గీత దాటుతున్న పోలీస్! | Crossing a police line! | Sakshi
Sakshi News home page

గీత దాటుతున్న పోలీస్!

Published Sat, Dec 27 2014 3:26 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

Crossing a police line!

సాక్షిప్రతినిధి, అనంతపురం : శాంతి భద్రతలు పరిరక్షించడంలో చిత్తశుద్ధి ప్రదర్శించాల్సిన పోలీసు అధికారులు పలువురు అధికార పార్టీ పెత్తనానికి, కరెన్సీ నోట్లకు ‘రాజీ’ పడుతున్నారు. ఈ క్రమంలో అనామకులపై లాఠీ ఝూళిపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ‘లాఠిన్యం’ మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. ఎవరైనా తమపై దాడి చేస్తే న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన బాధితులు నేరుగా ‘ఎస్పీ’వద్దకు పరుగు తీస్తున్నారంటే వ్యవస్థ ఎలా నడుస్తుందో ఇట్టే తెలుస్తోంది. దీన్ని నివారించాల్సిన ‘మిడిల్‌బాస్’లు సెటిల్‌మెంట్ల వ్యవహారంలో బిజీగా ఉన్నారు. పైకి నిజాయితీగా వ్యవహరిస్తున్నట్లు కనిపించినా, లోలోపల వారికి ఉపయుక్తమైన దారిలో వెళుతున్నారు. అయితే అధికార పార్టీ నేతలు, మద్ధతుదారుల జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఎందుకంటే వారితో పెట్టుకుంటే తమపై ‘బదిలీవేటు’ పడుతుందని కొంత మంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితి ఏంటో ఇట్టే తెలుస్తోంది.
 
 సిబ్బందిపై ఎస్పీ పట్టుసాధించలేకపోతున్నారా?
 హిందూపురం నుంచి గుంతకల్లు, రాయదుర్గం నుంచి తాడిపత్రి దాకా ప్రతీ పోలీసుస్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేస్తున్నారు. విధి నిర్వహణపై పోలీసులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయినప్పటికీ సిబ్బంది మాత్రం కచ్చితమైన దారిలో నడవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. చాలా మంది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అనంతపురంలో తనకు న్యాయం చేయండని పోలీసులను ఆశ్రయించిన ఓ మహిళ పట్ల ఓ ఎస్‌ఐ అనుచితంగా ప్రవర్తించారని బాధితురాలు ‘సాక్షి’తో వాపోరుుంది.
 
 నగరంలోనే పోలీసుల పరిస్థితి ఇలా ఉందంటే, సిబ్బంది ఏ మేరకు ‘అటెన్షన్’లో ఉన్నారో? పోలీసు పెద్దలకు ఏ మాత్రం పట్టుందో ఇట్టే తెలుస్తోంది. ఎస్పీ అమలు చేసిన ‘ఒక దొంగ-ఒక పోలీసు’పై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,500 మంది దొంగలను పోలీసులు గుర్తిస్తే, అందులో 1861 మంది ఒకే దొంగతనం చేసిన వారున్నారు. 2-5 దొంగతనాలు చేసిన వారు 514 మంది ఉన్నారు. ఐదుకుపైన చోరీలు చేసిన వారు కేవలం 152 మాత్రమే ఉన్నారు. అంటే ఒక దొంగతనం చేసిన వారే అధికంగా ఉన్నారు.
 
  ఈ లెక్కన కొత్త ముఖాలు దొంగతనాలకు ఎక్కువ పాల్పడుతున్నట్లు లెక్క. ఈ క్రమంలో కొత్తగా చోరీలకు మరుగుతున్న వారిపై ఎక్కువ దృష్టి సారించకుండా, పాత దొంగలపై మాత్రమే ఎక్కువ ఫోకస్ చేయడం సరికాదని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా ఇందులో మహిళా పోలీసులను కూడా చేర్చారు. ఇది వీరికి పూర్తి ఇబ్బందిగా ఉంది. మహిళా పోలీసులకు మగ దొంగల బాధ్యతలను కేటాయించడం తలనొప్పిగా మారిందని వారు వాపోతున్నారు.
 
 ..ఇలాంటివి ఎన్నో
 ఇటీవల కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కోడిపల్లి సమీపంలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న క్వారీలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే తనయుడు సంఘటనా స్థలిలో ఉన్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులు వెళ్లిన వెంటనే అతను అక్కడి నుండి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తనయుడు ఈ క్వారీని నడుపుతున్నారని విజి‘లెన్స్’ తేల్చి, కేసును అక్కడి సివిల్ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. అయితే ఈ కేసులో ఆ నేతకు ఏ సంబంధం లేనట్లు పోలీసులు కథను ముగించేపనిలో ఉన్నట్లు సమాచారం.
 వేదవది నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కర్ణాటకకు ఇసుకను తరలించే దందాను ఎమ్మెల్యే తనయుడు చేపట్టాడనేది బహిరంగ రహస్యం. ఈ క్రమంలో ఇటీవల టిప్పర్లు పట్టుబడ్డాయి. అయితే పోలీసులు వీటిని వదిలేసి, ఈ కేసులో ఆ నేతను తప్పించి ‘సుభాన్’ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఆరోపణలున్నారుు.
 
 దర్మవరం, పెనుకొండ సమీపంలో కూడా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులకు రోజూ 8-10 లక్షల రూపాయల ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది తెలిసీ పోలీసులు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం లేదు. పైగా ప్రజాప్రతినిధుల అండతో వీరూ ‘మామూళ్లు’ నిర్దేశించినట్లు సమాచారం.
 తాడిపత్రి పరిధిలో ఓ అధికార పార్టీ నేత కనుసన్నల్లో ఇసుకదందా యథేచ్ఛగా సాగుతోంది. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడి ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్ కు పంపినా పరిస్థితిలో మార్పు రాలేదు.
 
 సివిల్ పంచాయతీల కోసం జిల్లా కేంద్రం లో ఏర్పాటు చేసిన ముగ్గురు డీఎస్పీల బృందంలో ఓ డీఎస్పీ ఇటీవల ఓ ల్యాండ్ విషయంలో పంచాయతీ చేసి భారీగా ముడపులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
 ఇటీవల రాయదుర్గం టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో మట్కా బీటర్లను పలుసార్లు పోలీసులు అరెస్టు చేశారు. సెల్‌ఫోన్‌లలో మట్కా నెంబర్లను చూసిన పోలీసులు కేసులు నమోదు చేయకుండా డబ్బులు దండుకుని వదిలి పెట్టారని తెలిసింది.
 
 కదిరిలో ఓ పోలీసు అధికారి మట్కా నిర్వహణకు అండగా ఉన్నట్లు ఆరోపణలు ఉ న్నాయి. దీంతో బీటర్లు ఆ అధికారిని తృప్తి పరిస్తూ...యథేచ్ఛగా మట్కా నిర్వహిస్తున్నారు.
 కంబదూరు మండలం పీ చెర్లోపల్లిలో ఇటీవల దళితులపై టీడీపీ నేతలు దాడి చేశారు. దీనిపై కేసు నమోదైనా నిందితులను అరెస్టు చేయలేదు. పైగా దళితులపైనే మరో కేసు బనాయించారు.
 
 గత నెలలో నకిలీ డాక్టర్ చికిత్సతో ఓ గర్భిణి మృతి చెందింది. దీనిపై కూడా కేసు నమోదైంది. బెయిల్ వచ్చే వరకు డాక్టర్‌ను అరెస్టు చేయలేదు. దీనికి కారణం అధికార  పార్టీ ఒత్తిడితో పాటు ముడుపులు ముట్టడమే అనే ఆరోపణలు ఉన్నాయి.   
 
 తాళం వేసి ఊరికెళ్లి రావాలంటే మధ్యతరగతి వర్గీయుల గుండెల్లో గుబులు మొదలవుతోంది.. చైన్ స్నాచర్ల దెబ్బకు జడిసి మహిళలు బయటకు రావడానికి జంకుతున్నారు.. పోకిరీల బెడదతో విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ వెళుతున్నారు.. ఎర్రచందనం అక్రమ రవాణాకు జిల్లా రహదారులు రాచబాటగా మారారుు.. సామాన్యులు చిన్న గూడు కట్టుకోవడానికి సైతం మిగలకుండా ఇసుకాసురులు నదులను కొల్లగొడుతున్నారు.. జిల్లాలో పరిస్థితి ఇలాగుంటే పోలీసు బాస్ మాత్రం ‘అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం మోపుతాం’ అని పదేపదే చెబుతున్నా, ఆచరణలో ఆశించిన ప్రయోజనం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement