ఈసారీ ‘బుట్టపాలే!’ రచ్చబండారం | third third phase rachabanda programme on Kakinada | Sakshi
Sakshi News home page

ఈసారీ ‘బుట్టపాలే!’ రచ్చబండారం

Published Sun, Dec 1 2013 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM

third third phase rachabanda programme on Kakinada

 సాక్షి, కాకినాడ :తెలుగువారి మధ్య విభజన చిచ్చు పెట్టిన కాంగ్రెస్ సర్కార్ ప్రజల్లో రగిలిన ఆగ్రహజ్వాల లను చల్లార్చే ఉపాయంగా మూడవ విడత రచ్చబండ ను నిర్వహించింది. మొదటి విడత రచ్చబండ 2011లో జనవరి 23 నుంచి 10 వరకు జరిగింది. రెండో విడత కూడా అదే ఏడాది నవంబర్ 2 నుంచి 30 వరకు జరిగింది. షెడ్యూ ల్ ప్రకారం ఈ నెల 11 నుంచి 26 వరకు నిర్వహించ తలపెట్టిన రచ్చబండ-3 సభలు హెలెన్, లెహర్ తుపాన్ల వల్ల 30వ తేదీ వరకు సాగాయి. జిల్లాలో ఇప్పటివరకు 63 సభలు నిర్వహించా రు. మొదటి రెండు రచ్చబండల్లో రేషన్‌కార్డులు,
 
 పింఛన్లు, గృహరుణాలు, ఇంటి స్థలాలు, వ్యక్తిగత రుణాలు తదితర సుమారు 20కి పైగా సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తినప్పటికీ  ప్రభుత్వం కేవలం రేషన్ కార్డులు, పింఛన్లు, గృహరుణాలకు వచ్చిన దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకుంది. గత రెండు రచ్చబండల్లో రేషన్‌కార్డులకు 1,26, 754 దరఖాస్తులు రాగా, 1,11,664 అర్హత పొందాయి. కానీ ఇందులో సుమా రు 85,906 మంది మాత్రమే కార్డులకు అర్హులుగా నిర్ధారించారు. వారిలోనూ తిరిగి సుమారు 26 వేల మందికి మొండి చేయి చూపారు. 85,906 మందిలోనూ ఇప్పటి వరకు 5 వేల మందికి పైగా మా త్రమే కార్డులిచ్చి మిగిలిన వారికి 66,474 కూపన్లు పంపిణీ చేశారు.  10,065 మం దికి ఇప్పటికే కార్డులున్నాయని పేర్లను తొలగించారు. మూడవ విడత రచ్చబండలో రేషన్‌కార్డుల కోసం ఇప్పటి వరకు 28,817 దరఖాస్తులు వచ్చాయి.  
 
 పింఛన్లదీ అదే దారి..
 మొదటి రెండు విడతల్లో పింఛన్ల కోసం లక్ష పైగా దరఖాస్తులు రాగా కేవలం 53, 843మంది మాత్రమే అర్హులని తేల్చారు. లక్షన్నర మందికి పైగా గృహ రుణాల కోసం దరఖాస్తు చేస్తే లక్ష 5 వేల మందికి మంజూరు ఉత్తర్వులిచ్చారు. పింఛన్లకు 53, 843 మందిని అర్హులుగా నిర్ధారించినప్పటికీ 42,027 మందికి మాత్రమే మంజూరు ఉత్తర్వులందజేశారు. అలాగే వికలాంగ పింఛన్లకు 5722 మందిని అర్హులుగా నిర్ధారించగా, 5021 మందికి మాత్రమే పంపిణీ చేశారు.  కాగా మూడవ విడత పింఛన్లకు మరో 22,422 దరఖాస్తులు వచ్చాయి. శనివారం కాకినాడ రచ్చబండలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 40 వేలు దాటొచ్చు. అంటే గత రెండు రచ్చబండల్లో అర్హులైన వారితో కలిపితే సుమారు 50 వేల మంది పింఛన్ల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది.
 
 
 మూడోవంతు మందికి నిరీక్షణే
 గృహరుణాలకు సంబంధించి లక్షా 5 వేల మందికి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన అధికారులు ఇప్పటి వరకు 51,933 మందికి మంజూరు ఉత్తర్వులందజేశారు. కాగా మూడవ విడత రచ్చబండలో ఇప్పటి వరకు  గృహరుణాల కోసం 17,785 దరఖాస్తులొచ్చాయి. బంగారుతల్లి పథకానికి సంబంధించి 3406మందిని అర్హులుగా గుర్తించినా ఇప్పటి వరకు 2626 మందికి సర్టిఫికెట్లు అందజేసినట్టు చెప్పుకొచ్చారు.   రేషన్‌కూపన్లు, పింఛన్లు, గృహరుణాల మంజూరు ఉత్తర్వుల పంపిణీకి తప్ప ఈ రచ్చబండలో వచ్చిన దరఖాస్తుల్లో ఏ ఒక్కదాన్నీ పరిష్కరించిన దాఖలాలు లేవు. గత రెండు రచ్చబండల్లో వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన వారిలో మూడవ వంతు మందికి ఎదురుచూపు తప్పడం లేదు. వారికి మూడవ విడత అర్జీదారులు తోడవుతున్నారు. లక్షలాదిగా పేరుకుపోయిన ఈ దరఖాస్తులను పరిష్కరించాలంటే కోట్లాది రూపాయలు అవసరమవుతాయి. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చేలోగానే నిధులు సమకూర్చే పరిస్థితిలో రాష్ర్ట ప్రభుత్వం లేదని అధికారులే అంటున్నారు. అంటే  ఈ రచ్చబండ దరఖాస్తులు కూడా గతంలో మాదిరిగానే బుట్టదాఖలయ్యే అవకాశాలే ఎక్కువన్న మాట. ప్రభుత్వం రచ్చబండకు సంబంధించి ప్రచారం పట్ల చూపుతున్న ఆరాటంలో వందో వంతు చిత్తశుద్ధి కూడా దాని అమలులో చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement