అనుసంధానమే శరణ్యం | Setback to Andhra Pradesh as Brijesh Tribunal allows raising Almatti dam height | Sakshi
Sakshi News home page

అనుసంధానమే శరణ్యం

Published Sat, Nov 30 2013 3:52 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

అనుసంధానమే శరణ్యం - Sakshi

అనుసంధానమే శరణ్యం

ట్రిబ్యునల్ తీర్పుతో మరో గత్యంతరం లేని పరిస్థితి
పోలవరం, దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండే గతి
ఈ విషయాన్ని గతంలోనే గుర్తించిన వైఎస్
కానీ వాటి నిర్మాణంపై మీనమేషాలు లెక్కిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం
టెండర్ల స్థాయిలోనే పోలవరం, బుట్టదాఖలైన దుమ్ముగూడెం

 
 సాక్షి, హైదరాబాద్: కృష్ణా-గోదావరి అనుసంధానం అవసరం ఎంతగా ఉందో బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుతో మరోసారి స్పష్టమైంది. ప్రస్తుతం గోదావరి నుంచి నీటిని తరలిస్తేనే కృష్ణా ఆయకట్టు రైతులు మనుగడ సాగించే పరిస్థితి నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ విషయాన్ని గతంలోనే గుర్తించారు. అందులో భాగంగానే పోలవరం, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టులకు ఆయన ప్రాణం పోశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వాటి నిర్మాణం విషయంలో అంతులేని అలసత్వం ప్రదర్శిస్తోంది.
 
 ఆ రెండు ప్రాజెక్టుల నిర్మాణమే కీలకం: బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కారణంగా మనకు రావాల్సిన నీటి కోటా గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వర్షాభావ కాలంలో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, కృష్ణా డెల్టాలపై ఆధారపడ్డ ఆయకట్టు తీవ్రంగా దెబ్బతిన డం ఖాయం.
 
 దీన్ని తట్టుకోవాలంటే పోలవరం, దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్‌లను చేపట్టాలి. పోలవరం నిర్మిస్తే.. ఆ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి 80 టీఎంసీల నీరు కృష్ణా బేసిన్‌లోకి వస్తుంది. వీటిలో 35 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలకు పోయినా, మిగతా 45 టీఎంసీలతో డెల్టా ఆయకట్టును కాపాడుకోవచ్చు. పైగా దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ ద్వారా ఖమ్మం జిల్లా పరిధి నుంచి 165 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లోని సాగర్ దిగువకు తరలించడానికి అవకాశం ఉంది.

 

ఈ నీటితో సాగర్ ఆయకట్టు అవసరాలను తీర్చవచ్చు. ఆ మేరకు కృష్ణాలో మిగిలే నీటిని ఇటు నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల అవసరాలకే గాక కరువును ఎదుర్కొనే రాయలసీమ అవసరాలకు కూడా వాడుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ రెండు ప్రాజెక్టులను నిర్మించడంలో అంతులేని అలసత్వం ప్రదర్శిస్తోంది. పోలవరం టెండర్లను ఖరారు చేసినా అనేక వివాదాల వల్ల పనులు మాత్రం జరగడం లేదు. ఇక దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టునైతే పూర్తిగా పక్కన పెట్టారు. వైఎస్ మరణానంతరం ఆ ప్రాజెక్టును పట్టించుకోవడమే లేదు. అనధికారికంగా ఆ ప్రాజెక్టును రద్దు చేశారనే చెప్పాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement