సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలన్న విషయమై ఇరిగేషన్ శాఖ తీవ్ర మంతనాలు జరుపుతోంది. రాష్ట్ర ప్రాజెక్టులపై పడే ప్రభావం, బోర్డుకు కొత్తగా సంక్రమించే హక్కులు తదితరాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో సోమవారం ఈ అంశంపై ప్రత్యేక సమావేశం జరపనుంది. ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రతజ్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి ఈఎన్‌సీలతోపాటు అంతర్రాష్ట్ర జల విభాగ ఇంజనీర్లు, ఇతర న్యాయ నిపుణులు హాజరయ్యే అవకాశం ఉంది. గెజిట్‌తో రాష్ట్రానికి జరిగిన న్యాయాన్యాయాలు, తెలంగాణ భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరుతెన్నులు, న్యాయ పోరాటం, కొత్త ట్రిబ్యునల్ కోసం తేవాల్సిన ఒత్తిడి వంటి అంశాల గురించి ఈ భేటీలో చర్చించనున్నారు.
న్యాయ పోరాటమా.. కొత్త ట్రిబ్యునలా?
కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలో ఉంచడాన్ని తెలంగాణ తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు లేకుండా బోర్డుల పరిధిని నిర్ణయించరాదని కోరినా కేంద్రం మాత్రం వాటి పరిధిని నిర్ణయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇరు రాష్ట్రాలు బోర్డుల పరిధిని నోటిఫై చేసేందుకు సమ్మతించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో గెజిట్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లే విషయమై రాష్ట్రం తర్జనభర్జన పడుతోంది. సుప్రీంకు వెళ్లినా రాష్ట్రానికి పెద్దగా ఉపశమనం ఉండదనే భావన ప్రభుత్వ పెద్దల నుంచి వస్తోంది. గెజిట్‌పై కొట్లాడటంకన్నా కొత్త ట్రిబ్యునల్ చేత విచారణ జరిపించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే రాష్ట్రానికి నదీ జలాల్లో వాటాలు పెరుగుతాయని ప్రభుత్వ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.
సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును పరిశీలిస్తామని కేంద్ర మంత్రి స్వయంగా అపెక్స్ భేటీలో చెప్పిన నేపథ్యంలో కేంద్రం తన మాటకు కట్టుబడి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ఉండాలనే సూచనలు వస్తున్నాయి. కొత్త ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో విచారణ జరిగితే పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీల్లో తెలంగాణ కనీసం 500 టీఎంసీల వరకు నీటి వాటా దక్కించుకునే అవకాశం ఉంటుందని, వరద జలాల ఆధారంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు నికర జలాల లభ్యత పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై సోమవారం భేటీలో ఇంజనీర్ల సలహాలు తీసుకొని న్యాయపోరాటం చేయాలా లేక రాష్ట్ర వాటాలు పెరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వ్యూహంతో ముందుకెళ్లాలా అనే విషయమై ఓ నిర్ణయానికి రానుంది.
ప్రాజెక్టుల పనుల నిలుపుదలపై తర్జనభర్జన
కేంద్రం తన నోటిఫికేషన్‌లో అనుమతులు లేని ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించడంతోపాటు నోటిఫికేషన్ వెలువడిన ఆరు నెలల్లోగా ఆయా ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను బోర్డులకు సమర్పించి, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం గెజిట్‌లో ప్రచురించిన తెలంగాణ ప్రాజెక్టుల పనులు నిలిపివేయడం, అనుమతుల ప్రక్రియ వేగిరం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. అనుమతుల్లేవని కేంద్రం చెబుతున్న తెలంగాణ ప్రాజెక్టుల్లో కృష్ణా బేసిన్ పరిధిలో పాలమూరు–రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ, ఎస్‌ఎల్‌బీసీకి అదనంగా 10 టీఎంసీల తరలింపు, కల్వకుర్తి, కల్వకుర్తికి అదనంగా 10 టీఎంసీల తరలింపు, డిండి, ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల, భక్త రామదాస, తుమ్మిళ్ల, నెట్టెంపాడు, నెట్టెంపాడు ద్వారా అదనంగా 3.40 టీఎంసీ తరలింపు, దుబ్బవాగు, సీతారామ మూడో పంప్‌హౌస్, మున్నేరులు ఉండగా గోదావరి బేసిన్‌లోవి కంతనపల్లి బ్యారేజీ, కాళేశ్వరం ద్వారా అదనపు టీఎంసీ మళ్లింపు, రామప్ప–పాకాల, ప్రాణహిత, గూడెం ఎత్తిపోతల, చిన్న కాళేశ్వరం, చౌట్‌పల్లి హమ్మంత్‌రెడ్డి ఎత్తిపోతల, కందుకుర్తి ఎత్తిపోతల, సీతారామ, మోదికుంటవాగు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిపై ఎలా నడుచుకోవాలన్న విషయమై ఇంజనీర్ల నుంచి స్పష్టత తీసుకోనుంది. అలాగే ప్రాజెక్టుల పర్యావరణ, అటవీ అనుమతుల ప్రక్రియను వేగిరం చేసే అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment