రచ్చ..బండ | rachabanda programme Fuss fuss | Sakshi
Sakshi News home page

రచ్చ..బండ

Published Sun, Nov 17 2013 3:56 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

rachabanda programme Fuss fuss

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అనుకున్నదొక్కటి... అయిందొక్కటి.. అన్న చందంగా తయారైంది రచ్చబండ పరిస్థితి. ప్రజలకు తాము ఎంతో చేశామని, చేస్తున్నామని ప్రచారం చేసుకునేందుకు తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం కాస్త రచ్చ రచ్చ అవుతోంది. ప్రభుత్వానికి ఉన్న కాస్త పరువును గంగలో కలిపేస్తోంది. సంక్షేమ పథకాల పంపిణీ వేది కగా రచ్చబండను మార్చేసిన పాలకులకు అదే ఎదురు తన్నింది. కొత్తగా మంజూరు చేస్తున్నవేవీ లేకపోవడంతో అర్జీదారులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల జాబితాలు తీసుకొచ్చి రచ్చబండలో పంపిణీ చేసినట్లు పాలకులు గొప్పలు చెప్పుకొంటున్నారు. వాస్తవానికి ఇవి సాధారణంగా ఎప్పటికప్పుడు జరగాల్సిన కార్యక్రమాలే. ఇదే విషయాన్ని లబ్ధిదారులు, అర్జీదారులు ఎత్తిచూపుతున్నారు. 
 
 దీని వల్ల రచ్చబండకు రావడం వల్ల కొత్తగా ఒనగూడే ప్రయోజనం ఏమీ కనిపించడంలేదని అంటున్నారు. దాంతో కొత్తగా తామేదో చేశామని చెప్పుకునేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలోని ఐదు మండలాల్లో రచ్చబండ కార్యక్రమం జరిగింది. రాజాం నియోజవకర్గంలోని సంతకవిటి, వంగర, రాజాం, రేగిడి మండలాల్లో ఈనెల 13, 14 తేదీల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు హాజరైన మంత్రి కోండ్రు మురళీ మోహన్‌కు సమైక్య సెగ తగిలింది. మంత్రిస్థాయిలో ఆయన కూడా  కొత్తగా హామీలు ఇవ్వకపోగా సొంత ప్రచారానికే  ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజలు అడిగిన పనులు చేయాల్సింది పోయి సొంత డబ్బా కొట్టుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నించారు. దివంగత వైఎస్‌ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలనైనా సక్రమంగా అమలు చేయడం ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదని విమర్శిస్తున్నారు. 
 
 జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆయన దారిలోనే పయనిస్తున్నారు. శనివారం వీరఘట్టం, ఆమదాలవలసల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమాలకు ఎంతో ఆశతో వచ్చిన అర్జీదారులు అక్కడి ఏర్పాట్లు, అధికారుల తీరుతో అసహనానికి గురయ్యారు. తొక్కిసలాట, గందరగోళం తప్ప రచ్చబండ వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం విషయంలో మాయమాటలు చెప్పిన ఎమ్మెల్యేలు, మంత్రులు.. రచ్చబండలోనూ అదే వైఖరి అవలంభిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదే విషయాన్ని వారికి నేరుగా చెబుదామనుకుంటే వేదిక వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వారు చెప్పింది వినడం తప్ప.. ప్రజలు చెప్పేవి నాయకులు వినే పరిస్థితులు లేవని అంటున్నారు. ఇన్ని కష్టాలు పడి, తొక్కిసలాడుకుని అర్జీలు ఇచ్చేకంటే ప్రతి వారం జరిగే గ్రీవెన్స్‌సెల్‌కు వెళ్లి కలెక్టర్‌కు ఇస్తే సరిపోతుంది కదా.. అని వ్యాఖ్యానిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement