సాక్షి, అనంతపురం : రాజకీయ ముసుగులో కొందరు పోలీసులు 15 ఏళ్లుగా ఒకే సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ తెరవెనుక దుప్పటి పంచాయితీలు చేస్తుండటంతో నిజాయతీగా పని చేస్తున్న అధికారులకు సహకారం కొరవడుతోంది. చాలా కేసుల్లో ఎప్పటికప్పుడు నిందితులకు సమాచారం అందిస్తుండటంతో బాధితులకు సత్వర న్యాయం జరగడం లేదు.
ముక్కు సూటిగా వ్యవహరించే అధికారులను అక్రమార్కులు ఇక్కట్లలోకి నెట్టడానికి ప్రయత్నిస్తూ వారి జోరుకు ముకుతాడు వేస్తున్నారు. అనంతపురం నగరంలో ఉన్న పలువురు రౌడీ షీటర్లతో కొందరు పోలీసులకు ఉన్న పరిచయాలు బహిరంగ రహస్యం. కొందరు కానిస్టేబుళ్లు వారితో చేయి కలిపి వడ్డీ వ్యాపారం చేయిస్తున్నారు. రౌడీ షీటర్లను అడ్డుపెట్టుకొని రూ. 10 నుంచి రూ.15 వరకు పేదల నుంచి ముక్కు పిండి వడ్డీ వసూలు చేస్తున్నారు. ఇందుకు కారణం వారు ఏళ్లతరబడి ఒకే సబ్ డివిజన్ పరిధిలో పాతుకుపోయి ఖద్దరు నేతలకు గులాంగిరీ చేయడమే. మరికొందరు కొన్ని సంఘాలను అడ్డుపెట్టుకొని తమ దందాను కొనసాగిస్తున్నారు. నగరంలోని మున్నానగర్, రాణి నగర్, అంబారపు వీధి, నాయక్ నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, డ్రైవర్స్ కాలనీ, కళ్యాణదుర్గం రోడ్డు, నడిమివంక సమీపంలో వున్న 4, 5వ రోడ్డులలోను, నగర శివారు కాలనీల్లో నివాసం వుంటున్న కొందరు రౌడీ షీటర్లు బహిరంగంగా దందాలకు పాల్పడుతున్నా పోలీసులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో వీరు మరింత స్పీడు పెంచి తమ తమ ప్రాంతాల్లో బలం నిరూపించుకునేందుకు లోలోపల యత్నాలు చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో అధికార పార్టీ నేతలకు రౌడీ షీటర్ల మద్దతు అవసరం వుండటం వల్ల వారిపై ఈగ వాలకుండా చూసుకునే బాధ్యతను సైతం వారు భుజానికెత్తుకొనే పరిస్థితి నెలకొంది. జిల్లాకు కొత్త పోలీస్ బాస్ వచ్చినప్పుడు కొందరు పోలీసులు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. రౌడీ షీటర్లు పెట్టే బాధలను తట్టుకోలేక కొందరు బాధితులు ఫిర్యాదు చేయడానికి ధైర్యంతో ముందుకు వస్తుండగా, మరికొందరు వారు చేసే అరాచకాలకు భయపడి ఫిర్యాదులు చేయడం లేదు. ఇంకొందరైతే ఏకంగా ఊరు విడిచి వెళ్లారు. కొన్ని ప్రాంతాల్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పెద్దగా స్పందించడం లేదని బాధితులు బహిరంగంగా చెబుతున్నారు.
నగరంలోని రాజమ్మ నగర్‌కు చెందిన చిన్న రవి, షహనాజ్ దంపతులు అవసర నిమిత్తం రౌడీ షీటర్ ఆనంద్ నుంచి రూ. 1.50 లక్షలు అప్పు తీసుకోగా వారి నుంచి ఇప్పటికే వడ్డీ రూపంలో రూ. 5 లక్షలు వసూలు చేసినా రౌడీ షీటర్ ఆనంద్ తృప్తి చెందలేదు. న్యాయం కోసం బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సమయంలోనే రౌడీ షీటర్ ఆనంద్ ఫోన్ చేసి బెదిరించడాన్ని ప్రత్యక్షంగా చూసిన సీఐ రంగంలోకి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఇలా ఎంత మంది?
బలవంతపు వసూళ్లు, ప్రైవేట్ పంచాయితీలు, బెదిరింపులకు పాల్పడుతున్న అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోవడానికి ఒకరిద్దరు పోలీసు అధికారులు ముందుకు వస్తున్నా, వారికి ఇదే శాఖలోని కొంత మంది తెరవెనుక నుంచి అడ్డంకులు సృష్టిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల గుంతకల్లులో డీఎస్పీ సుప్రజ (ప్రస్తుతం బదిలీ అయ్యారు) సంఘటనను గుర్తుకు తెస్తూ వెనకడుగువేసేలా చేస్తున్నారని తెలుస్తోంది. గుంతకల్లులో తన సొంత మామనే హత్య చేయించిన అల్లుడు చంద్రశేఖర్, అతడికి సహకరించిన వారికి అప్పట్లో డీఎస్పీ సుప్రజ బహిరంగంగా కౌన్సెలింగ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో డీజీపీ ఆమెపై బదిలీ వేటు వేశారు. దీని వెనుక కొందరు పోలీసు అధికారులే చక్రం తిప్పినట్లు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. దీంతో కొందరు పోలీసు అధికారులు అప్పటి నుంచి కొంత స్పీడును తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. అయితే బాధితులకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే చట్ట పరిధిలోనే చేయవచ్చని కొందరు నిరూపిస్తున్నారు.
గతంలో అంజనాసిన్హా ఎస్పీగా పని చేసిన సమయంలో విచ్చలవిడిగా వడ్డీలు వసూలు చేస్తున్న వారిని పిలిపించి గట్టిగా హెచ్చరికలు జారీ చేసిన విషయాన్ని నగర ప్రజలు ప్రస్తుతం గుర్తు చే సుకుంటున్నారు. అసలుకు రెండు.. మూడింతలు వడ్డీ వసూలు చేసిన వారి నుంచి అప్పట్లో ఆమె బాధితులకు బాండ్లు వెనక్కు ఇప్పించారు. ఈ నేపథ్యం లో ‘అనంత’ పోలీసులు తమ దూకుడును పెంచకపోతే అరాచక శక్తులు చాపకింద నీరులా తమ కార్యకలాపాలు ముమ్మరం చేసే పరిస్థితులు కన్పిస్తున్నాయి.
ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించాలి
ప్రస్తుత ఎస్పీ సెంథిల్ కుమార్ ‘ప్రజల చెంతకు పోలీస్’ పేరుతో ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చే యడాన్ని జిల్లా ప్రజలు హర్షిస్తున్నారు. అయితే వారంలో ఒక పోలీస్‌స్టేషన్‌కు మాత్రమే దానిని పరిమితం చేయడంపై కొందరు పోలీసు అధికారులు చంకలు గుద్దుకుంటున్నట్లు సమాచారం. దీంతో పాటు వారంలో ఒక రోజు జిల్లా కేంద్రంలో కూడా నిర్వహిస్తే ఎక్కువ మంది బాధితులకు న్యాయం చేకూర్చవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతకంటే ముందు ఇంటి దొంగల పని పడితే లక్ష్యం నెరవేరుతుందనే విషయంపై ఎస్పీ దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ముసుగు తీసేదెవరు?
Published Fri, Jan 24 2014 2:42 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement