లక్షకు పైగా పుస్తకాలు, 200కు పైగా తాళపత్ర గ్రంథాలు
భాషా పరిశోధకులకు మార్గనిర్దేశం చేసే పరిశోధనా గ్రంథాల
ఏటా వందకు పైగా సాహితీ కార్యక్రమాల నిర్వహణ
సాక్షి ప్రతినిధి కడప: ఆంగ్లేయుడైనప్పటికీ తెలుగు భాషపై ఉన్న అభిమానంతో తన ఇంటినే గ్రంథాలయంగా మార్చిన మహనీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు భాషాభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారు. అటువంటి మహనీయుడి పేరుమీద స్థాపించిన గ్రంథాలయం సాహితీవేత్తల కృషితో అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది.
దాతల సహకారంతో విలువైన పుస్తకాలు వచ్చి చేరాయి. ప్రస్తుతం రికార్డుల ప్రకారం దాదాపు లక్ష వరకు పుస్తకాలున్నాయి. సాధారణ కథల పుస్తకాలు, కవితా సంకలనాల నుంచి మహా పండితులు రాసిన కావ్యాలు, గ్రంథాలు, అత్యంత విలువైన పరిశోధక గ్రంథాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన ప్రముఖ గ్రంథాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కడప నడి»ొడ్డున ఉన్న ఈ గ్రంథాలయం తెలుగు సాహితీ అభిమానులకు సందర్శనీయ స్థలంగా మారింది.
కడప నగరంలో నిర్వహించిన జిల్లా రచయితల సంఘం ఉత్సవాలకు అతిథులుగా ప్రముఖ సాహితీవేత్తలు ఆరుద్ర, జీఎన్‌రెడ్డి, బంగోరె తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా కడపలో బ్రౌన్ నివసించిన శిథిల భవనాన్ని చూడాలని స్థానిక సాహితీవేత్త జానమద్ది హనుమచ్ఛాస్త్రిని కోరారు. దాన్ని చూసిన సాహితీవేత్తలు.. దీన్ని ఇలాగే వదిలేయొద్దని, నిరంతర సాహితీయజ్ఞం సాగిన ఈ పవిత్ర స్థలం భవిష్యత్తులో కూడా విరాజిల్లాలని బ్రౌన్ మహాశయుని పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని హనుమచ్చాస్తికి సూచించారు.
అందరూ నాటి కలెక్టర్ పీఎల్ సంజీవరెడ్డిని కలిసి విషయం వివరించారు. ఆయన సహకారంతో బ్రౌన్ గ్రంథాలయాన్ని నిరి్మంచాలని నిర్ణయించారు. కలెక్టర్ సహకారంతో స్థానిక సాహితీవేత్తలు, పెద్దలు బ్రౌన్ నివసించిన శిథిల భవనం స్థలాన్ని నాటి సీనియర్ ఆడిటర్ సీకే సంపత్‌కుమార్ నుంచి కానుకగా తీసుకున్నారు. జానమద్ది హనుమచ్ఛా్రస్తితోపాటు స్థానిక సాహితీవేత్తల సహకారంతో కమిటీ ఏర్పడింది. బ్రౌన్ పేరిట గ్రంథాలయ భవన నిర్మాణం ప్రారంభమైంది.
పుస్తక సాగరం
పలువురు పుస్తక దాతలు, సాహితీవేత్తలు తమ వద్దనున్న విలువైన పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. వల్లూరుకు చెందిన పోలేపల్లె గంగన్న శ్రేష్టి అలియాస్ రాజాశెట్టి అనే దాత ఇచ్చిన కొన్ని పుస్తకాలతో బ్రౌన్ గ్రంథాలయం ప్రారంభమైంది. ప్రస్తుతం రికార్డుల ప్రకారం ఇక్కడ దాదాపు లక్ష వరకు పుస్తకాలున్నాయి. రికార్డులకు ఎక్కాల్సిన పుస్తకాలు మరో 10వేల దాకా ఉన్నాయి. రెండో అంతస్తులో తాళపత్ర గ్రంథాల విభాగం ఉంది. పూర్వం కాగితాలు అందుబాటులో లేనికాలంలో మన పెద్దలు సమాచారాన్ని తాటాకులపై రాసి భద్రపరచేవారు.
వీటినే తాళపత్ర గ్రంథాలు అంటారు. అలాంటి ఎన్నో గ్రంథాలు, ముఖ్యంగా 200 సంవత్సరాలకు పూర్వం నాటి తాళపత్ర గ్రంథాలెన్నో ఇక్కడ ఉన్నాయి. పట్టుకుంటే పొడి, పొడిగా రాలిపోయే స్థితిలో ఉన్న పురాతన కాలం నాటి హ్యాండ్‌మేడ్ పేపర్, ఇతర రకాల కాగితాలు కూడా ఇక్కడ ఉన్నాయి. నిపుణులైన ఉద్యోగులు వీటిని మరో వందేళ్ల పాటు భద్రంగా ఉంచేందుకు కెమికల్ ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. డిజిటలైజేషన్ కూడా చేసి భావితరాల కోసం వాటిని జాగ్రత్తపరుస్తున్నారు. ఈ గ్రంథాలయంలో రాగి రేకులు కూడా ఉన్నాయి.
తాళపత్ర గ్రంథాల కంటే ఎక్కువ రోజులు నిలిచి ఉండేందుకు అప్పట్లో రాగి రేకులపై రాయించేవారు. ఈ గ్రంథాలయాన్ని సందర్శించేవారు తప్పక ఈ తాళపత్ర గ్రంథాల విభాగాన్ని సందర్శిస్తారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు, సాహితీవేత్తలు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చే సాహితీవేత్తలు, అధికారులు కూడా ఈ గ్రంథాలయాన్ని సందర్శిస్తుంటారు. తెలుగునాట ఈ గ్రంథాలయం వైఎస్సార్ జిల్లా కీర్తిని నలుదిశలా చాటుతోంది. యేటా దాదాపు 100కు పైగా సాహితీ కార్యక్రమాల నిర్వహణతో బంగోరె, ఆరుద్రల ఆశయం నెరవేరినట్లయింది.
ఈ లైబ్రరీలో ఎవరైనా సభ్యత్వం తీసుకోవచ్చు. రూ.500 నగదుతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఆధారం కోసం ఏదైనా సర్టిఫికెట్ తీసుకుని వచ్చి సభ్యత్వం పొందవచ్చు. వివరాలకు గ్రంథాలయంలో నేరుగా సంప్రదించవచ్చు. అలాగే ఈ గ్రంథాలయాన్ని ఆదివారంతో పాటు, ఇతర సెలవు దినాల్లోనూ సందర్శించవచ్చు. ప్రస్తుతం ఈ గ్రంథాలయానికి యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి ఓ సంచాలకులు ప్రధాన బా«ధ్యులుగా ఉన్నారు. ఇద్దరు సహాయ పరిశోధకులు, మరో ఇద్దరు గ్రంథాలయ సహాయకులు, అటెండర్లు, వాచ్‌మెన్‌లు మరో ఐదుగురు సేవలందిస్తున్నారు.
విస్తరణ దిశగా...
బ్రౌన్ గ్రంథాలయాన్ని విస్తరించాలని పాలకమండలి, అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 20 సెంట్లలో ఉన్న గ్రంథాలయంతో పాటు వెనుక ఉన్న స్థలంలో 25 సెంట్లు కొనుగోలు చేశారు.
స్థల దాతలు సీకే సంపత్‌కుమార్ మనవరాలు మరోమారు తమ వంతు విరాళంగా మరో ఐదు సెంట్ల స్థలాన్ని ఉచితంగా అందజేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రంథాలయాన్ని సందర్శించి విస్తరణ కోసం రూ. 6.50 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. కొత్త భవనం పూర్తయితే తెలుగు వారికి మరింత అపురూపమైన గ్రంథనిధి అందినట్లవుతుంది.
నాటి నుంచి నేటి దాకా...
1987 జనవరి, 22న బ్రౌన్ పేరిట గ్రంథాలయానికి పునాది పడింది. ఆ భవన నిర్మాణాన్ని యజ్ఞంలా భావించారు జానమద్ది. నిధుల సేకరణకు ఒక దశలో ఆయన జోలె పట్టారు. 1996లో మొదటి అంతస్తు పూర్తి కాగా, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సి.నారాయణరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చిన నిధుల నుంచి రూ. 5లక్షలతో 2003 అక్టోబర్, 9న రెండో అంతస్తు పూర్తయింది. 1995 నవంబరు, 29న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. సాహితీవేత్త, సమాజ సేవకులు వావిలాల గోపాలకృష్ణయ్య గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు.
కాలక్రమంలో గ్రంథాలయ నిర్వహణ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు కూడా కష్టతరమైంది. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 జనవరి, 27న బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని వాగ్దానం చేయడమే కాక, శాశ్వత నిర్వహణ కోసం యోగివేమన విశ్వ విద్యాలయానికి అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment