State government rule
-
ఐదో ఆటకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: సినిమా థియేటర్లలో ఐదోఆటను ప్రదర్శించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పారదర్శకత కోసం త్వరలో ఆన్లైన్లో టికెట్ల విక్రయ విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ ఎగ్జిబిటర్ల సమస్యలపై మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రైవేటు వెబ్సైట్లు ఒక్కో టికెట్ విక్రయానికి రూ.20 నుంచి రూ.40 వరకు సర్వీసుచార్జి వసూలు చేస్తుండగా, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించే ఆన్లైన్ టికెట్ల విక్రయానికి కేవలం రూ.6 మాత్రమే సర్వీసుచార్జి ఉంటుందని పేర్కొన్నారు. సినీ థియేటర్లు మూసేసిన లాక్డౌన్ కాలానికి సంబం ధించిన విద్యుత్‌చార్జీలు, ఆస్తిపన్ను రద్దు వంటి పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేసేందుకు అనుమతించాలని ఎగ్జిబిటర్లు విజ్ఞప్తి చేయగా, ఇప్పటికే అనుమతిచ్చామన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించుకోవడానికి కూడా అనుమతించినట్లు తెలిపారు. సినీ పరిశ్రమలోని వివిధ విభాగాల(24 క్రాఫ్ట్స్) కార్మికులకోసం చట్టాలను కఠినంగా అమలు చేస్తోందన్నా రు. సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్, సెక్రెటరీ దామోదర్ ప్రసాద్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మురళీమోహన్, సెక్రెటరీ సునీల్ నారంగ్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్, సెక్రెటరీ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. -
జరిమానాలపై జనం బెంబేలు
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి కొత్తగా అమల్లోకి తీసుకువచ్చిన మోటార్ వాహనాల (సవరణ) చట్టం ప్రకారం పడుతున్న భారీ జరిమానాలు ఇవి. చిన్న చిన్న ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకే వేలు దాటి లక్షల్లో పెనాల్టీ పడుతుంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ చట్టంతో సామాన్యులపై మోయలేని భారం పడుతోందని సగానికి పైగా రాష్ట్రాలు అమల్లోకి తీసుకురావడానికి నిరాకరించాయి. చివరికి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కొత్త చట్ట ప్రకారం జరిమానాలు విధిస్తే జనంలో చెడ్డ పేరు వస్తోందని గగ్గోలు పెడుతున్నాయి. కేంద్రం చేసిన చట్టాన్ని తాము కూడా అమలు చేయలేమంటూ చేతులెత్తేశాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొదట గుజరాత్ ఈ స్థాయిలో జరిమానాలు విధించలేమని తేల్చి చెప్పేస్తే, ఇప్పుడు అదే బాటలో మహారాష్ట్ర, కర్ణాటక కూడా నడుస్తున్నాయి. ప్రపంచంలోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ ముందు వరసలో ఉందని, ప్రమాదాలు నివారించి, ప్రజల ప్రాణాలు కాపాడడానికే ఈ జరిమానాలు తీసుకువచ్చామని కేంద్ర రోడ్లు, రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమర్థించుకున్నా, సమాజంలో వివిధ వర్గాలతో సుదీర్ఘ చర్చల అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పినా ఆయనకు నిరసన సెగలు తగులుతున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు గడ్కరీ ఇంటి ముందు ధర్నాలకు దిగారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ జరిమానాలపై తీవ్రంగా కామెంట్లు పెడుతున్నారు. జోకులు, మెమెలతో నెటిజన్లు హడావుడి చేస్తున్నారు. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్థాయిలో జరిమానాలు విధించడం ఇష్టం లేక చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు జరిమానాలు తగ్గించడానికి కసరత్తు చేస్తున్నాయి. గుజరాత్ బాటలో..! బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ ఈ పెనాల్టీలపై తొలిసారి నోరు మెదిపింది. ఈ స్థాయి లో జరిమానాలు సరైన పద్ధతి కాదంటూ సగానికి సగం జరిమానాలను తగ్గించింది. దాదాపుగా 90 శాతం కేసుల్లో జరిమానాల్లో మార్పులు చేసింది. హెల్మెట్ లేకపోతే రూ.500, లైసెన్స్ లేకపోతే రూ2000... ఇలా చాలా కేసులకు సంబంధించి జరిమానాలను సగానికి సగం తగ్గించింది. ఇక గుజరాత్ బాటలోనే ఉత్తరాఖండ్ కూడా నడిచింది. ఎన్నికలున్నాయనే... కొత్త చట్టం కింద పన్నులు విధించడానికి కొన్ని రాష్ట్రాలు వెనక్కి తగ్గడానికి, ఎన్నికలకు సంబంధం ఉందనే విశ్లేషణ లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్, మహారాష్ట్ర, హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే మహారాష్ట్ర, జార్ఖండ్‌లు ఈ కొత్త చట్టాన్ని అమలు చేయలేమని చెప్పేశాయి. అయితే తాము తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల కోసం కాదని, ప్రజల కోసమేనని మహారాష్ట్ర అంటోంది. భారీస్థాయిలో జరిమానాలు విధించలేమని తేల్చేసిన రాష్ట్రాలు: పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర జరిమానాలు తగ్గించడానికి కసరత్తు చేస్తున్న రాష్ట్రాలు: పంజాబ్, గోవా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఉత్తరాఖండ్ -
ప్రభుత్వ పాలనలో టీ-మంత్రుల ప్రమేయం లేదు: డి.శ్రీనివాస్
నిజామాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వ పాలనలో తెలంగాణ మంత్రుల ప్రమేయం ఏమీలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని, అందులో తెలంగాణ ప్రజాప్రతినిధుల పాత్ర చక్కగా ఉంటుందన్నారు. ఎన్నో సంవత్సరాల ఉద్యమం, ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడనున్న తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నాయకులతోపాటు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి యత్నిస్తున్నారని చెప్పారు. అయినా వారి యత్నాలు ఫలించవన్నారు. కొన్ని పార్టీలు తెలంగాణపై ఊహించిన దానికంటే ఎక్కువే మాట్లాడుతున్నాయని చెప్పారు. భద్రాచలం తెలంగాణ నుంచి విడిపోయే ప్రసక్తే లేదన్నారు. సీమాంధ్రులు కొత్త రాజధాని నిర్మించుకోవడానికి కావాల్సిన నిధుల కేటాయింపు వారిని సంతృప్తి పరిచే విధంగా ఉంటుందన్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా, డీఎస్ ప్రసంగాన్ని తెలంగాణవాదులుఅడ్డుకున్నారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ సీఎం ఫొటోను తొలగించాలని డిమాండ్ చేశారు. దాంతో డీఎస్ స్పందించి తాను ఇక్కడికి రాకముందే ఈ పనిని మీరే చేయాల్సి ఉండేదన్నారు. అంతలో ఓ తెలంగాణవాది సీఎం ఫొటోపై పేడను కొట్టారు. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.