సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలో అత్యంత విలువైన స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు అని తేడా లేకుండా అక్రమార్కులు జెండాలు పాతేస్తున్నారు. అందుకు కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తున్నారు. అందులో భాగంగా మొన్న ఇస్కాన్ సిటీ పరిధిలో కార్పొరేషన్‌కు కేటాయించిన స్థలాన్ని ఆక్రయించుకున్న సంఘటన మరువకముందే మాగుంట లేవుట్‌లో అదే తరహా ఆక్రమణకు తెరతీశారు.
అధికారుల కళ్లుగప్పి విక్రయించేందుకు నలుగురు వ్యక్తులు రంగం సిద్ధం చేశారు. ఏకంగా రూ.100 కోట్లకు బేరంపెట్టారు. అయితే స్థానికులు పసిగట్టడంతో గురువారం ఆక్రమణ బాగోతం వెలుగుచూసింది. అప్రమత్తమైన అధికారులు స్థలంలో బోర్డునాటి ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
అధికారుల సమాచారం మేరకు... నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ అత్యంత ఖరీదైన ప్రాంతం. ఇందులో 151 ఎకరాల్లో కొందరు స్థానికులు 1995లో 8 డివిజన్లుగా చేసి లేవుట్లు వేశారు. నిబంధనల ప్రకారం కార్పొరేషన్‌కు 10శాతం చొప్పున 15 ఎకరాలకుపైగా అప్పగించారు. అప్పట్లో కార్పొరేషన్ అధికారులు కంచెవేసి బోర్డు కూడా నాటారు. విలువైన స్థలం పై కన్నుపడిన కొందరు 5.27 ఎకరాల ను ఆక్రమించేందుకు రంగం సిద్ధం చేశారు. కొందరు అధికారుల సహకారంతో లింకు డాక్యుమెంట్లు సృష్టించా రు. అందులో ఎటువంటి ప్లాట్లు వేయకుండానే 18మందికి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. సాజద్, భాను, అంజి ల్, రెహమున్సీ సా, మున్నా, ఆరీఫ్, జమీర్, హమీమున్నీసాతో పాటు మరికొందరు ఉన్నారు. అంకనం రూ.3 లక్షల చొప్పున మొత్తం 3వేల అంకనాలను రూ.100 కోట్లకు టెండర్ వేశారు.
బయటపడిందిలా...
క్రయ విక్రయాలు జరుపుతున్న తరుణంలో మాగుంట లేవుట్‌కు చెందిన కొందరికి విషయం తెలిసింది. ఇంతపెద్ద భూకబ్జా విషయాన్ని వెంటనే కార్పొరేషన్ అధికారులకు చేరవేశారు. స్పందించిన అధికారులు హుటాహుటిన మాగుంట లేవుట్‌కు చేరుకున్నారు. స్థలాన్ని పరిశీలించి బోర్డుపెట్టారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఆక్రమణల బాగోతంపై పూర్తి నివేదిక సమర్పించాలని కమిషనర్ చక్రధర్‌బాబు టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.
చర్యలు తీసుకుంటున్నాం
- కమిషనర్ చక్రధర్‌బాబు
మాగుంట లేవుట్ ప్రాంతంలో కార్పొరేషన్ స్థలం ఉంది. దీన్ని కొందరు ఆక్రమించుకుని విక్రయాలు జరుపుతున్నారని తెలిసింది. మా వారిని పంపి కార్పొరేషన్ స్థలంలో గతంలోనే బోర్డులు నాటించాం. అయినా కొందరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
భారీ ఆక్రమణకు చెక్
Published Fri, Mar 13 2015 2:12 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement