ఘన చరితకు సాక్ష్యం గండికోట | Gandikota is a popular tourist place in YSR district | Sakshi
Sakshi News home page

ఘన చరితకు సాక్ష్యం గండికోట

Published Tue, Dec 3 2024 5:49 AM | Last Updated on Tue, Dec 3 2024 5:53 AM

Gandikota is a popular tourist place in YSR district

తెలుగువారి శౌర్యప్రతాపాలకు మచ్చుతునక

క్రీస్తు శకం 1123లో గండికోటను నిర్మించిన కాకరాజు

రెండు కొండలను 5 కిలోమీటర్ల మేర గండికొట్టి ప్రవహిస్తున్న పెన్నా

ప్రపంచంలోని 40 ప్రసిద్ధ భౌగోళిక విశేషాల్లో ఒకటిగా పేరు

తెలుగువారి శౌర్యప్రతాపాలకు నిలువెత్తు సాక్ష్యం. విజయనగర సామ్రాజ్యానికి వెన్నెముకగా నిలిచి, దండయాత్రకు వచ్చిన శత్రువులను చీల్చిచెండాడి విజయభేరి మోగించిన శత్రుదుర్భేద్యమైన దుర్గం. 

చుట్టూ ఎత్తయిన ఎర్రని కొండలు, మధ్యలో నిలువులోతున హొయలుపోతూ వడివడిగా ప్రవహించే పెన్నమ్మ, నలుచెరగులా పచ్చదనాన్ని కప్పుకున్న ప్రకృతికాంత అందాలు. కొండపైన నిలువెత్తు బురుజులతో అబ్బురపరచే గండికోటను చరిత్రకారులు అమెరికాలోని గ్రాండ్‌క్యానియన్‌తో పోలుస్తారు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన గండికోట అందాలు పర్యాటకుల్ని అలరిస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, కడప:  వైఎస్సార్‌ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోట గిరి, జల, వన దుర్గంగా పేరుపొందింది. ఈ కోటను శత్రుదుర్భేద్యమైనదిగా చెబుతారు. పెన్నానది ఇక్కడ రెండు కొండలను ఐదు కిలోమీటర్ల పొడవునా గండికొట్టి వెళ్తుంది కనుక ఆ ప్రాంతంలో కట్టిన ఈ కోటకు గండికోటగా పేరొచ్చింది. 11వ శతాబ్దం నుంచి దాదాపు 800 సంవత్సరాలపాటు ఈ కోట పలు వంశాల రాజుల పాలనలో ఉంది. కైఫీయత్‌ ప్రకారం 1123లో కాకరాజు ఈ కోటను నిరి్మంచాడు. 

ఈ ప్రాంతాన్ని అంతకుముందు రేనాడుగా వ్యవహరించే వారు. చాళుక్య ప్రభువు త్రైలోక మల్లుడి ప్రతినిధిగా ములికినాడు సీమ పాలకుడు కాకరాజుకు ఈ కోటతో విశేషమైన గుర్తింపు లభించింది. కల్యాణి చాళుక్యుల ఆ«దీనం నుంచి ఆ తర్వాత ఈ కోట కాకతీయుల పరమైంది. 

» కాకతీయ ప్రభువు గణపతిదేవ చక్రవర్తి కాయస్థ వంశీకుడు గంగయ సాహిణిని ఈ కోట పాలకుడిగా నియమించారు. అనంతరం జమ్మిగ దేవుడు, త్రిపురారి దేవుడు, అంబదేవుడు, రెండవ త్రిపురారి దేవుడు కాకతీయుల ప్రతినిధిగా కోటను పాలించారు. మొత్తంపై వంద సంవత్సరాలకు పైబడి 1304 దాక ఈ కోట కాయస్థ వంశీకుల ఆధీనంలో ఉంది. 

» కాయస్థ వంశీకుల తర్వాత ఈ కోట సుల్తానుల పరమైంది. కిల్జీ వంశీయులు దీన్ని పా­లించారు. తర్వాత మూడు శతాబ్దాలపాటు శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయులు, సదాశివ రాయుల ప్రతినిధులు గండికోటను పాలించారు. తర్వాత కొద్దికాలం మహమ్మద్‌ కులీకుతుబ్‌షా ఆజ్ఞ మేరకు మీర్‌జుమ్లా ఈ కోటను పాలించాడు. 

» 1687లో ఔరంగజేబు గోల్కొండను జయించాక ఈ కోట మొగళుల పరమైంది. 1717 నుంచి 1779 వరకు మొగల్‌ సుబేదారులు, కొన్నాళ్లు కడప నవాబులు ఈ కోటను పాలించారు. 1799 వరకు గండికోట మైసూర్‌ సుల్తానుల పాలనలో ఉంది. హైదరాబాదు నిజాం పాలనా కాలంలో ఆంగ్లేయులు బలపడుతున్న సమయంలో నిజాం నవాబు గండికోటతోసహా బళ్లారి, అనంతపురం, కర్నూలు, కడపజిల్లాలను ఆంగ్లేయులకు దారాదత్తం చేశారు. వీటిని దత్త మండలాలు అనే వారు.

కోటలో చూడదగ్గ ప్రాంతాలు 
» కోటలో చూడదగ్గ ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కోటలో అడుగు పెట్టగానే మూడంతస్తుల కావలి మండపం కనిపిస్తుంది. ఈ మండపం పై అంతస్తులో సైనికులు కాపలాకాస్తూ బయటి నుంచి వచ్చే శత్రువులను గమనించేవారు. 



» గండికోటలో మరో ఆకర్షణీయ కట్టడం జామియా మసీదు. మూడు ప్రవేశ ద్వారాలతో ఇస్లామిక్‌ భారతీయ శిల్పకళా నైపుణ్యాల మేళవింపుతో నిర్మించిన ఈ మసీదులో ఒకేసారి 300 మంది ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంది. మసీదు ఎదుట వజూ ఖానా కూడా ఉంది. కోట ఎదుటగల ఎర్ర కోనేరు నుంచి దీనికి భూగర్బ గొట్టాల ద్వారా నీరు వచ్చేదని చరిత్రలో పేర్కొన్నారు. మసీదు లోపల 64, వెలుపల 32 గదులు ఉన్నాయి. బయట గుర్రాలను కట్టేసేవారని, లోపల యాత్రికులు     విశ్రాంతి తీసుకునే వారని తెలుస్తోంది. 



» కోటలో జామియా మసీదు ప్రక్కనే ఎత్తయిన ధాన్యాగారం కనిపిస్తుంది. కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ఇందులో ధాన్యాన్ని నిల్వ చేసే వారని సమాచారం. దీనిలో పైకి వచ్చేందుకు మెట్ల సౌకర్యం కూడా ఉంది. 

» జామియా మసీదు ఎదుట విశాలమైన కోనేరు ఉంది. దీన్ని ఎర్ర కోనేరు అని, కత్తుల కోనేరు అని కూడా పిలుస్తారు. సైనికులు యుద్దం అనంతరం కత్తులను ఇందులో కడిగేవారని, అందుకే నీరు ఎర్రబారిందని ప్రచారంలో ఉంది. 

» దాన్యాగారం పక్కనే శిథిలస్థితిలో ఉన్న శ్రీ రఘునాథస్వామి ఆలయం ఉంది. అద్బుతమైన శిల్పకళకు ఆలవాలంగా నిలిచి ఉన్న ఈ ఆలయంలో ప్రాకారాలపై రేఖా చిత్రాలు అందరినీ ఆకర్షిస్తాయి. ఈ ఆలయానికి కొద్దిదూరంలోనే పెన్నా లోయ ప్రవాహం ఉంటుంది.

గ్రాండ్‌ క్యానియన్‌ ఆఫ్‌ ఇండియా 
గండికోటలోని పెన్నా ప్రవాహంగల లోయకు గ్రాండ్‌ క్యానియన్‌ ఆఫ్‌ ఇండియా అని పేరు. ప్రపంచంలోని 40 ప్రసిద్ద భౌగోళిక విశేషాల్లో గండికోట ఒకటిగా పేరు గాంచింది. పెన్నా నది ఎర్రమల కొండను రెండుగా చీల్చుతూ కోట వెనుక వైపు నుంచి తూర్పు దిశగా వెళ్లి మైలవరం డ్యాంలో కలుస్తుంది. రెండు కొండల మధ్య దాదాపు 300 మీటర్లకు పైగా వెడల్పు ఉంది. 

అందులో నీరు పారుతూ ఉన్న దృశ్యాన్ని పైనుంచి చూడడం గొప్ప అనుభూతి ఇస్తుంది. సుప్రసిద్ద పర్యాటక ప్రాంతంగా చారిత్రకంగా దేశంలోనే రెండవ స్థానాన్ని ఆక్రమించిన పెన్నాలోయ అందం చూసి తీరాల్సిందే. ఇక్కడి చారిత్రక నిర్మాణాలు, సహజ సిద్దమైన అందాల కారణంగా పలు సినిమాల చిత్రీకరణలు జరుగుతున్నాయి.

గండికోట లోయ సాహస కృత్యాలకు అనువుగా ఉండటంతో 2000 సంవత్సరంలో ఇక్కడ  అడ్వెంచర్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్‌–2లో భాగంగా గండికోట అభివృద్దికి రూ.78 కోట్లు కేటాయించింది.  

కోట విశిష్టత... 
పెన్నానది ఐదు కిలోమీటర్లు కొండను గండికొట్టి ప్రవహిస్తుండడంతో దీని గట్టుపై కట్టిన కోటను గండికోట అని వ్యవహారిస్తున్నారు. కోట చుట్టూ మూడు రాతి ప్రాకారాలు ఉన్నాయి. కోట గోడలను ఒక్కొక్కటి టన్ను బరువు ఉండే ఎర్రటి శానపురాళ్లతో నిర్మించారు. పునాదులు లేకుండా కేవలం కొండ బండలపై కోటను నిర్మించడం కష్టం. కోట తూర్పు నుంచి పడమరకు 1200 మీటర్ల పొడవు, వెడల్పు 800 మీటర్లుగా ఉంది. 

కోట చుట్టూ 101 బరుజులు ఉన్నాయి. కోట తూర్పు ప్రధాన ప్రవేశ ద్వారం 20 అడుగుల ఎత్తు ఉంది. ద్వారం తలుపులకు సూది మొన గల ఇనుప గుబ్బలు బిగించారు. వీటిని మూసి తెరిచేందుకు ఎనుగులను ఉపయోగించే వారని తెలుస్తోంది. కోట చుట్టూ సైనికులు గస్తీ తిరిగేందుకు ఐదు మీటర్ల వెడల్పుగల బాటను నిర్మించారు. 

శత్రువుల రాకను గమనించేందుకు, కోట గోడలపైనుంచి ఫిరంగులు ఉపయోగించేందుకు ప్రత్యేకంగా రంద్రాలు ఉన్నాయి. పలుచోట్ల భారీ కొండరాళ్లే కోట గోడలుగా కనిపిస్తాయి. ఇంకొన్ని చోట్ల భారీ బండలపైనే కోట గోడల నిర్మాణం సాగింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement