‘అప్పర్‌ పెన్నార్‌’కు మంచి రోజులు | AP Govt To Construct Devarakonda And Muttala And Somaravandlapalli Reservoirs | Sakshi
Sakshi News home page

‘అప్పర్‌ పెన్నార్‌’కు మంచి రోజులు

Published Wed, Dec 9 2020 5:01 AM | Last Updated on Wed, Dec 9 2020 6:20 AM

AP Govt To Construct Devarakonda And Muttala And Somaravandlapalli Reservoirs - Sakshi

మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి సిద్ధం చేసిన శిలాఫలకం

సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన జీడిపల్లి రిజర్వాయర్‌ నీటి ఆధారంగా దేవరకొండ, ముట్టాల, తోపుదుర్తి, సోమరవాండ్లపల్లి రిజర్వాయర్‌లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ.592 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు బుధవారం అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం దేవరకొండ వద్ద వర్చువల్‌ విధానంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకం వల్ల తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన రాప్తాడు నియోజకవర్గంలోని 25 వేల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం పేరూరు వద్ద పెన్నా నదిపై 1.81 టీఎంసీల సామర్థ్యంతో 1959లో అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద 10,052 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఎగువన కర్ణాటకలో నాగలమడక వద్ద 1999లో ప్రాజెక్టును నిర్మించడంతో అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టుకు పెన్నా జలాలు చేరడం లేదు. నాగలమడక ప్రాజెక్టు కాంట్రాక్టు పనులు చేసిన అప్పటి పెనుకొండ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర.. అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టుకు సమాధి కట్టారనే విమర్శలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తరలించి.. కరవు ప్రాంతాన్ని సస్యశ్యామం చేస్తామని 2009 ఎన్నికల్లో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఆయన హఠన్మరణంతో ఆ పనులు కార్యరూపం దాల్చలేదు.

టీడీపీ బాగోతం బట్టబయలు
► సోమరవాండ్లపల్లి (1.5 టీఎంసీలు), పుట్టకనుమ (0.63 టీఎంసీ) రిజర్వాయర్లను నిర్మించి, అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టుకు జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి కృష్ణా జలాలను తరలించి, 25 వేల ఎకరాలకు నీళ్లందించే పనులకు ఎన్నికలకు ముందు 2018 జనవరి 24న టీడీపీ సర్కార్‌ రూ.803.96 కోట్లతో అనుమతి ఇచ్చింది. 
► అంచనాలను పెంచేసి భారీ ఎత్తున దోచుకోవడానికి టీడీపీ సర్కార్‌ పెద్దలు వ్యూహం పన్నారు. ఆ పనులను రూ.592 కోట్లకు (భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కాకుండా) కాంట్రాక్టర్‌కు అప్పగించి, భారీగా దండుకోడానికి ప్లాన్‌ వేశారు. 
► అయితే ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ రాప్తాడులో ఎత్తిచూపారు. అధికారంకి రాగానే కేవలం రూ.1.19 కోట్లతో హంద్రీ–నీవాలో అంతర్భాగమైన మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా కృష్ణా జలాలను అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టుకు తరలించారు. గతేడాది 0.25 టీఎంసీలను తరలించారు.

ఒక రిజర్వాయర్‌ స్థానంలో మూడు రిజర్వాయర్లు 
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పర్‌ పెన్నార్‌ ఎత్తిపోతల పథకం పరిధిని విస్తరించింది.  సోమరవాండ్లపల్లి(1.5 టీఎంసీలు)తో పాటు.. పుట్టకనుమ(0.63 టీఎంసీలు) రిజర్వాయర్‌ స్థానంలో కొత్తగా తోపుదుర్తి (0.95), ముట్టాల (2.02), దేవరకొండ (0.90 టీఎంసీల) రిజర్వాయర్లు నిర్మించనుంది. తద్వారా మొత్తం 3.87 టీఎంసీల నీరు అదనంగా అందుబాటులోకి వస్తుంది.
► ఈ పథకానికి టీడీపీ సర్కార్‌ నిర్ణయించిన అంచనా వ్యయం రూ.803.96 కోట్లనే నిర్ధారించారు. ఈ పనులను గత ప్రభుత్వం అప్పగించిన రూ.592 కోట్లకే చేసేలా అదే కాంట్రాక్టర్‌ ముందుకొచ్చారు. అదనంగా ఒక ప్రాజెక్టు స్థానంలో మూడు ప్రాజెక్టులు రావడం ద్వారా ఖజానాకు రూ.250 కోట్లకుపైగా ఆదా అయ్యాయని అంచనా వేస్తున్నారు.

మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నాం 
అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టుకు టీడీపీ సర్కార్‌ రూ.803.96 కోట్లతో కృష్ణా జలాలను తరలించాలని నిర్ణయిస్తే.. సీఎం వైఎస్‌ జగన్‌.. కేవలం రూ.1.19 కోట్లతోనే ఆ పని చేశారు. పుట్టకనుమ రిజర్వాయర్‌ స్థానంలో కొత్తగా 3.87 టీఎంసీల నిల్వ చేసే సామర్థ్యంతో మూడు రిజర్వాయర్లను నిర్మిస్తాం. ఈ పనులను పాత ధరకే చేయడానికి అదే కాంట్రాక్టర్‌ ముందుకొచ్చారు. దీన్ని బట్టి అప్పర్‌ పెన్నార్‌ ఎత్తిపోతల్లో చంద్రబాబు, పరిటాల సునీత ఏ స్థాయిలో దోపిడీకి స్కెచ్‌ వేశారో విశదం చేసుకోవచ్చు.     
– తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే, రాప్తాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement