
నది కాదు.. గని!
♦ ఆక్రమణలతో రూపు కోల్పోయిన పెన్నా
♦ రెండున్నర వేల ఎకరాలు కబ్జా
♦ భారీగా గనులు వెలిసినా చోద్యం చూస్తున్న అధికారులు
ప్రొద్దుటూరు టౌన్ : ఒకప్పుడు కనుచూపు మేర నీటితో కళకళలాడిన పెన్నా నది ఇపుడు ఆక్రమణలకు గురై రూపు కోల్పోయింది. అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి గండికోట మీదుగా మన జిల్లాలోకి ప్రవేశించే ఈ నది జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, చెన్నూరు మీదుగా సోమశిలలో కలుస్తుంది. కొద్ది సంవత్సరాలుగా భారీ వర్షాలు లేక నీటి పారకం మందగించింది. ఇదే అవకాశంగా ఎక్కడికక్కడ అక్రమార్కులు నదికి ఇరువైపుల నుంచి చొచ్చుకు వస్తూ దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే 2653 ఎకరాల ఏటి పోరంబోకు భూమి ఆక్రమణకు గురైంది. పెన్నానదిలో ఎవరు పడితే వారు చదును చేసి వివిధ రకాల పరిశ్రమలు పెడుతున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చి రద్దు చేసిన ఏక్‌సాల్ పట్టాలను పెట్టుకుని లక్షల రూపాయలకు విక్రయించి మరికొందరు సొమ్ము చేసుకున్నారు.
ఏటి పోరంబోకు భూమి వివరాలు
ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని చౌడూరు గ్రామానికి సంబంధించి ఏటి పోరం బోకు భూమి 316 ఎకరాలు, పెద్దశెట్టిపల్లె గ్రామంలో 253, దొరసానిపల్లె గ్రామ పరిధిలో 89, రామేశ్వరం పరిధిలో 848, నంగనూరుపల్లెలో 468, కల్లూరులో 679 ఎకరాలు.. మొత్తం 2653 ఎకరాలు ఉంది. ఎర్రగుంట్ల మండల పరిధిలోని పోట్లదుర్తి పరిధిలో 127 ఎకరాలు ఏటి భూమి ఉంది. పెన్నానదిలో నిర్మించిన కళ్యాణ మండపాలు, ఆశ్రమాలు, ఇతర భారీ భవంతుల నిర్మాణాలను అడ్డుకోలేకపోయిన 36 మంది రెవెన్యూ అధికారులకు నోటీసులిచ్చారే కానీ ఆపై ఎలాంటి చర్యలూ లేవు. దీంతో అక్రమార్కులు అధికారులను లోబరుచుకుని యథేచ్ఛగా అనుకున్నట్లు చేసుకుపోతున్నారు. సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమలు, నీటి ప్లాంట్లు పెన్నా ఏటి భూముల్లో ఎక్కువగా ఉన్నాయి.
బ్రిక్స్ పరిశ్రమలకు పెన్నా నదిలోని ఇసుకనే వినియోగిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తుండగా, ప్లాంట్లు నీటిని తోడేస్తూ భూగర్భ జలాలను మరింత అడుక్కి నెట్టుతున్నాయి. మరి కొందరు ఆక్రమణ దారులు మున్సిపల్ సిబ్బందితో పట్టణంలోని చెత్తను పెన్నానది గని గుంతల్లో పడేయిస్తూ దానిపై మట్టిని తోలి చదును చేస్తున్నారు. పెన్నా నది మధ్య, థర్మల్ రహదారి పక్కనే పెద్ద ఎత్తున మట్టిని వేసి దాదాపు 4 ఎకరాలు చదును చేసినా ఎవ్వరు పట్టించుకోలేదు. ఇదే అదునుగా అక్రమార్కులు కొన్ని చోట్ల ఏకంగా వారు ఆక్రమించిన చోట క ంచె సైతం వేశారు.
రాళ్ల గనుల్లోకి రోడ్డు
పెన్నానదిలో అక్రమంగా 50 అడుగుల లోతు వరకు రాళ్ల గనులు తవ్వారు. నదిలోకి థర్మల్ రోడ్డు గుండా వెళ్లేందుకు రహదారిని సైతం ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజు 50-70కిపైగా ట్రాక్టర్లు రాళ్లను తీసుకెళుతున్నా కూడా అధికారుల్లో చలనం లేదు. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల పరిధిలో ఉన్న ఏటి భూమి ఆక్రమణలపై ఇటీవల రెవిన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఎవరెవరు ఎంతెంత భూములు ఆక్రమించుకున్నారో తెలుసుకున్నారే కానీ వారిపై చర్యలకు ఉపక్రమించడానికి సందేహిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ప్రొద్దుటూరు ఆర్‌ఐ రామకృష్ణారెడ్డిని వివరణ కోరగా, పెన్నా నది ఆక్రమణలపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే సూచనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.