నెల్లూరు (అర్బన్): భానుడి భగభగలతో జిల్లా వాసులు మండిపోతున్నారు. మే నెల ప్రారంభం అవడంతో ఎండ తీవ్రత పెరిగింది. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. నాలుగు రోజుల నుంచి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు చూస్తే ఎండలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. మంగళవారం 39.9, బుధవారం 39.5, గురువారం 40.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం కూడా 41 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉంటోంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత రోడ్ల మీదకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎండ దెబ్బకు చిన్న పిల్లలు, వృద్ధులు బెంబేలెత్తిపోతున్నారు.
రాలుతున్న పండుటాకులు
ఎండలు విపరీతంగా ఉండడంతో వడదెబ్బకు వృద్ధులు మరణిస్తున్న సంఘటనలు జిల్లాలో ఎక్కడో ఒక దగ్గర చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పది రోజుల్లో సుమారు ఐదుగురు వృద్ధులు వడదెబ్బకు చనిపోయారు. అయితే వీటిని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.
వడదెబ్బపై క్షేత్ర స్థాయిలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విసృ్తతంగా ప్రచారం చేయాల్సి ఉంది. డీఎంహెచ్‌ఓ బి.భారతీరెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం పెట్టి ఆదేశాలు ఇచ్చినప్పటికీ పీహెచ్‌సీ స్థాయిలో ప్రచారం సరిగ్గా నిర్వహించడంలేదనే విమర్శలున్నాయి. ఎండలు ఎక్కువగా ఉన్నందున వడదెబ్బకు ఎవరూ చనిపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఠారెత్తిస్తున్న ఎండలు
Published Sat, May 2 2015 2:10 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement