
ప్రభుత్వ పాలనలో టీ-మంత్రుల ప్రమేయం లేదు: డి.శ్రీనివాస్
నిజామాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వ పాలనలో తెలంగాణ మంత్రుల ప్రమేయం ఏమీలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని, అందులో తెలంగాణ ప్రజాప్రతినిధుల పాత్ర చక్కగా ఉంటుందన్నారు. ఎన్నో సంవత్సరాల ఉద్యమం, ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడనున్న తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నాయకులతోపాటు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి యత్నిస్తున్నారని చెప్పారు. అయినా వారి యత్నాలు ఫలించవన్నారు.
కొన్ని పార్టీలు తెలంగాణపై ఊహించిన దానికంటే ఎక్కువే మాట్లాడుతున్నాయని చెప్పారు. భద్రాచలం తెలంగాణ నుంచి విడిపోయే ప్రసక్తే లేదన్నారు. సీమాంధ్రులు కొత్త రాజధాని నిర్మించుకోవడానికి కావాల్సిన నిధుల కేటాయింపు వారిని సంతృప్తి పరిచే విధంగా ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా, డీఎస్ ప్రసంగాన్ని తెలంగాణవాదులుఅడ్డుకున్నారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ సీఎం ఫొటోను తొలగించాలని డిమాండ్ చేశారు. దాంతో డీఎస్ స్పందించి తాను ఇక్కడికి రాకముందే ఈ పనిని మీరే చేయాల్సి ఉండేదన్నారు. అంతలో ఓ తెలంగాణవాది సీఎం ఫొటోపై పేడను కొట్టారు. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.