Charles Philip Brown
-
అపురూపమైన పుస్తక నిధి.. బ్రౌన్ గ్రంథాలయం
సాక్షి ప్రతినిధి కడప: ఆంగ్లేయుడైనప్పటికీ తెలుగు భాషపై ఉన్న అభిమానంతో తన ఇంటినే గ్రంథాలయంగా మార్చిన మహనీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు భాషాభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారు. అటువంటి మహనీయుడి పేరుమీద స్థాపించిన గ్రంథాలయం సాహితీవేత్తల కృషితో అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. దాతల సహకారంతో విలువైన పుస్తకాలు వచ్చి చేరాయి. ప్రస్తుతం రికార్డుల ప్రకారం దాదాపు లక్ష వరకు పుస్తకాలున్నాయి. సాధారణ కథల పుస్తకాలు, కవితా సంకలనాల నుంచి మహా పండితులు రాసిన కావ్యాలు, గ్రంథాలు, అత్యంత విలువైన పరిశోధక గ్రంథాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన ప్రముఖ గ్రంథాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కడప నడి»ొడ్డున ఉన్న ఈ గ్రంథాలయం తెలుగు సాహితీ అభిమానులకు సందర్శనీయ స్థలంగా మారింది. కడప నగరంలో నిర్వహించిన జిల్లా రచయితల సంఘం ఉత్సవాలకు అతిథులుగా ప్రముఖ సాహితీవేత్తలు ఆరుద్ర, జీఎన్‌రెడ్డి, బంగోరె తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా కడపలో బ్రౌన్ నివసించిన శిథిల భవనాన్ని చూడాలని స్థానిక సాహితీవేత్త జానమద్ది హనుమచ్ఛాస్త్రిని కోరారు. దాన్ని చూసిన సాహితీవేత్తలు.. దీన్ని ఇలాగే వదిలేయొద్దని, నిరంతర సాహితీయజ్ఞం సాగిన ఈ పవిత్ర స్థలం భవిష్యత్తులో కూడా విరాజిల్లాలని బ్రౌన్ మహాశయుని పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని హనుమచ్చాస్తికి సూచించారు. అందరూ నాటి కలెక్టర్ పీఎల్ సంజీవరెడ్డిని కలిసి విషయం వివరించారు. ఆయన సహకారంతో బ్రౌన్ గ్రంథాలయాన్ని నిరి్మంచాలని నిర్ణయించారు. కలెక్టర్ సహకారంతో స్థానిక సాహితీవేత్తలు, పెద్దలు బ్రౌన్ నివసించిన శిథిల భవనం స్థలాన్ని నాటి సీనియర్ ఆడిటర్ సీకే సంపత్‌కుమార్ నుంచి కానుకగా తీసుకున్నారు. జానమద్ది హనుమచ్ఛా్రస్తితోపాటు స్థానిక సాహితీవేత్తల సహకారంతో కమిటీ ఏర్పడింది. బ్రౌన్ పేరిట గ్రంథాలయ భవన నిర్మాణం ప్రారంభమైంది. పుస్తక సాగరం పలువురు పుస్తక దాతలు, సాహితీవేత్తలు తమ వద్దనున్న విలువైన పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. వల్లూరుకు చెందిన పోలేపల్లె గంగన్న శ్రేష్టి అలియాస్ రాజాశెట్టి అనే దాత ఇచ్చిన కొన్ని పుస్తకాలతో బ్రౌన్ గ్రంథాలయం ప్రారంభమైంది. ప్రస్తుతం రికార్డుల ప్రకారం ఇక్కడ దాదాపు లక్ష వరకు పుస్తకాలున్నాయి. రికార్డులకు ఎక్కాల్సిన పుస్తకాలు మరో 10వేల దాకా ఉన్నాయి. రెండో అంతస్తులో తాళపత్ర గ్రంథాల విభాగం ఉంది. పూర్వం కాగితాలు అందుబాటులో లేనికాలంలో మన పెద్దలు సమాచారాన్ని తాటాకులపై రాసి భద్రపరచేవారు. వీటినే తాళపత్ర గ్రంథాలు అంటారు. అలాంటి ఎన్నో గ్రంథాలు, ముఖ్యంగా 200 సంవత్సరాలకు పూర్వం నాటి తాళపత్ర గ్రంథాలెన్నో ఇక్కడ ఉన్నాయి. పట్టుకుంటే పొడి, పొడిగా రాలిపోయే స్థితిలో ఉన్న పురాతన కాలం నాటి హ్యాండ్‌మేడ్ పేపర్, ఇతర రకాల కాగితాలు కూడా ఇక్కడ ఉన్నాయి. నిపుణులైన ఉద్యోగులు వీటిని మరో వందేళ్ల పాటు భద్రంగా ఉంచేందుకు కెమికల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. డిజిటలైజేషన్ కూడా చేసి భావితరాల కోసం వాటిని జాగ్రత్తపరుస్తున్నారు. ఈ గ్రంథాలయంలో రాగి రేకులు కూడా ఉన్నాయి.తాళపత్ర గ్రంథాల కంటే ఎక్కువ రోజులు నిలిచి ఉండేందుకు అప్పట్లో రాగి రేకులపై రాయించేవారు. ఈ గ్రంథాలయాన్ని సందర్శించేవారు తప్పక ఈ తాళపత్ర గ్రంథాల విభాగాన్ని సందర్శిస్తారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు, సాహితీవేత్తలు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చే సాహితీవేత్తలు, అధికారులు కూడా ఈ గ్రంథాలయాన్ని సందర్శిస్తుంటారు. తెలుగునాట ఈ గ్రంథాలయం వైఎస్సార్ జిల్లా కీర్తిని నలుదిశలా చాటుతోంది. యేటా దాదాపు 100కు పైగా సాహితీ కార్యక్రమాల నిర్వహణతో బంగోరె, ఆరుద్రల ఆశయం నెరవేరినట్లయింది. ఈ లైబ్రరీలో ఎవరైనా సభ్యత్వం తీసుకోవచ్చు. రూ.500 నగదుతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఆధారం కోసం ఏదైనా సర్టిఫికెట్ తీసుకుని వచ్చి సభ్యత్వం పొందవచ్చు. వివరాలకు గ్రంథాలయంలో నేరుగా సంప్రదించవచ్చు. అలాగే ఈ గ్రంథాలయాన్ని ఆదివారంతో పాటు, ఇతర సెలవు దినాల్లోనూ సందర్శించవచ్చు. ప్రస్తుతం ఈ గ్రంథాలయానికి యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి ఓ సంచాలకులు ప్రధాన బా«ధ్యులుగా ఉన్నారు. ఇద్దరు సహాయ పరిశోధకులు, మరో ఇద్దరు గ్రంథాలయ సహాయకులు, అటెండర్లు, వాచ్మెన్లు మరో ఐదుగురు సేవలందిస్తున్నారు. విస్తరణ దిశగా... బ్రౌన్ గ్రంథాలయాన్ని విస్తరించాలని పాలకమండలి, అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 20 సెంట్లలో ఉన్న గ్రంథాలయంతో పాటు వెనుక ఉన్న స్థలంలో 25 సెంట్లు కొనుగోలు చేశారు. స్థల దాతలు సీకే సంపత్‌కుమార్ మనవరాలు మరోమారు తమ వంతు విరాళంగా మరో ఐదు సెంట్ల స్థలాన్ని ఉచితంగా అందజేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రంథాలయాన్ని సందర్శించి విస్తరణ కోసం రూ. 6.50 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. కొత్త భవనం పూర్తయితే తెలుగు వారికి మరింత అపురూపమైన గ్రంథనిధి అందినట్లవుతుంది. నాటి నుంచి నేటి దాకా... 1987 జనవరి, 22న బ్రౌన్ పేరిట గ్రంథాలయానికి పునాది పడింది. ఆ భవన నిర్మాణాన్ని యజ్ఞంలా భావించారు జానమద్ది. నిధుల సేకరణకు ఒక దశలో ఆయన జోలె పట్టారు. 1996లో మొదటి అంతస్తు పూర్తి కాగా, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సి.నారాయణరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చిన నిధుల నుంచి రూ. 5లక్షలతో 2003 అక్టోబర్, 9న రెండో అంతస్తు పూర్తయింది. 1995 నవంబరు, 29న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. సాహితీవేత్త, సమాజ సేవకులు వావిలాల గోపాలకృష్ణయ్య గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. కాలక్రమంలో గ్రంథాలయ నిర్వహణ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు కూడా కష్టతరమైంది. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 జనవరి, 27న బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని వాగ్దానం చేయడమే కాక, శాశ్వత నిర్వహణ కోసం యోగివేమన విశ్వ విద్యాలయానికి అప్పగించారు. -
బ్రౌన్ దొరని స్మరించుకున్న టాంటెక్స్ సాహిత్య వేదిక
డల్లాస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెలనెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు అక్టోబర్ 16వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో ఘనంగా జరిగింది. సాహిత్యవేదిక సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో డాల్లాస్‌లోని భాషాభిమానులు, సాహిత్యప్రియులు పాల్గొన్నారు. ప్రవాసంలో నిరాటంకంగా 111 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్యసదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. బిళ్ళా ప్రవీణ్ సభను ప్రారంభిస్తూ 111వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ముందుగా శ్రీమతి అనిపిండి మీనాక్షి శిష్య బృందానికి చెందిన చిన్నారులు చక్కగా అన్నమయ్య కీర్తనలు గానం చేసారు. డా. ఎం.డీ.ఎన్.రావు "అమ్మ కవిత"ని చదివి వినిపించారు. ఇటీవలే స్వర్గస్తులయిన తమ తల్లిగారి జ్ఞాపకాలతో రాసిన కవితని చదువుతూ ఆమెకి నివాళి అర్పించారు. గతంలో 76వ నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పిస్కా సత్యనారాయణ "సీతని చూసి నవ్విన బలరాముడు" అన్న అంశం మీద ఆసక్తికరంగా ప్రసంగించారు. రామాయణ కాలంనాటి సీతని భారత కాలానికి చెందిన బలరాముడిని పద్యం ద్వారా కలిపి చక్కగా చెప్పారు. సాహిత్యవేదిక సభ్యులైన మాడ దయాకర్ "భాష-ఏకాక్షరం" అంశం మీద మాట్లాడారు. మరే భాషలో లేని సోయగం తెలుగు భాషకు ఉందని చెప్తూ ఒక చిన్న అక్షరంతో ఎంతో భావాన్ని చెప్పగలమని ఉదాహరణలతో విశ్లేషించారు. "శ్రీ రమణ పేరడీలు" అంశం మీద శ్రీ మద్దుకూరి చంద్రహాస్ ప్రసంగిస్తూ కొన్నిటిని సభకు పరిచయం చేసారు. ప్రముఖులు ప్రేమలేఖలు రాస్తే ఎలా ఉంటుందో చెపుతూ కొన్ని చదివి వినిపించారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రేమలేఖ రాస్తే ఎలా ఉంటుందో చెప్తూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. ప్రతి నెలా జరిగే నెలనెలా తెలుగు వెన్నెలలో అట్లూరి స్వర్ణ నిర్వహించే ప్రశ్నావళి కార్యక్రమం బాగా సందడిగా జరుగుతుంది. ఈ సారి కూడా స్వర్ణ అడిగిన ప్రశ్నలకు సభికులు తికమక పడ్డారు. ప్రతి ఆదివారం సాయంత్రం ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సమర్పించే టాంటెక్స్ తరంగిణి కార్యక్రమం తెలుగు వన్ రేడియో ద్వారా 4 గంటల నుండి 6 గంటల వరకు సాగుతుంది. ఈ కార్యక్రమానికి RJ శ్రీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ 111వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుని దేశీ ప్లాజా స్టూడియో నుండి టాంటెక్స్ తరంగిణిలో తెలుగు వన్ రేడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసారు. సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరైన టాంటెక్స్ మరియు తానా మాజీ అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్‌ను మద్దుకూరి చంద్రహాస్ వేదిక మీదకు ఆహ్వానించగా, శ్రీ కల్వల రావు, శ్రీ పులిగండ్ల విశ్వనాథం, శ్రీ ఎం.వి.ఎల్.ప్రసాద్, శ్రీ పుదూర్ జగదీశ్వరన్ కలిసి ముఖ్య అతిథికి పుష్పగుచ్చం అందచేసారు. పాల్గొన్నారు. తెలుగు సాహిత్యరంగంలో విశేష కృషి చేసిన విదేశీయుడు చార్లెస్ బ్రౌన్ గురించి ఆయన ప్రసంగించారు. బ్రౌన్ పుట్టుపూర్వోత్తరాలను ఉద్యోగ బాధ్యతలను పరిచయం చేస్తూ తెలుగు భాషకి గ్రంధ సేకరణ, పరిరక్షణ, ముద్రణ, వ్యాకరణ రచన, నిఘంటువు రచన, లఘు రచనల కోవల్లో ఆయన చేసిన అద్భుతమైన కృషిని విశదీకరంగా వివరించారు. మెకంజీ, లెయిడన్ వంటి వారు సేకరించిన రెండువేలకు పైబడిన తాళపత్రాలను మద్రాస్ గ్రంధాలయానికి తరలించడమే కాకుండా తనకు తానుగా సుమారు 2440 గ్రంధాలను కూడా ఈ గ్రంధాలయానికి అందించిన మహోన్నత తెలుగు భాషాభిమాని బ్రౌన్ దొర అని ప్రసాద్ వివరించారు. తనకు పక్షవాతం వచ్చినా కూడా తెలుగును పరుగెత్తించిన నిబద్ధత కలిగిన విదేశీయుడు బ్రౌన్ దొర అని ఆయన తెలుగు భాషకు అందించిన సేవలు చిరస్మరణీయాలు అని తోటకూర కొనియాడారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో బ్రౌన్ స్మారక చిహ్నాల ఏర్పాటు, జయంతి-వర్థంతిల నిర్వహణ, విద్యార్థులకు బ్రౌన్ పేరిట ఉపకారవేతనాలు వంటి వాటిని అందించి బ్రౌన్కు ప్రభుత్వాలు నిజమైన నివాళి అర్పించాలని ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. కేవలం ప్రజలతో సంభాషిస్తూనే బ్రౌన్ తెలుగుని నేర్చుకుని, వ్యాకరణ సూత్రాలను రచించి, నిఘంటువును రూపొందించారని, వేమన శతకానికి ప్రాచుర్యం కల్పించి ఎన్నో శతకాలు, తాళపత్ర గ్రంధాలకు పుస్తకరూపం తీసుకు వచ్చిన అరుదైన వ్యక్తి బ్రౌన్ దొర అని ప్రసాద్ కొనియాడారు. అనంతరం ముఖ్య అతిథిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు పాలక మండలి అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి శాలువాతో మరియు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, కాకర్ల విజయ్, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, కార్యవర్గ సభ్యులు పావులూరి వేణు, పాలేటి లక్ష్మి, వనం జ్యోతి, లోకేష్ నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాహిత్య వేదిక బృంద సభ్యులు డా. కలవగుంట సుధ, వరిగొండ శ్యాం, జలసూత్రం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు సూర్యుడు బ్రౌన్
సరిగ్గా మాతృభాషపైనే పట్టు దొరకని 14 ఏళ్ల వయసులో ఆ కుర్రాడు మూడు భాషలపై మనసు పెట్టారు.. తండ్రినే గురువుగా చేసుకుని అందులో ప్రావీణ్యం సంపాదించడం మొదలెట్టారు. రాత, వ్యాకరణ దోషాలను పరిష్కరించడం అప్పుడే అలవాటైంది. ఆ అనుభవమే ఆయనకు 24 భాషలతో విశేష పరిజ్ఞానాన్ని కల్పించింది. మసకబారిన తెలుగుభాషకు పునర్జీవనం కల్పించేందుకు అంకురార్పణ జరిగింది. ఆయన ఎవరో కాదు తెలుగుకు వెలుగునిచ్చిన సూర్యుడు ఛార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్. నవంబర్ 10న ఆయన జయంతిని పురస్కరించుకుని పాఠకుల కోసం ప్రత్యేక కథనం. కడప కల్చరల్: సీపీ బ్రౌన్ 1798, నవంబరు 10న కల కత్తాలో ఉదయించారు.చిన్నప్పుడే తండ్రి వద్ద గ్రీకు, లాటిన్, హిబ్రూ భాషలను నేర్చుకున్నారు. 22 ఏళ్ల వయస్సులో 1820 ఆగస్టు 19, 20 తేదీల్లో కడపలో నాటి కలెక్టర్‌కు రెండో అసిస్టెంటుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. నాటి జిల్లా కలెక్టర్ మన్రో స్ఫూర్తితో బ్రౌన్ తెలుగుపై మక్కువ పెంచుకున్నారు. వెలగపూడి కోదండ రామ పంతులు వద్ద తెలుగు నేర్చుకుని ఆరు నెలల్లో జిల్లా యాసతో మాట్లాడటం ప్రారంభించారు. మానవతా మూర్తి.. ఉద్యోగ బాధ్యతలు, సారస్వత వ్యాసంగంతో ఆయన తీరికలేని స్థితిలో ఉన్నా కడపలో రెండు, మచిలీపట్నంలో రెండు, మద్రాసులో ఒకటి పేద విద్యార్థుల కోసం ధర్మ పాఠశాలలు ఏర్పాటు చేశారు. నిరుపేదలు, అనాథలు, వృద్ధులకు ధర్మ టిక్కెట్ల పేరుతో ఉచిత భోజన సౌకర్యం కల్పించి పూటకూళ్ల సత్రాలకు బిల్లు తానే చెల్లించారు. బ్రౌన్ ఆంగ్లేయుడు. ఇండియాలో పుట్టారు. అవివాహితునిగా ఉండి పోయారు. 1828లోపాతకడపలో సతీసహగమనం జరగబోతోం దని తహశీల్దార్ ద్వారా తెలుసుకున్నాడు. విచారించే అధికారం లేకపోయినా అడ్డుకున్నారు. దేశంలో అప్పటికీ ఇంకా సతీసహగమన నిరోధక చట్టం రాలేదు. కడప స్పెల్లింగ్‌ను ‘సీయూడీడీఏపీఏహెచ్’ అని రాయడం ఆయనకు ఇష్టం లేదు. ఆయన ‘సీఏడీఏపీఏ లేదా కేఏడీఏపీఏ’ అని రాసేవారు. ఆయన ఆశయం జిల్లావాసి వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు తీరింది. వేమనపై గౌరవం.. వేమనను ఆయన హిందూ వ్యంగ్య కవిగా, నీతి వేత్తగా గుర్తించి 3238 పద్యాలను ఐదు సంపుటాలుగా సిద్ధం చేశారు. సుమతి శతకాన్ని కూడా ఆంగ్లంలో ప్రచురించడం విశేషం. కీర్తి కిరీటం కడపలో బ్రౌన్ నివసించిన ప్రాంతంలోనే ప్రస్తుతం ఆయన పేరిట గ్రంథాలయం, భాషా పరిశోధనా కేంద్రం ఏర్పడింది. ఆయనంటే విపరీతమైన అభిమానం గల జానమద్ది హనుమచ్ఛాస్త్రి దీన్ని నిర్మించారు. నాడు జిల్లాలో జరిగిన రచయితల సభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆరుద్ర, బంగోరే శిథిలమైన బ్రౌన్ నివాస గృహాన్ని దర్శించి బ్రౌన్ స్మారకం గా గ్రంథాలయం ఏర్పాటు చేయాలని నాటి కలెక్టర్ సం జీవరెడ్డికి సూచించారు. ఆయన హనుమచ్ఛాస్త్రి ద్వారా గ్రం థాలయ నిర్మాణానికి తొలి సహాయం అందజేశారు. మధ్యప్రదేశ్ బస్తర్‌కు చెందిన తెలుగు కూలీ ప్రసాద్‌రావు ఇచ్చిన రూ. 10 నుంచి డాక్టర్ సి.నారాయణరెడ్డి ఇచ్చి న రూ. 10 లక్షల వరకు ఈ గ్రం థాల య నిర్మాణంలో ఉపయోగించారు. విన్నపం.. వైవీయూ వీసీ ఆచార్య బేతనభట్ల శ్యాం సుందర్ ఈ గ్రంథాలయాన్ని పూర్తి సహకారం అందజేస్తున్నారు. బ్రౌన్ లేఖలను ప్రత్యేక సంపుటాలుగా , గ్రంథాలయంలో బ్రౌన్ పేరిట ఆయనకు సంబంధించిన అన్ని పుస్తకాలతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, అం దులో వేమనకు కూడా స్థానం కల్పించాలని సాహితీ అభిమానులు కోరుతున్నారు. ఈ కేంద్రం ప్రస్తుత బాధ్యులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి ‘నెల నెల మన జిల్లా సాహిత్యం’తో దీనికి మరింత గౌరవాన్ని చేకూరుస్తుండడం అభినందనీయం.