
సాక్షి, హైదరాబాద్: సినిమా థియేటర్లలో ఐదోఆటను ప్రదర్శించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పారదర్శకత కోసం త్వరలో ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయ విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ ఎగ్జిబిటర్ల సమస్యలపై మంగళవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రైవేటు వెబ్‌సైట్లు ఒక్కో టికెట్ విక్రయానికి రూ.20 నుంచి రూ.40 వరకు సర్వీసుచార్జి వసూలు చేస్తుండగా, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించే ఆన్‌లైన్ టికెట్ల విక్రయానికి కేవలం రూ.6 మాత్రమే సర్వీసుచార్జి ఉంటుందని పేర్కొన్నారు.
సినీ థియేటర్లు మూసేసిన లాక్‌డౌన్ కాలానికి సంబం ధించిన విద్యుత్‌చార్జీలు, ఆస్తిపన్ను రద్దు వంటి పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేసేందుకు అనుమతించాలని ఎగ్జిబిటర్లు విజ్ఞప్తి చేయగా, ఇప్పటికే అనుమతిచ్చామన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించుకోవడానికి కూడా అనుమతించినట్లు తెలిపారు. సినీ పరిశ్రమలోని వివిధ విభాగాల(24 క్రాఫ్ట్స్) కార్మికులకోసం చట్టాలను కఠినంగా అమలు చేస్తోందన్నా రు. సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్, సెక్రెటరీ దామోదర్ ప్రసాద్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మురళీమోహన్, సెక్రెటరీ సునీల్ నారంగ్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్, సెక్రెటరీ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment