కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి కొత్తగా అమల్లోకి తీసుకువచ్చిన మోటార్ వాహనాల (సవరణ) చట్టం ప్రకారం పడుతున్న భారీ జరిమానాలు ఇవి. చిన్న చిన్న ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకే వేలు దాటి లక్షల్లో పెనాల్టీ పడుతుంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ చట్టంతో సామాన్యులపై మోయలేని భారం పడుతోందని సగానికి పైగా రాష్ట్రాలు అమల్లోకి తీసుకురావడానికి నిరాకరించాయి. చివరికి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కొత్త చట్ట ప్రకారం జరిమానాలు విధిస్తే జనంలో చెడ్డ పేరు వస్తోందని గగ్గోలు పెడుతున్నాయి. కేంద్రం చేసిన చట్టాన్ని తాము కూడా అమలు చేయలేమంటూ చేతులెత్తేశాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొదట గుజరాత్ ఈ స్థాయిలో జరిమానాలు విధించలేమని తేల్చి చెప్పేస్తే, ఇప్పుడు అదే బాటలో మహారాష్ట్ర, కర్ణాటక కూడా నడుస్తున్నాయి.
ప్రపంచంలోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ ముందు వరసలో ఉందని, ప్రమాదాలు నివారించి, ప్రజల ప్రాణాలు కాపాడడానికే ఈ జరిమానాలు తీసుకువచ్చామని కేంద్ర రోడ్లు, రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమర్థించుకున్నా, సమాజంలో వివిధ వర్గాలతో సుదీర్ఘ చర్చల అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పినా ఆయనకు నిరసన సెగలు తగులుతున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు గడ్కరీ ఇంటి ముందు ధర్నాలకు దిగారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ జరిమానాలపై తీవ్రంగా కామెంట్లు పెడుతున్నారు. జోకులు, మెమెలతో నెటిజన్లు హడావుడి చేస్తున్నారు. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్థాయిలో జరిమానాలు విధించడం ఇష్టం లేక చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు జరిమానాలు తగ్గించడానికి కసరత్తు చేస్తున్నాయి.
గుజరాత్ బాటలో..!
బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ ఈ పెనాల్టీలపై తొలిసారి నోరు మెదిపింది. ఈ స్థాయి లో జరిమానాలు సరైన పద్ధతి కాదంటూ సగానికి సగం జరిమానాలను తగ్గించింది. దాదాపుగా 90 శాతం కేసుల్లో జరిమానాల్లో మార్పులు చేసింది. హెల్మెట్ లేకపోతే రూ.500, లైసెన్స్ లేకపోతే రూ2000... ఇలా చాలా కేసులకు సంబంధించి జరిమానాలను సగానికి సగం తగ్గించింది. ఇక గుజరాత్ బాటలోనే ఉత్తరాఖండ్ కూడా నడిచింది.
ఎన్నికలున్నాయనే...
కొత్త చట్టం కింద పన్నులు విధించడానికి కొన్ని రాష్ట్రాలు వెనక్కి తగ్గడానికి, ఎన్నికలకు సంబంధం ఉందనే విశ్లేషణ లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్, మహారాష్ట్ర, హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే మహారాష్ట్ర, జార్ఖండ్‌లు ఈ కొత్త చట్టాన్ని అమలు చేయలేమని చెప్పేశాయి. అయితే తాము తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల కోసం కాదని, ప్రజల కోసమేనని మహారాష్ట్ర అంటోంది.
భారీస్థాయిలో జరిమానాలు విధించలేమని తేల్చేసిన రాష్ట్రాలు: పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర
జరిమానాలు తగ్గించడానికి కసరత్తు చేస్తున్న రాష్ట్రాలు: పంజాబ్, గోవా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఉత్తరాఖండ్
Comments
Please login to add a commentAdd a comment