసంధానం చేపట్టాలని నిర్ణయించాం. ఈ ప్రతిపాదన మేరకు గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలి. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు గోదావరి జలాలు చేరేలా అనుసంధానం చేపట్టాలి. బొల్లాపల్లి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మిస్తేనే అనుసంధానం ఫలవంతమవుతుంది. -
‘గెజిట్’పై ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలన్న విషయమై ఇరిగేషన్ శాఖ తీవ్ర మంతనాలు జరుపుతోంది. రాష్ట్ర ప్రాజెక్టులపై పడే ప్రభావం, బోర్డుకు కొత్తగా సంక్రమించే హక్కులు తదితరాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో సోమవారం ఈ అంశంపై ప్రత్యేక సమావేశం జరపనుంది. ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రతజ్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి ఈఎన్సీలతోపాటు అంతర్రాష్ట్ర జల విభాగ ఇంజనీర్లు, ఇతర న్యాయ నిపుణులు హాజరయ్యే అవకాశం ఉంది. గెజిట్‌తో రాష్ట్రానికి జరిగిన న్యాయాన్యాయాలు, తెలంగాణ భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరుతెన్నులు, న్యాయ పోరాటం, కొత్త ట్రిబ్యునల్ కోసం తేవాల్సిన ఒత్తిడి వంటి అంశాల గురించి ఈ భేటీలో చర్చించనున్నారు. న్యాయ పోరాటమా.. కొత్త ట్రిబ్యునలా? కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలో ఉంచడాన్ని తెలంగాణ తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు లేకుండా బోర్డుల పరిధిని నిర్ణయించరాదని కోరినా కేంద్రం మాత్రం వాటి పరిధిని నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాలు బోర్డుల పరిధిని నోటిఫై చేసేందుకు సమ్మతించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో గెజిట్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లే విషయమై రాష్ట్రం తర్జనభర్జన పడుతోంది. సుప్రీంకు వెళ్లినా రాష్ట్రానికి పెద్దగా ఉపశమనం ఉండదనే భావన ప్రభుత్వ పెద్దల నుంచి వస్తోంది. గెజిట్‌పై కొట్లాడటంకన్నా కొత్త ట్రిబ్యునల్ చేత విచారణ జరిపించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే రాష్ట్రానికి నదీ జలాల్లో వాటాలు పెరుగుతాయని ప్రభుత్వ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును పరిశీలిస్తామని కేంద్ర మంత్రి స్వయంగా అపెక్స్ భేటీలో చెప్పిన నేపథ్యంలో కేంద్రం తన మాటకు కట్టుబడి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ఉండాలనే సూచనలు వస్తున్నాయి. కొత్త ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో విచారణ జరిగితే పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీల్లో తెలంగాణ కనీసం 500 టీఎంసీల వరకు నీటి వాటా దక్కించుకునే అవకాశం ఉంటుందని, వరద జలాల ఆధారంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు నికర జలాల లభ్యత పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై సోమవారం భేటీలో ఇంజనీర్ల సలహాలు తీసుకొని న్యాయపోరాటం చేయాలా లేక రాష్ట్ర వాటాలు పెరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వ్యూహంతో ముందుకెళ్లాలా అనే విషయమై ఓ నిర్ణయానికి రానుంది. ప్రాజెక్టుల పనుల నిలుపుదలపై తర్జనభర్జన కేంద్రం తన నోటిఫికేషన్లో అనుమతులు లేని ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించడంతోపాటు నోటిఫికేషన్ వెలువడిన ఆరు నెలల్లోగా ఆయా ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను బోర్డులకు సమర్పించి, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం గెజిట్‌లో ప్రచురించిన తెలంగాణ ప్రాజెక్టుల పనులు నిలిపివేయడం, అనుమతుల ప్రక్రియ వేగిరం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. అనుమతుల్లేవని కేంద్రం చెబుతున్న తెలంగాణ ప్రాజెక్టుల్లో కృష్ణా బేసిన్ పరిధిలో పాలమూరు–రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, ఎస్ఎల్బీసీకి అదనంగా 10 టీఎంసీల తరలింపు, కల్వకుర్తి, కల్వకుర్తికి అదనంగా 10 టీఎంసీల తరలింపు, డిండి, ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల, భక్త రామదాస, తుమ్మిళ్ల, నెట్టెంపాడు, నెట్టెంపాడు ద్వారా అదనంగా 3.40 టీఎంసీ తరలింపు, దుబ్బవాగు, సీతారామ మూడో పంప్‌హౌస్, మున్నేరులు ఉండగా గోదావరి బేసిన్లోవి కంతనపల్లి బ్యారేజీ, కాళేశ్వరం ద్వారా అదనపు టీఎంసీ మళ్లింపు, రామప్ప–పాకాల, ప్రాణహిత, గూడెం ఎత్తిపోతల, చిన్న కాళేశ్వరం, చౌట్పల్లి హమ్మంత్రెడ్డి ఎత్తిపోతల, కందుకుర్తి ఎత్తిపోతల, సీతారామ, మోదికుంటవాగు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిపై ఎలా నడుచుకోవాలన్న విషయమై ఇంజనీర్ల నుంచి స్పష్టత తీసుకోనుంది. అలాగే ప్రాజెక్టుల పర్యావరణ, అటవీ అనుమతుల ప్రక్రియను వేగిరం చేసే అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నాయి. -
కృష్ణా, గోదావరి వరదలపై కీలక సమావేశం..కృష్ణా బోర్డు భేటీ వాయిదా!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో దిగువ రాష్ట్రాలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు కృష్ణా గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ (కేజీబీవో) మంగళవారం కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బేసిన్ పరిధిలోని రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేజీబీవో సీఈ డి.రంగారెడ్డి వర్చువల్ విధానంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సీజన్లో కృష్ణా, గోదావరి నదులకు వరద వచ్చే సమయంలో.. వరద ముప్పును తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎగువ రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయనున్నారు. కృష్ణా బేసిన్‌లోని జలాశయాల్లో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరాకగానీ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయడం లేదు. గరిష్టంగా వరదను ఒకేసారి విడుదల చేయడం వల్ల దిగువ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద బారిన పడుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడు వరద ముప్పును ఎదుర్కొంటున్న ఏపీ, తెలంగాణ.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కనీసం తాగడానికి కూడా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని నదీ బేసిన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వరద సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలు, దిగువ రాష్ట్రాలతో సమాచార మార్పిడి తదితర అంశాలపై ఆయా రాష్ట్రాలకు మార్గదర్శనం చేయనున్నారు. కృష్ణా బోర్డు భేటీ వాయిదా సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపకాలపై చర్చించేందుకు మంగళవారం జరగాల్సిన కృష్ణా బోర్డు భేటీ వాయిదా పడింది. యాస్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జల వనరుల శాఖ అధికారులంతా దానిని ఎదు ర్కొనే కార్యాచరణలో నిమగ్నమై ఉన్నారు. దీనికితోడు కేంద్రం ఆదేశాల మేరకు పోల వరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై అధికార యంత్రాంగం ఉన్నందున మంగళవారం నాటి భేటీని వాయిదావేయాలని ఆంధ్రప్రదేశ్ బోర్డును కోరింది. ఈ నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. -
ఇచ్చంపల్లికే మొగ్గు !
సాక్షి, హైదరాబాద్ : నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా గోదావరి నుంచి కృష్ణా జలాలను కావేరీకి తరలించే క్రమంలో ఇచ్చంపల్లి నుంచే నీటి తరలింపునకు కేంద్రం మొగ్గుచూపుతోంది. ఇప్పటికే కేంద్ర జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించిన అకినేపల్లి ప్రతిపాదనను, జనంపేట నుంచి పైప్‌లైన్ ద్వారా నీటి తరలింపు ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకించడంతో ఇచ్చంపల్లి నుంచి నీటిని నాగార్జునసాగర్‌కు తరలించే ప్రతిపాదనకు పదును పెడుతోంది. అనుసంధాన ప్రక్రియపై ఈ నెల 21న ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇచ్చంపల్లి నుంచి నీటి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చిన ఎన్‌డబ్ల్యూడీఏ.. దీనిపై తెలంగాణ అభిప్రాయాలు కోరింది. నిజానికి ఎన్‌డబ్ల్యూడీఏ మొదట 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరీకి తరలించాలని మొదట ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం తెలపడంతో జనంపేట ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. భూసేకరణ తగ్గించేలా పైప్‌లైన్ ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించాలని ప్రతిపాదించింది. అయితే పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తే వ్యయం ఏకంగా రూ.90 వేల కోట్ల మేర ఉంటోంది. కాల్వల ద్వారా అయితే రూ.60 వేల కోట్ల వరకే వ్యయం ఉంటోంది. అయినా ఈ ప్రతిపాదనతో పెద్దగా ఉపయోగం లేకపోవడంతో తెలంగాణ తిరస్కరించింది. దీంతో ఇచ్చంపల్లి నుంచి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇచ్చంపల్లి (గోదావరి)– నాగార్జునసాగర్ (కృష్ణా) ప్రాజెక్టులను అనుసంధానించాలని, దీనికి మూసీ రిజర్వాయర్‌ను వినియోగించుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనికి తెలంగాణ సానుకూలంగా ఉంది. ఈ అనుసంధానం ద్వారా ఎస్సారెస్పీ–2లోని కాకతీయ కాల్వల ఆయకట్టు, ఎస్ఎల్బీసీ ఆయకట్టు, డిండి ఆయకట్టుకు కలిపి మొత్తం 9 లక్షల హెక్టార్లు (25 లక్షల ఎకరాలు) ఆయకట్టుకు నీరు అందించొచ్చని కేంద్రం చెబుతోంది. దీనికి రూ.73 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. దీనిపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణను కోరింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి నీటిని కృష్ణాకు తరలించే అంశమై చర్చలు జరుగుతున్న దృష్ట్యా, దీనిపై ఓ స్పష్టత వచ్చాక కేంద్రం చేస్తున్న ప్రతిపాదనపై స్పష్టత ఇస్తామని తెలంగాణ తెలిపింది. -
నీటి పంచాయతీపై చలో ఢిల్లీ!
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై మరోమారు చర్చలకు కేంద్రం సిద్ధమైంది. ఏడాది కిందట ఈ బోర్డులతో చర్చించిన పిదప మరెలాంటి చర్చలు చేయని కేంద్రం, తొలి సారి రెండు నదీ యాజమాన్య బోర్డుల చైర్మన్లు, కార్యదర్శులతో సమావేశం జరిపేందుకు సమాయత్త మైంది. ఈ నెల 13న ఢిల్లీలో బోర్డులతో భేటీ నిర్వ హిస్తామని కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లకు కేంద్ర జల వనరుల శాఖ లేఖలు రాసింది. కృష్ణా, గోదావరి నదీ జలాల పరిధిలో నెలకొన్న వివాదా లతో పాటు, పోలవరం పరిధిలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న అంశాలపై అన్న నివేదికలతో రావాలని కేంద్రం బోర్డుల చైర్మన్లను ఆదేశించింది. బోర్డు పరిధి, కొత్త ప్రాజెక్టులు కృష్ణా, గోదావరి జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ఐదేళ్లుగా అనేక వివాదాలు నడుస్తున్నాయి. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నియంత్రణ, నీటి కేటాయింపుల్లో వాటాలు, కొత్త ప్రాజెక్టులపై వివాదం కొనసాగు తోంది. తెలంగాణ ఇటీవలే వైకుంఠపురం, హరిశ్చంద్రాపురం వంటి ఎత్తిపోతల పథకాలు చేప ట్టిందని ఏపీ బోర్డులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటే బోర్డుల పరిధి, వర్కిం గ్ మ్యాన్యువల్‌ను ఆమోదిం చాల్సి ఉంది. దీనిపై తెలంగాణ అనేక అభ్యంతరాలు చెబుతోంది. కృష్ణాలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటా యింపులే లేనప్పుడు, ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం ఎందుకని తెలంగాణ ప్రశ్నిస్తోంది. నిర్ణీత కేటా యింపుల్లోంచే వాటా నీటిని వాడుకుంటు న్నామని చెబుతోంది. దీంతో బోర్డు మ్యాన్యు వల్కు ఆమోదం దక్కడం లేదు. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటే ఇంతవరకు జరగలేదు. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలపై చర్చిద్దామని కేంద్రం బోర్డులకు స్పష్టం చేసింది. మళ్లింపు వాటా, ముంపు తీవ్రత ప్రధానం.. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఏపీ చేపట్టిన పోలవరం ద్వారా తెలంగాణకు 45 టీఎంసీలు, ఇదే అవార్డు ప్రకారం పోలవరం కాకుండా ఇంకా ఏదైనా ప్రాజెక్టు (పట్టిసీమ) ద్వారా గోదావరి నుంచి కృష్ణా కు నీటిని తరలిస్తే అంతే పరిమాణంపై రాష్ట్రాలకు వాటా ఉంటుందని చెబుతూ మొత్తంగా 90 టీఎంసీ లు తమకు దక్కుతాయని తెలంగాణ అంటోంది. ఈ నీటిని కృష్ణాలో ప్రస్తుతం ఉన్న 299 టీఎంసీల వాటాకు జోడించాలని కోరుతోంది. దీనిపై బోర్డుల వద్ద చర్చ జరిగినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ వాటాలకోసం ఇటీవల తెలంగాణ.. బోర్డుపై ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్ అధ్యక్షతన 13న ఢిల్లీలోని శ్రమశక్తిభవన్లో రెండు బోర్డుల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది. -
కృష్ణా, గోదావరిపై కొత్త ప్రాజెక్టులు: కేసీఆర్
హైదరాబాద్ : కృష్ణా, గోదావరి నదులపై కొత్తగా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తామని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. వ్యవసాయరంగం, వర్షాభావ పరిస్థితులపై ఉన్నతాధికారులతో కేసీఆర్ మంగళవారం సమీక్ష జరిపారు. రాష్ట్రంలో వ్యవసాయరంగానికి పూర్వవైభవం తేవాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులతో తెలంగాణ వ్యాప్తంగా సాగునీరు అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూరగాయల సాగు గణనీయంగా పెరగాల్సిన అవసరమందని ఈ సమీక్షలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
అనుసంధానమే శరణ్యం
ట్రిబ్యునల్ తీర్పుతో మరో గత్యంతరం లేని పరిస్థితి పోలవరం, దుమ్ముగూడెం-సాగర్ టెయిల్పాండే గతి ఈ విషయాన్ని గతంలోనే గుర్తించిన వైఎస్ కానీ వాటి నిర్మాణంపై మీనమేషాలు లెక్కిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం టెండర్ల స్థాయిలోనే పోలవరం, బుట్టదాఖలైన దుమ్ముగూడెం సాక్షి, హైదరాబాద్: కృష్ణా-గోదావరి అనుసంధానం అవసరం ఎంతగా ఉందో బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుతో మరోసారి స్పష్టమైంది. ప్రస్తుతం గోదావరి నుంచి నీటిని తరలిస్తేనే కృష్ణా ఆయకట్టు రైతులు మనుగడ సాగించే పరిస్థితి నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ విషయాన్ని గతంలోనే గుర్తించారు. అందులో భాగంగానే పోలవరం, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టులకు ఆయన ప్రాణం పోశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వాటి నిర్మాణం విషయంలో అంతులేని అలసత్వం ప్రదర్శిస్తోంది. ఆ రెండు ప్రాజెక్టుల నిర్మాణమే కీలకం: బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కారణంగా మనకు రావాల్సిన నీటి కోటా గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వర్షాభావ కాలంలో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, కృష్ణా డెల్టాలపై ఆధారపడ్డ ఆయకట్టు తీవ్రంగా దెబ్బతిన డం ఖాయం. దీన్ని తట్టుకోవాలంటే పోలవరం, దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్‌లను చేపట్టాలి. పోలవరం నిర్మిస్తే.. ఆ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి 80 టీఎంసీల నీరు కృష్ణా బేసిన్‌లోకి వస్తుంది. వీటిలో 35 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలకు పోయినా, మిగతా 45 టీఎంసీలతో డెల్టా ఆయకట్టును కాపాడుకోవచ్చు. పైగా దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ ద్వారా ఖమ్మం జిల్లా పరిధి నుంచి 165 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లోని సాగర్ దిగువకు తరలించడానికి అవకాశం ఉంది. ఈ నీటితో సాగర్ ఆయకట్టు అవసరాలను తీర్చవచ్చు. ఆ మేరకు కృష్ణాలో మిగిలే నీటిని ఇటు నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల అవసరాలకే గాక కరువును ఎదుర్కొనే రాయలసీమ అవసరాలకు కూడా వాడుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ రెండు ప్రాజెక్టులను నిర్మించడంలో అంతులేని అలసత్వం ప్రదర్శిస్తోంది. పోలవరం టెండర్లను ఖరారు చేసినా అనేక వివాదాల వల్ల పనులు మాత్రం జరగడం లేదు. ఇక దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టునైతే పూర్తిగా పక్కన పెట్టారు. వైఎస్ మరణానంతరం ఆ ప్రాజెక్టును పట్టించుకోవడమే లేదు. అనధికారికంగా ఆ ప్రాజెక్టును రద్దు చేశారనే చెప్పాలి!