పోలీస్‌ శాఖలో మరో ఫిర్కా | Gudur Sub division device proposals | Sakshi
Sakshi News home page

పోలీస్‌ శాఖలో మరో ఫిర్కా

Published Thu, Sep 7 2017 1:09 PM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM

పోలీస్‌ శాఖలో మరో ఫిర్కా

పోలీస్‌ శాఖలో మరో ఫిర్కా

గూడూరు సబ్‌ డివిజన్‌ విభజనకు ప్రతిపాదనలు
నాయుడుపేట సబ్‌ డివిజన్‌ ఏర్పాటుకు నిర్ణయం
ఎర్ర చందనం, ఇసుక. సిలికా అక్రమ రవాణా నియంత్రణే కీలకం
డీజీపీ నిర్ణయమే తరువాయి


సాక్షి ప్రతినిధి, నెల్లూరు :
జిల్లాలో మరో కొత్త పోలీస్‌ సబ్‌ డివిజన్‌ ఏర్పాటు కానుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద పోలీస్‌ సబ్‌ డివిజన్‌గా ఉన్న గూడూరును రెండుగా విభజించాలని నిర్ణయించారు. ఇం దుకు రెవెన్యూ రికార్డులను ప్రామాణికంగా తీసుకుని ప్రతిపాదనలు పంపించారు. గూ డూరు ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ తోపాటు నేరాల నియంత్రణ కత్తిమీద సాములా మారిన నేపథ్యంలో జిల్లా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనలు డీజీపీ పరిశీలనలో ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 5పోలీస్‌ సబ్‌ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 22 సర్కిల్స్, 64 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. గూడూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో ఆరు సర్కిల్స్, 20 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. అంటే జిల్లాలోని మొత్తం స్టేషన్లలో 30 శాతం ఈ సబ్‌ డివిజన్‌ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని పోలీస్‌ సబ్‌ డివిజన్ల పరిధితో పోలిస్తే ఇది మూడు రెట్లు పెద్దది. రాష్ట్రంలోనే అతిపెద్ద సబ్‌ డివిజన్‌గా, భారీగా అక్రమ ఆదాయం పొందే కేంద్రంగా పేరొందింది.

ఆదాయం అంతా ఇంతా కాదు
జిల్లాలో సాగే అక్రమ వ్యాపారంలో అత్యధిక శాతం గూడూరు సబ్‌ డివిజన్‌ పరిధిలోనే ఉంటుంది. ఎర్ర చందనం మొదలుకొని సిలికా, ఇసుక అక్రమ రవాణా అంతా ఇక్కడే నడుస్తుంది. అత్యధిక మామూళ్లు వచ్చే సబ్‌ డివిజన్‌ కావటంతో ఇక్కడి డీఎస్పీ పోస్టుకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఇక్కడ పనిచేస్తూ గత నెలలో వీఆర్‌కు బదిలీ అయిన డీఎస్పీ బి.శ్రీనివాస్‌పై పెద్దెత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ నెలకు రూ.50 లక్షలపైనే మామూళ్లు, ఇతర ఆదాయం ఉంటుందని అంచనా. తమిళనాడు నుంచి అక్రమంగా వచ్చే బియ్యం, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల అక్రమ రవాణా దారుల నుంచి భారీగా మామూళ్లు అందుతాయి. ఇసుక రవాణా ఆదాయం రూ.లక్షల్లో ఉంటుంది.

వెంకటగిరి స్టేషన్‌ పరిధిలో ఎర్ర చందనం కేసులు ఎక్కువ. గతంలో కొందరు పోలీస్‌లే ఎర్ర చందనం అక్రమ రవాణా వాహనాలకు పైలట్‌గా వ్యవహరించేవారు. దీనికి గాను రూ.లక్షల్లో ముడుపులు అందేవి. సిలికా ఇసుక అక్రమ రవాణా కూడా ఇక్కడే అధికంగా ఉంటుంది. ఇవి కాకుండా గూడూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో 250కి పైగా మద్యం షాపులు, 10 వరకు బార్లు ఉన్నాయి. వీటి నుంచి రూ.12 లక్షల వరకు అందుతాయి. ఇదిలావుంటే.. జాతీయ రహదారి పరిధి అత్యధికంగా దీని పరిధిలోనే ఉండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గతంలో ఇక్కడి డీఎస్పీ పోస్టుకు డిమాండ్‌ ఉండేది.

గత నెలలోనే ప్రతిపాదనలు
గూడూరు సబ్‌ డివిజన్‌ను గూడూరు, నాయుడుపేట సబ్‌ డివిజన్లుగా విభజించాలని ప్రతిపాదించారు. నాయుడుపేట, సూళ్లూరుపేట సర్కిల్స్‌ పరిధిలోని ఆరు పోలీస్‌ స్టేషన్లతోపాటు ఓజిలి స్టేషన్‌ను కలిపి 7 స్టేషన్లు, రెండు సర్కిల్స్‌తో నాయుడుపేట సబ్‌ డివిజన్‌ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి గతంలోనూ ప్రతిపాదనలు వెళ్లగా.. పురోగతి లేకపోవటంతో తాజాగా మరోసారి ప్రతిపాదనలు పంపారు. ఇక్కడి పరిస్థితిని డీజీపీకి వివరించిన ఉన్నతాధికారులు సబ్‌ డివిజన్‌ను విభజించాలని కోరారు. సాంకేతికపరమైన లాంఛనాలను పూర్తి చేసుకుని నెల రోజుల్లో కొత్త సబ్‌ డివిజన్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement