తెలుగు సూర్యుడు బ్రౌన్
సరిగ్గా మాతృభాషపైనే పట్టు దొరకని 14 ఏళ్ల వయసులో ఆ కుర్రాడు మూడు భాషలపై మనసు పెట్టారు.. తండ్రినే గురువుగా చేసుకుని అందులో ప్రావీణ్యం సంపాదించడం మొదలెట్టారు. రాత, వ్యాకరణ దోషాలను పరిష్కరించడం అప్పుడే అలవాటైంది. ఆ అనుభవమే ఆయనకు 24 భాషలతో విశేష పరిజ్ఞానాన్ని కల్పించింది. మసకబారిన తెలుగుభాషకు పునర్జీవనం కల్పించేందుకు అంకురార్పణ జరిగింది. ఆయన ఎవరో కాదు తెలుగుకు వెలుగునిచ్చిన సూర్యుడు ఛార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్. నవంబర్ 10న ఆయన జయంతిని పురస్కరించుకుని పాఠకుల కోసం ప్రత్యేక కథనం.
కడప కల్చరల్:
సీపీ బ్రౌన్ 1798, నవంబరు 10న కల కత్తాలో ఉదయించారు.చిన్నప్పుడే తండ్రి వద్ద గ్రీకు, లాటిన్, హిబ్రూ భాషలను నేర్చుకున్నారు. 22 ఏళ్ల వయస్సులో 1820 ఆగస్టు 19, 20 తేదీల్లో కడపలో నాటి కలెక్టర్‌కు రెండో అసిస్టెంటుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. నాటి జిల్లా కలెక్టర్ మన్రో స్ఫూర్తితో బ్రౌన్ తెలుగుపై మక్కువ పెంచుకున్నారు. వెలగపూడి కోదండ రామ పంతులు వద్ద తెలుగు నేర్చుకుని ఆరు నెలల్లో జిల్లా యాసతో మాట్లాడటం ప్రారంభించారు.
మానవతా మూర్తి..
ఉద్యోగ బాధ్యతలు, సారస్వత వ్యాసంగంతో ఆయన తీరికలేని స్థితిలో ఉన్నా కడపలో రెండు, మచిలీపట్నంలో రెండు, మద్రాసులో ఒకటి పేద విద్యార్థుల కోసం ధర్మ పాఠశాలలు ఏర్పాటు చేశారు.
నిరుపేదలు, అనాథలు, వృద్ధులకు ధర్మ టిక్కెట్ల పేరుతో ఉచిత భోజన సౌకర్యం కల్పించి పూటకూళ్ల సత్రాలకు బిల్లు తానే చెల్లించారు.
బ్రౌన్ ఆంగ్లేయుడు. ఇండియాలో పుట్టారు. అవివాహితునిగా ఉండి పోయారు.
1828లోపాతకడపలో సతీసహగమనం జరగబోతోం దని తహశీల్దార్ ద్వారా తెలుసుకున్నాడు. విచారించే అధికారం లేకపోయినా అడ్డుకున్నారు. దేశంలో అప్పటికీ ఇంకా సతీసహగమన నిరోధక చట్టం రాలేదు.
కడప స్పెల్లింగ్‌ను ‘సీయూడీడీఏపీఏహెచ్’ అని రాయడం ఆయనకు ఇష్టం లేదు. ఆయన ‘సీఏడీఏపీఏ లేదా కేఏడీఏపీఏ’ అని రాసేవారు. ఆయన ఆశయం జిల్లావాసి వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు తీరింది.
వేమనపై గౌరవం..
వేమనను ఆయన హిందూ వ్యంగ్య కవిగా, నీతి వేత్తగా గుర్తించి 3238 పద్యాలను ఐదు సంపుటాలుగా సిద్ధం చేశారు. సుమతి శతకాన్ని కూడా ఆంగ్లంలో ప్రచురించడం విశేషం.
కీర్తి కిరీటం
కడపలో బ్రౌన్ నివసించిన ప్రాంతంలోనే ప్రస్తుతం ఆయన పేరిట గ్రంథాలయం, భాషా పరిశోధనా కేంద్రం ఏర్పడింది. ఆయనంటే విపరీతమైన అభిమానం గల జానమద్ది హనుమచ్ఛాస్త్రి దీన్ని నిర్మించారు. నాడు జిల్లాలో జరిగిన రచయితల సభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆరుద్ర, బంగోరే శిథిలమైన బ్రౌన్ నివాస గృహాన్ని దర్శించి బ్రౌన్ స్మారకం గా గ్రంథాలయం ఏర్పాటు చేయాలని నాటి కలెక్టర్ సం జీవరెడ్డికి సూచించారు.
ఆయన హనుమచ్ఛాస్త్రి ద్వారా గ్రం థాలయ నిర్మాణానికి తొలి సహాయం అందజేశారు. మధ్యప్రదేశ్ బస్తర్‌కు చెందిన తెలుగు కూలీ ప్రసాద్‌రావు ఇచ్చిన రూ. 10 నుంచి డాక్టర్ సి.నారాయణరెడ్డి ఇచ్చి న రూ. 10 లక్షల వరకు ఈ గ్రం థాల య నిర్మాణంలో ఉపయోగించారు.
విన్నపం..
వైవీయూ వీసీ ఆచార్య బేతనభట్ల శ్యాం సుందర్ ఈ గ్రంథాలయాన్ని పూర్తి సహకారం అందజేస్తున్నారు. బ్రౌన్ లేఖలను ప్రత్యేక సంపుటాలుగా , గ్రంథాలయంలో బ్రౌన్ పేరిట ఆయనకు సంబంధించిన అన్ని పుస్తకాలతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, అం దులో వేమనకు కూడా స్థానం కల్పించాలని సాహితీ అభిమానులు కోరుతున్నారు. ఈ కేంద్రం ప్రస్తుత బాధ్యులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి ‘నెల నెల మన జిల్లా సాహిత్యం’తో దీనికి మరింత గౌరవాన్ని చేకూరుస్తుండడం అభినందనీయం.