జమ్మలమడుగు: పర్యాటక ప్రాంతమైన గండికోట అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపడుతోంది. గండికోట పరిసర ప్రాంతాలలో ఉన్న 1100 ఎకరాల రెవెన్యూ భూమిని పర్యాటకశాఖకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే స్థానిక రెవెన్యూ అధికారులు దానికి సంబంధించిన రికార్డులను పరిశీలించడంతోపాటు సర్వేలను పూర్తిచేశారు. మొత్తం 1100 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను తహసీల్దార్ కార్యాలయం నుంచి అధికారులు విజయవాడకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు.
మూడు నెలల్లో అందుబాటులోకి రోప్‌వే
పెన్నానదిలోయ అందాలను వీక్షించడం కోసం ఏర్పాటు చేస్తున్న రోప్‌వే మరో మూడు నెలల్లో పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. మరో రెండు మూడు వారాల్లో పూర్తిస్థాయిలో రోప్‌వే సామగ్రి రానుంది. పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి రోప్‌వేను పర్యాటకులకు అందుబాటులోనికి తీసుకుని వస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య
ప్రపంచంలో గ్రాండ్ కెన్యాన్‌గా పేరుపొందిన పెన్నా నది లోయ అందాలతోపాటు, జుమ్మామసీదు, మాధవరాయస్వామి ఆలయం తదితర ప్రాంతాలను తిలకించేందుకు ఇటీవల పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో పర్యాటకులకు కావలసిన వసతుల కల్పన కోసం స్థానికంగా హరితా హోటల్‌తోపాటు, చాలా మంది ప్రత్యేకంగా లాడ్జిలను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. మరి కొంత మంది హోటల్, కూల్‌డ్రింక్స్‌షాపులను పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పర్యాటకులకు ఉన్నత స్థాయిలో విడిది ఏర్పాటు చేయడం కోసం గతంలో ఒబెరాయ్ హోటల్ యాజమాన్యం దాదాపు 30 నుంచి 40 ఎకరాలలో హోటల్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అలాగే ప్రైవేట్ భాగస్వామ్యంతో సైతం గండికోటకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకు రావడం కోసం పర్యాటక శాఖ ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా సాహసకృత్యాలు, స్పోర్ట్స్‌లతోపాటు వివిధ రకాల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించారు.
బోటు షికారు అనుమతుల కోసం నిరీక్షణ
గండికోటకు సమీపంలోని మైలవరం జలాశయంలో పర్యాటకుల కోసం బోటు షికారును ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం గోదావరి నదిలో బోటు మునిగి చాలా మంది మరణించడంతో ఇక్కడ బోటు షికారును నిలిపివేశారు. కాగా నెలన్నర క్రితం బోటు షికారును తిరిగి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. జలాశయంలో నీరు తక్కువగా ఉండటంతో తాత్కాలికంగా బోటు షికారును నిలిపివేశారు.
1100 ఎకరాల భూమిని అప్పగించాం
పర్యాటక కేంద్రమైన గండికోటను అభివృద్ధి చేసేందుకు 1100 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను ప్రభుత్వానికి అందజేశాము. ప్రభుత్వం ఆ భూమిని పర్యాటక శాఖకు అప్పగిస్తే వారు పర్యాటక అభివృద్ధికోసం వినియోగించనున్నారు.
–జి.శ్రీనివాసులు,ఆర్డీఓ,జమ్మలమడుగు
అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో గండికోట అభివృద్ధి
గండికోట ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో పర్యాటకంగా తీర్చిదిద్దడం కోసం ఇప్పటికే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యాటకశాఖకు ఆదేశాలు జారీచేసి ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటకులకు అన్ని వసతులు సమకూర్చుతాం. మూడు నెలల్లో రోప్‌వే పనులు పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకుని వస్తాం.
–ఈశ్వరయ్య, పర్యాటకశాఖ ఈఈ, కడప
Comments
Please login to add a commentAdd a comment